Delhi Minor Rape case: కారులో తప్పించుకునే ప్రయత్నం చేసిన కీచక అధికారి

ABN , First Publish Date - 2023-08-22T16:57:07+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం రేపిన బాలిక అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళా శిశు సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రేమోదయ్ ఖాఖా, ఆయన భార్య సీమా రాణి ఢిల్లీ పోలీసుల కళ్లు కప్పి కారులో తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయితే, పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఆ దంపతులు పారిపోక ముందే వారిని అరెస్టు చేశారు.

Delhi Minor Rape case: కారులో తప్పించుకునే ప్రయత్నం చేసిన కీచక అధికారి

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం రేపిన బాలిక అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళా శిశు సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రేమోదయ్ ఖాఖా, ఆయన భార్య సీమా రాణి ఢిల్లీ పోలీసుల కళ్లు కప్పి కారులో తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయితే, పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఆ దంపతులు పారిపోక ముందే వారిని అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను ఢిల్లీ పోలీసులు సంపాదించారు.


ప్రేమోదయ్ ఖాఖా, ఆయన భార్య బురారిలోని శక్తి ఎంక్లేవ్ ఇంటి నుంచి సోమవారం ఉదయం 9.35 గంటల ప్రాంతంలో కారులో తప్పించుకునేందుకు ప్రయత్నించారు. ఈ ఇద్దరూ తమ లాయర్‌తో సంప్రదింపులు సాగించారని, కోర్టు నుంచి ముందస్తు బెయిలు సంపాదించేందుకు ప్రయత్నించారని, అయితే ఈలోపే ఆ ఇద్దరిని అదుపులోనికి తీసుకున్నామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.


బాధితురాలి తండ్రి 2020 అక్టోబర్ 1న చనిపోయాడు. దాంతో అతడి స్నేహితుడైన ప్రేమోదయ్ బాలిక బాగోగులు చూసుకుంటానంటూ తన ఇంటికి తీసుకెళ్లాడు. 2020 నవంబర్-2021 జనవరి మధ్య పలుమార్లు ఆమెపై అతను అత్యాచారం జరిపినట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ విషయం తెలిసిన అతడి భార్య కూడా సహకరించింది. గుట్టుచప్పుడు కాకుండా గర్భనిరోధక మాత్రలు ఇచ్చి బాలికకు అబార్షన్‌ అయ్యేలా చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో పోక్సో చట్టంతో పలు సెక్షన్ల కింద ఇద్దరిపై కేసు నమోదైంది. ఇటీవల అనారోగ్యానికి గురై స్థానిక ఆస్పత్రిలో చేరిన బాధితురాలు గతంలో తనపై జరిగిన దారుణాన్ని అక్కడికి కౌన్సిలర్‌కు వివరించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ప్రేమేదయ్‌ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తూ సీఎం కేజ్రీవాల్ సోమవారంనాడు ఆదేశాలిచ్చారు.

Updated Date - 2023-08-22T16:57:07+05:30 IST