Delhi Sevices Bill: 7న రాజ్యసభకు ఢిల్లీ సర్వీసుల బిల్లు.. అదేరోజు చర్చ, ఓటింగ్
ABN , First Publish Date - 2023-08-05T21:20:46+05:30 IST
ఢిల్లీ ఉద్యోగుల నియామకాలు, బదలీల అధికారాన్ని లెఫ్టినెంట్ గవర్నర్‌కు కట్టబెట్టే ఢిల్లీ సర్వీసెస్ బిల్లు ఈనెల 7వ తేదీ సోమవారంనాడు పెద్దల సభ ముందుకు రాబోతోంది. ఆర్డినెన్స్ స్థానే లోక్‌సభలో తీసుకువచ్చిన నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (అమెండమెంట్) బిల్లు-2023 ఇప్పటికే విపక్ష సభ్యుల ఆందోళన, వాకౌట్ల మధ్య లోక్‌సభ ఆమోదం పొందింది.
న్యూఢిల్లీ: ఢిల్లీ ఉద్యోగుల నియామకాలు, బదలీల అధికారాన్ని లెఫ్టినెంట్ గవర్నర్‌కు కట్టబెట్టే ఢిలలీ సర్వీసెస్ బిల్లు (Delhi Services Bill) ఈనెల 7వ తేదీ సోమవారంనాడు పెద్దల సభ (Rajya Sabha) ముందుకు రాబోతోంది. ఆర్డినెన్స్ స్థానే లోక్‌సభలో తీసుకువచ్చిన నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (అమెండమెంట్) బిల్లు-2023 ఇప్పటికే విపక్ష సభ్యుల ఆందోళన, వాకౌట్ల మధ్య లోక్‌సభ ఆమోదం పొందింది. రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందకుండా కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే విపక్ష నేతల మద్దతు కూడగట్టింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సర్వీసుల బిల్లును ఇటు అధికార పక్షం, ఇటు విపక్షాలు కీలకంగా తీసుకున్నాయి. రాజ్యసభ ముందు బిల్లు ప్రవేశపెట్టిన ప్రవేశపెట్టిన రోజే దీనిపై చర్చ, అనంతరం సాయంత్ర దీనిపై ఓటింగ్ నిర్వహించనున్నారు.
బలాబలాలు ఇవే...
కాగా, రాజ్యసభలో బలాబలాల ప్రకారం, ఎన్డీయేకు 106 మంది సభ్యుల బలం ఉండగా, 26 పార్టీల విపక్ష కూటమి ఇండియా (I.N.D.I.A.)కు 98 మంది సభ్యుల బలం ఉంది. ఏపార్టీతోనూ పొత్తులేని సభ్యులు 29 మంది ఉన్నారు. విపక్ష కూటమికి ఏడుగురు ఎంపీల బీఆర్ఎస్ అనుకూలంగా ఉండగా, అధికార కూటమికి బీజేడీ, వైఎస్ఆర్‌సీపీ మద్దతు ప్రకటించాయి. రెండు పార్టీలకు చెరో తొమ్మిది మంది ఎంపీలు ఉన్నారు.