PM Modi: బఘేల్ సర్కార్ మహాదేవ్ పేరును కూడా వదిలిపెట్టలేదు.. కాంగ్రెస్‌పై మండిపడ్డ మోదీ
ABN , First Publish Date - 2023-11-04T14:58:07+05:30 IST
కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల ప్రచారానికి నిధుల కోసం అక్రమ బెట్టింగ్ నిర్వాహకుల నుండి హవాలా డబ్బును ఉపయోగిస్తోందని ప్రధాని మోదీ శనివారం ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్(Chattisgarh)లో ఎన్నికల ప్రచారం సందర్భంగా దుర్గ్(Durg)లో జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడారు.
రాయ్‌పుర్: కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల ప్రచారానికి నిధుల కోసం అక్రమ బెట్టింగ్ నిర్వాహకుల నుండి హవాలా డబ్బును ఉపయోగిస్తోందని ప్రధాని మోదీ శనివారం ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్(Chattisgarh)లో ఎన్నికల ప్రచారం సందర్భంగా దుర్గ్(Durg)లో జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్‌కు(Bhupesh Baghel) సంబంధించిన బెట్టింగ్ యాప్(Mahadev Betting App) ఆరోపణల మధ్య ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల ప్రచారానికి నిధులు సమకూర్చేందుకు అక్రమ బెట్టింగ్ నిర్వాహకులు తీసుకొచ్చిన హవాలా డబ్బును కాంగ్రెస్ ఉపయోగించుకుంటోందని అన్నారు. మహాదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్లు బఘేల్‌కు రూ. 508 కోట్లు చెల్లించినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) శుక్రవారం ఆరోపించడంతో రాష్ట్రంలో పెనుదుమారం రేగింది.
మోదీ మాట్లాడుతూ.. "మేం చెప్పినట్టు చేయడమే భారతీయ జనతా పార్టీ ట్రాక్ రికార్డ్. ఛత్తీస్‌గఢ్‌ను బీజేపీ ఏర్పాటు చేసింది. బాధ్యతతో మరింత అభివృద్ధి మార్గంలో తీర్చిదిద్దేందుకు సిద్ధంగా ఉన్నాం. కానీ కాంగ్రెస్(Congress) పార్టీకి అభివృద్ధి చేయడం సాధ్యం కాదు. అవినీతి ద్వారా ఖజానాను నింపుకోవడమే కాంగ్రెస్ పార్టీ పని. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం మిమ్మల్ని దోచుకునే ఏ ఒక్క ఛాన్స్ ని వదలిపెట్టదు. వారు 'మహాదేవ్' పేరును కూడా వాడుకున్నారు. రెండు రోజుల క్రితం, రాయ్‌పూర్‌లో పెద్ద ఆపరేషన్ జరిగింది. భారీగా కరెన్సీ నోట్లు దొరికాయి. అవన్నీ ఎవరికి వెళ్తున్నాయో ప్రజలందరికీ తెలుసు. దోచుకున్న డబ్బుతో కాంగ్రెస్ నేతలు ఇళ్లను నింపుకుంటున్నారు. దుబాయ్‌లో ఉన్నవారితో ముఖ్యమంత్రికి ఉన్న సంబంధాలను బయటపెట్టాలి. కాంగ్రెస్ మోదీని పగలు, రాత్రి దూషిస్తోంది. కానీ ముఖ్యమంత్రి ఇప్పుడు దేశంలోని దర్యాప్తు సంస్థలను కూడా దుర్భాషలాడడం మొదలుపెట్టారు. మోదీ దూషణలకు భయపడరని నేను ఛత్తీస్‌గఢ్ ప్రజలకు చెప్పాలనుకుంటున్నాను. అవినీతిపరులను ఎదుర్కోవడానికి మోదీని ప్రధానిని చేశారు. ఆ పనిలో ఉన్నాను. ఛత్తీస్‌గఢ్‌ను దోచుకున్న వారిపై చర్యలు తీసుకుంటాం. ప్రతి పైసా వారి నుంచి వాపస్ తీసుకుంటాం. ఛత్తీస్‌గఢ్‌లోని అవినీతి ప్రభుత్వం మీ ఆకాంక్షలను విచ్చిన్నం చేసింది. రాష్ట్రంలో బీజేపీ(BJP) ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇలాంటి మోసాలపై కఠినంగా విచారణ జరిపి మిమ్మల్ని దోచుకున్న వారిని జైలుకు పంపిస్తాం" అని దుర్గ్‌లో ప్రధాని అన్నారు. రూ. 500 కోట్లకు పైగా కిక్‌బ్యాక్ అందుకున్నారనే ఆరోపణపై ఈరోజు తెల్లవారుజామున, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ(Smrithi Irani).. భూపేష్ బఘేల్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. "సత్తా (పవర్) మే రహ్ కర్ సత్తా (బెట్టింగ్) కా ఖేల్ ఖేలా హై (అతను అధికారంలో ఉన్నప్పుడు బెట్టింగ్ గేమ్ ఆడాడు)" అని ఆమె ఆరోపించారు. నవంబర్ 7, 17 తేదీల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తనను లక్ష్యంగా చేసుకోవడానికి కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ ఉపయోగించుకుంటోందని ముఖ్యమంత్రి ఆరోపించారు.