Dev Raturi: ఒకప్పుడు వెయిటర్.. ఇప్పుడు చైనా పుస్తకాల్లో అతనిపై పాఠం.. అసలెవరితను?
ABN , First Publish Date - 2023-07-26T19:53:42+05:30 IST
సాధారణంగా మన ఇండియన్ సినిమాల గురించి విదేశీ పత్రికల్లో ప్రస్తావిస్తేనే మనం ఎంతో గర్వంగా ఫీల్ అవుతాం. మన భారతీయ సినిమా...
సాధారణంగా మన ఇండియన్ సినిమాల గురించి విదేశీ పత్రికల్లో ప్రస్తావిస్తేనే మనం ఎంతో గర్వంగా ఫీల్ అవుతాం. మన భారతీయ సినిమా ఖ్యాతి ప్రపంచ స్థాయికి ఎగబాకిందని గొప్పగా చెప్పుకుంటాం. అలాంటిది.. ఓ భారతీయుడిపై విదేశీ పాఠశాల పుస్తకాల్లో ఓ పాఠం చేర్చితే ఇంకెలా ఉంటుంది? మనోడురా అంటూ కాలర్ ఎగరేస్తాం. ఇప్పుడు అలాంటి అరుదైన గౌరవాన్నే దేవ్ రతూఢీ దక్కించుకున్నాడు. ఒకప్పుడు పొట్టకూటి కోసం వెయిటర్‌గా పని చేసిన దేవ్.. ఇప్పుడు చైనాలో మోస్ట్ పాపులర్ నటుల్లో ఒకడిగా ఎదిగాడు. జీరో నుంచి హీరోగా ఎదిగిన ఆయన జీవితం ఎంతో స్ఫూర్తిదాయమైనది కావడంతో.. అక్కడి విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేందుకు ఆయనపై ఒక పాఠ్యాంశాన్ని చేర్చారు.
ఈ దేవ్ రతూఢీ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని తెహ్రీ గర్వాల్ జిల్లాలో కెమ్రియా సౌర్ అనే గ్రామంలో 1976లో జన్మించాడు. ఆయన తండ్రి ఒక రైతు. చిన్నప్పటి నుంచే ఆయన బ్రూస్ లీకి వీరాభిమాని. ఆ అభిమానంతో కరాటే ఛాంపియన్‌గా ఎదగాలని దేవ్ అనుకున్నాడు. కానీ.. కుటుంబ ఆర్థిక సమస్యల కారణంగా, తన కలని పక్కనపెట్టేశాడు. దాదాపు పదేళ్ల పాటు చిన్నాచితక పనులు చేసి, కుటుంబాన్ని పోషించాడు. 2005లో చైనాలోని ఓ భారత రెస్టారెంట్‌లో రూ.10 వేల జీతానికి ఉద్యోగంలో చేరాడు. అక్కడి నుంచి అంచలంచెలుగా ఎదుగుతూ.. ఓ ప్రముఖ హోటల్‌లో మేనేజర్‌గా ఉద్యోగం సాధించాడు. ఆదాయం పెరగడంతో.. చైనాలోని షియాన్ సిటీలో రెడ్ ఫోర్ట్ పేరుతో ఒక రెస్టారెంట్‌ని ప్రారంభించాడు. ఆ తర్వాత బీజింగ్‌తో పాటు ఇతర నగరాల్లోనూ బ్రాంచీలు ఓపెన్ చేశాడు.
ఇలా బిజినెస్‌లో దూసుకుపోతున్న దేవ్ రతూఢీకి 2016లో ఒక ఆఫర్ వచ్చింది. ఆయన రెస్టారెంట్‌కు వచ్చిన ఓ దర్శకుడు.. సినిమాల్లో నటిస్తావా? అని అడగ్గా.. అందుకు ఆయన సరేనని తలూపారు. అలా ‘స్పెషల్ స్వాట్’ అనే ఓ చైనీస్ వెబ్ సిరీస్‌లో ఆయనకు నెగెటివ్ రోల్‌లో నటించే ఛాన్స్ దక్కింది. అది పెద్ద హిట్ అవ్వడంతో దేవ్ నటనకు మంచి పేరు రావడంతో.. ఆయనకు వరుసగా అవకాశాలు వచ్చాయి. ఇప్పటివరకూ 35 చైనీస్ సినిమాలు, సిరీస్‌లలో నటించిన ఆయన.. చైనా సినీరంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సాధించారు. ఇలా వెయిటర్ నుంచి పాపులర్ నటుడిగా, బెస్ట్ సీఈవోగా ఎదగడంతో.. విద్యార్థుల్లో ప్రేరణ కలిగించేందుకు దేవ్ స్పూర్తిదాయక ప్రస్థానంపై ఏడో తరగతి ఇంగ్లీష్ పుస్తకాల్లో పాఠ్యాంశాన్ని తీసుకొచ్చింది షాంగ్జీ ప్రావిన్స్.