Share News

Crime : ‘మగాడి’.. పగ!

ABN , Publish Date - Dec 26 , 2023 | 12:55 AM

: ఓ యువతి తన శరీరంలో ఏర్పడిన అసహజ మార్పులతో అతడిగా మారింది!. ఆనక తన స్నేహితురాలిని ప్రేమిస్తున్నానంటూ ‘అతడు’ వెంటపడేవాడు. ఆమె(స్నేహితురాలు) తిరస్కరించింది. దీనిని భరించలేని అతడు తన స్నేహితురాలిని

Crime : ‘మగాడి’.. పగ!

మగవాడిగా మారిన యువతి

ప్రేమించాలంటూ స్నేహితురాలిపై ఒత్తిడి

కాదన్నందుకు సజీవదహనం.. చెన్నైలో ఘోరం

చెన్నై, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): ఓ యువతి తన శరీరంలో ఏర్పడిన అసహజ మార్పులతో అతడిగా మారింది!. ఆనక తన స్నేహితురాలిని ప్రేమిస్తున్నానంటూ ‘అతడు’ వెంటపడేవాడు. ఆమె(స్నేహితురాలు) తిరస్కరించింది. దీనిని భరించలేని అతడు తన స్నేహితురాలిని చిత్రహింసలకు గురి చేసి, సజీవదహనం చేశాడు. తమిళనాడులోని మదురై జిల్లా వడివేల్‌నగర్‌కు చెందిన నందిని(25) చెన్నై దురైపాక్కంలో బంధువుల ఇంట బసచేస్తూ ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో ఇంజనీర్‌గా పనిచేస్తోంది. ఆ యువతి చిన్ననాటి స్నేహితురాలైన పాండిమురుగేశ్వరితో కలిసి గతంలో ఒకే స్కూలులో చదువుకుంది. అయితే 2019లో మురుగేశ్వరిలో మగలక్షణాలు కనిపించాయి. దీంతో మురుగేశ్వరి తన పేరును వెట్రిమారన్‌గా మార్చుకుంది. ఎం.కామ్‌ చదివిన వెట్రిమారన్‌ కూడా నగరంలోని ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. చిన్ననాటి స్నేహితురాలైన నందిని వెట్రిమారన్‌తో చనువుగా ఉండేది. ఈ నేపథ్యంలో ఇటీవల నందినిని ప్రేమిస్తున్నట్లు వెట్రిమారన్‌ తెలిపాడు. అతడి గురించి పూర్తిగా తెలిసిన నందిని అతడి ప్రేమను తిరస్కరించింది. అయితే, నందిని మరో యువకుడితో ప్రేమలో పడింది. దీంతో వెట్రిమారన్‌ ఆమెపై కక్షపెంచుకున్నాడు. మూడు రోజుల క్రితం నందిని బర్త్‌డే రోజున ఆమెకు గిఫ్ట్‌ ఇస్తానంటూ నగరశివారు తాళంబూరులో కొత్తగా నిర్మిస్తున్న కట్టడంపైకి తీసుకెళ్లాడు. మాయమాటలు చెప్పి కళ్లకు గంతలు కట్టాడు. చేతులను తాళ్లతో బంధించాడు. కత్తితో ఆమె ఒంటిపై పలుచోట్ల గాయపరిచి, తను తెచ్చుకున్న పెట్రోలును ఆమెపై పోసి నిప్పంటించి పారిపోయాడు. దీంతో నందిని మంటల్లో కాలిపోతూ పెద్దగా కేకలు పెట్టింది. గమనించిన చుట్టుపక్కలవారు మంటలార్పి ప్రభుత్వాసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. తాళంబూరు పోలీసులు నందిని సెల్‌ఫోన్‌లో నమోదైన కాల్స్‌ ఆధారంగా చివరగా ఆమె వెట్రిమారన్‌తో మాట్లాడినట్లు తెలుసుకుని, మబ్బేడు ప్రాంతంలో అతడిని అరెస్టు చేశారు. నందిని మరొకరిని ప్రేమించడాన్ని సహించలేకే హత్య చేసినట్లు వెట్రిమారన్‌ అంగీకరించాడు.

Updated Date - Dec 26 , 2023 | 12:55 AM