Share News

Democracy at stake : ప్రమాదంలో ప్రజాస్వామ్యం

ABN , Publish Date - Dec 23 , 2023 | 03:52 AM

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కారణంగా దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించటానికి దేశ ప్రజలందరూ సమైక్యం కావాలని, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చాయి.

Democracy at stake : ప్రమాదంలో ప్రజాస్వామ్యం

ప్రజలందరూ సమైక్యం కావాలి..

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలి.. ఇండియా కూటమి పిలుపు

న్యూఢిల్లీ, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కారణంగా దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించటానికి దేశ ప్రజలందరూ సమైక్యం కావాలని, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చాయి. పార్లమెంటులో చొరబాటు ఘటనపై ప్రధాని, హోంమంత్రి ప్రకటన చేయాలని డిమాండ్‌ చేసినందుకు 146 మంది విపక్ష ఎంపీలను ఉభయ సభల నుంచి సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. దీనిని వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష కూటమి ఇండియా శుక్రవారం దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టింది. రాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద జరిగిన కార్యక్రమంలో ఇండియా కూటమి పార్టీలు కాంగ్రెస్‌, డీఎంకే, ఎన్సీపీ, ఎస్పీ, ఎన్సీ, తృణమూల్‌, జేఎంఎం, ఆర్జేడీ, వామపక్షాలు తదితర పార్టీలకు చెందిన నేతలు, సస్పెన్షన్‌కు గురైన ఎంపీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ, ‘మమ్మల్ని ఎంతగా అణిచివేయాలని చూస్తే అంతగా పైకి లేస్తాం. మోదీ అహంకారం ఎంత పెరిగిందంటే 400 సీట్లు గెలుస్తామని ఆయన కలలు కంటున్నారు.

కానీ, మోదీని గద్దెనెక్కించిన ప్రజలకు ఆయనను ఎలా దించాలో బాగా తెలుసు’ అని చెప్పారు. తాను దళిత సామాజికవర్గానికి చెందిన వ్యక్తినని అత్యున్నత రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారే చెప్పి అవమానిస్తున్నారని, పార్లమెంటులో నోటీసును కూడా చదవటానికి అనుమతినివ్వటం లేదని ఆరోపించారు. మోదీ ప్రభుత్వంలో దళితులు మాట్లాడటానికి కూడా అవకాశం ఉండదా అని ప్రశ్నించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ధ్వంసం చేసే బాధ్యతను మోదీ, అమిత్‌షా తీసుకున్నారని ఖర్గే దుయ్యబట్టారు. దేశంలో బీజేపీ విద్వేషాన్ని వ్యాపింపజేస్తే, ఇండియా పార్టీలు ప్రేమను, సహోదరభావాన్ని పంచుతున్నాయని.. భారతీయులను మోదీ భయపెట్టలేరని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ అన్నారు. పార్లమెంటు నుంచి 146 మంది ఎంపీలను సస్పెండ్‌ చేయటం ద్వారా 60ు మంది భారతీయుల గొంతుకను నొక్కి పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగం కారణంగా, చేసేందుకు పని లేక, దేశ యువత సగటున ఏడున్నర గంటలపాటు మొబైల్‌ఫోన్లలో సోషల్‌మీడియా చూస్తూ కాలం గడుపుతున్నారని చెప్పారు. ఎంపీల సస్పెన్షన్‌పై మీడియా వైఖరిని రాహుల్‌ తప్పుబట్టారు. 146మంది ఎంపీలను సస్పెండ్‌ చేసినా మీడియా ఆ అంశానికి ప్రాధాన్యం ఇవ్వలేదని, తాను రికార్డు చేసిన వీడియోకు (ధన్‌ఖడ్‌ను ఓ ఎంపీ అనుకరించిన దృశ్యాలకు) మాత్రం ఎనలేని ప్రాధాన్యత ఇచ్చిందని విమర్శించారు. ‘పార్లమెంటులోకి ఇద్దరు చొరబడిన సమయంలో బీజేపీ ఎంపీలందరూ పరుగులు తీశారు. వాళ్లని వాళ్లు దేశభక్తులమని చెప్పుకొంటారు. కానీ, వారు ఎంత భయపడ్డారో మేం ప్రత్యక్షంగా చూశాం’ అని రాహుల్‌ ఎద్దేవా చేశారు.

దేనికైనా సిద్ధం: శరద్‌పవార్‌

ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ ప్రసంగిస్తూ.. ‘రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కార్మికులు సరైన వేతనాల్లేక అసంతృప్తితో ఉన్నారు. దళితులు ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ సమయంలో మనం బాధ్యత తీసుకోవాలి. శ్రమించాలి. బీజేపీని ఓడించాలి’ అని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించటానికి ఇండియా కూటమి నేతలు ఏ మూల్యాన్ని చెల్లించటానికైనా సిద్ధమేనన్నారు. బీజేపీ చెబుతున్న అమృతకాలంపై సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. క్షీరసాగర మథనంలో పుట్టిన అమృతాన్ని తొలుత రాక్షసులు తీసుకున్నట్లుగా, ప్రస్తుతం కూడా అమృతం తప్పుడు వ్యక్తుల చేతుల్లో ఉందని, దానిని వెనక్కి తీసుకోవాలని చెప్పారు.

నితీశ్‌కు రాహుల్‌ ఫోన్‌

ఇండియా కూటమి తరఫున ప్రధాని అభ్యర్థిగా ఖర్గే పేరు ప్రస్తావనకు రావటంతో నితీశ్‌ అలకబూనారన్న వార్తల నేపథ్యంలో, ఆయనతో కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ శుక్రవారం ఫోన్‌లో మాట్లాడారు. తమ పార్టీ వైఖరిని నితీశ్‌కు వివరించారు. కూటమి బలోపేతం, బిహార్‌లో క్యాబినెట్‌ విస్తరణ తదితర అంశాలపై వారు మాట్లాడుకున్నట్లు జేడీయూ వర్గాలు తెలిపాయి. ఇటీవల ఇండియా భేటీలో ప్రధాని అభ్యర్థిగా ఖర్గే పేరును మమతా బెనర్జీ ప్రతిపాదించగా, కేజ్రీవాల్‌ సమర్థించిన విషయం తెలిసిందే. అయితే, ఈ ప్రతిపాదనను ఖర్గే తిరస్కరించారు. కాగా, ఇండియా కూటమి పార్టీలు జనవరి కల్లా సీట్ల సర్దుబాటు చేసుకొని, ఉమ్మడి కనీస కార్యక్రమంతో ప్రచార రంగంలోకి దూకాలని కూటమి భేటీలో నితీశ్‌కుమార్‌ సూచించినట్లు సమాచారం. మరోవైపు, శుక్రవారం శరద్‌పవార్‌ నివాసంలో ఆయనతో రాహుల్‌గాంధీ ప్రత్యేకంగా చర్చలు జరిపారు. మహారాష్ట్రలో శివసేన (ఉద్ధవ్‌)-కాంగ్రె్‌స-ఎన్సీపీ మధ్య సీట్ల పంపకాలపై వారిరువురు మాట్లాడుకున్నట్లు సమాచారం.

Updated Date - Dec 23 , 2023 | 03:52 AM