India Name Change: పుస్తకాల్లో ఇండియా పేరు మార్పు.. ఇండియా కూటమికి మోదీ భయపడుతున్నారంటూ విపక్షాల మండిపాటు
ABN , First Publish Date - 2023-10-25T21:06:59+05:30 IST
‘ఇండియా’ కూటమి ఏర్పడినప్పటి నుంచి మన దేశం పేరు మార్పుపై తెగ చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా.. జీ20 సదస్సు అతిథులకు పంపిన రాష్ట్రపతి విందు ఆహ్వాన పత్రికల్లో ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని ముద్రించినప్పటి నుంచి...
‘ఇండియా’ కూటమి ఏర్పడినప్పటి నుంచి మన దేశం పేరు మార్పుపై తెగ చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా.. జీ20 సదస్సు అతిథులకు పంపిన రాష్ట్రపతి విందు ఆహ్వాన పత్రికల్లో ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని ముద్రించినప్పటి నుంచి ఈ పేరు మార్పు అంశం హాట్ టాపిక్‌గా మారింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరి చూస్తుంటే.. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల సమయంలో ఇండియా పేరుని భారత్‌గా మార్చే తీర్మానం తీసుకురావొచ్చని అనుమానాలూ వ్యక్తమయ్యాయి. ఆ సమయంలో ఈ అంశంపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇండియా కూటమికి భయపడే భారత్ పేరుని మార్చాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అయితే.. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీ ఆ తీర్మానం చేయలేదు.
బహుశా భవిష్యత్తులో దేశం పేరు మార్పు ఉంటుందో లేదో తెలీదు కానీ.. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై పుస్తకాల్లో ఇండియా (INDIA) అనే పేరు వాడొద్దని, దాని స్థానంలో భారత్ అనే పేరు మాత్రమే వాడాలని ప్యానెల్ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో ఇప్పుడు మళ్లీ దేశ రాజకీయాలు వేడెక్కాయి. ఈ పేరు మార్పుపై విపక్ష నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు ప్రియాంక కక్కర్ మాట్లాడుతూ.. ఇండియా కూటమిని చూసి ప్రధాని మోదీ ఎంతలా భయపడుతున్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇలా పేరు మార్చడానికి బదులు.. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, అవినీతి సమస్యలపై మోదీ దృష్టి పెట్టే ప్రయత్నం చేయాలని సూచించారు.
కర్ణాటక డిప్యూటీ సిఎం డీకే శివకుమార్ కూడా ఈ అంశంపై విరుకుపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భారతదేశ నిర్మాణాన్ని మార్చాలని అనుకుంటోందని దుయ్యబట్టారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అని మనం ఎందుకు చెబుతున్నామని ప్రశ్నించారు. మన పాస్‌పోర్ట్‌లన్నింటిలోనూ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అని ముద్రించి ఉంటుందని పేర్కొన్నారు. ఈ బీజేపీ ప్రభుత్వం ఏదో తప్పు చేస్తోందని సందేహం వ్యక్తం చేశారు. అయినా మనమంతా భారతీయులం కాదని ఎవరు చెప్పారని నిలదీశారు. మనం భారతీయులమని గర్విస్తున్నామని తెలిపారు. అటు.. తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు, ప్రజల దృష్టిని మరల్చేందుకు బీజేపీ ఈ పేరు మార్చే రాజకీయాలు చేస్తోందని డీఎంకే అధికార ప్రతినిధి శరవణన్ విమర్శించారు.
ఇదిలావుండగా.. కొత్త పుస్తకాల్లో పేర్లు మార్చాలని గతంలోనే ప్రతిపాదన ఉండేదని ఎన్‌సీఈఆర్‌టీ కమిటీ చైర్మన్ సీఐ ఐజాక్ తెలిపారు. ఇప్పుడు ఆమోదం తెలపడంతో.. ప్రతిపాదన అమల్లోకి రానున్నట్లు పేర్కొన్నారు. పాఠ్యపుస్తకాల్లో ప్రాచీన చరిత్రకు బదులు.. క్లాసికల్ హిస్టరీని కూడా చేర్చాలని సిఫారసు చేశామన్నారు. పాఠ్యపుస్తకాల్లో వివిధ పోరాటాల్లో హిందూ విజయాలను ఎత్తిచూపాలని కమిటీ సిఫార్సు చేసిందని.. ప్రస్తుత పుస్తకాల్లో మన వైఫల్యాలను మాత్రమే ప్రస్తావించారని అన్నారు.