DK Shivakumar: డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు.. మా సర్కారును కూల్చేందుకు కుట్ర
ABN , First Publish Date - 2023-07-28T11:35:16+05:30 IST
ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర సాగుతోందని మూడురోజుల కిందట డీసీఎం డీకే శివకుమార్(DCM DK Shivakumar) చేసిన వ్యాఖ్యలు హల్‌ఛల్
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర సాగుతోందని మూడురోజుల కిందట డీసీఎం డీకే శివకుమార్(DCM DK Shivakumar) చేసిన వ్యాఖ్యలు హల్‌ఛల్ చేసిన విషయం తెలిసిందే. సింగపూర్‌లో కూర్చొని తమ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అయితే అప్పటికి సింగపూర్‌లో రాష్ట్రానికి చెందిన కాంగ్రేసేతర పార్టీల నాయకులు ఎవరూ లేరు. కానీ ప్రస్తుతం ఇద్దరు ముఖ్యనేతలు యూరప్ పర్యటనలో ఉండటం సర్వత్రా చర్చకు కారణమవుతోంది. జేడీఎస్ నేత, మాజీ సీఎం కుమారస్వామి(Former CM Kumaraswamy) భార్య అనితతో పాటు కుమారుడు నిఖిల్, కోడలు, మనవడితో కలిసి యూరప్ పర్యటనకు వెళ్ళారు. యూరప్ దేశంలోని పిన్య్లాండ్‌లో ఉన్నారు. కుమారస్వామి యూర్‌పకు వెళ్ళి దాదాపు వారం రోజులు అవుతోంది. తాజాగా బుధవారం రాత్రి బీజేపీ ముఖ్యనేత, మాజీ సీఎం యడియూరప్ప(Former CM Yeddyurappa) కుమారుడు విజయేంద్రతో కలిసి వారం రోజుల యూరప్ పర్యటకు వెళ్ళారు.
ఇద్దరు కీలక నేతలు యూరప్ పర్యటనలో ఉండటం ఇక్కడ ప్రత్యేకమనిపిస్తోది. కాకతాళీయమో లేక ముందస్తు నిర్ణయమో కానీ ఇద్దరూ ఒకే దేశంలో పర్యటనకు వెళ్ళడంతో డీసీఎం డీకే శివకుమార్ వ్యాఖ్యలకు మరింత బలాన్ని చేకూర్చినట్లు అవుతోంది. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే పరిస్థితి లేదనేది తెలిసిందే. అయితే ఇద్దరూ నేతలు యూరప్ పర్యటనలో భేటీ అయితే రానున్న లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన అంశంపై పొత్తుల విషయం ఖరారు కానుందనే చర్చలు జోరందుకుంటున్నాయి.