G20 Summit : మూడు రోజులు మూతపడనున్న ఢిల్లీ నగరం

ABN , First Publish Date - 2023-08-22T12:25:28+05:30 IST

దేశ రాజధాని నగరం ఢిల్లీ, నగర పాలక సంస్థ ప్రాంతాలు మూడు రోజులపాటు జన సంచారం లేక బోసిపోబోతున్నాయి. జీ20 నేతల సమావేశాల నేపథ్యంలో విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటించబోతుండటంతోపాటు రవాణా వ్యవస్థలపై కూడా ఆంక్షలు విధించబోతున్నారు.

G20 Summit : మూడు రోజులు మూతపడనున్న ఢిల్లీ నగరం

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరం ఢిల్లీ, నగర పాలక సంస్థ ప్రాంతాలు మూడు రోజులపాటు జన సంచారం లేక బోసిపోబోతున్నాయి. జీ20 నేతల సమావేశాల నేపథ్యంలో విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటించబోతుండటంతోపాటు రవాణా వ్యవస్థలపై కూడా ఆంక్షలు విధించబోతున్నారు. వచ్చే నెల 8, 9, 10 తేదీల్లో జరిగే ఈ సమావేశాల కోసం చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

జీ20 దేశాధినేతల సమావేశాలు సజావుగా జరగడం కోసం కట్టుదిట్టమైన చర్యలను అమలు చేస్తున్నారు. దీంతో మాల్స్, మార్కెట్లు, విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల కార్యకలాపాలు ప్రభావితం కాబోతున్నాయి. వచ్చే నెల 8, 9, 10 తేదీల్లో ఈ ఆంక్షలు అమలవుతాయి. విద్యా బోధనకు ఆన్‌లైన్‌ సేవలను ఉపయోగించుకోవాలని, లేదంటే, పాఠశాలలను మూసేయాలని ఆదేశించే అవకాశం ఉంది. వచ్చే నెల 7 అర్ధరాత్రి నుంచి ఈ ఆంక్షలు అమల్లోకి వస్తాయి.

ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడం వల్ల సామాన్య ప్రజలకు తీవ్రమైన అసౌకర్యం ఏమీ ఉండదు. వీఐపీలు ప్రయాణించేటపుడు మాత్రమే ట్రాఫిక్‌పై ఆంక్షలు విధిస్తారు.


- నిత్యావసర వస్తువులను రవాణా చేసే వాహనాలు మినహా మిగతా భారీ వాహనాలను ఢిల్లీ నగర పాలక సంస్థ, న్యూఢిల్లీ నగరాల్లోకి ప్రవేశించనివ్వరు.

- ఢిల్లీ విమానాశ్రయం నుంచి 18 హోటళ్లకు వెళ్లే మార్గాల్లో విదేశీ ప్రతినిధులను తీసుకెళ్తారు. వీటిలో 16 హోటళ్లు ఢిల్లీలోనూ, రెండు హోటళ్లు గురుగ్రామ్‌లోనూ ఉన్నాయి. హోటళ్ల నుంచి సభా స్థలం ప్రగతి మైదాన్‌కు, రాజ్‌ఘాట్‌కు తీసుకెళ్తారు.

- ఢిల్లీ విమానాశ్రయం పరిసరాల్లో ట్రాఫిక్‌ను నిర్దిష్ట సమయాల్లో నియంత్రిస్తారు.

- డీటీసీ ప్రజా రవాణా బస్సులను ఇతర మార్గాల్లో నడుపుతారు.

ఇదిలావుండగా, ట్రాఫిక్ పోలీసులు సోమవారం రిహార్సల్స్ చేశారు. విమానాశ్రయం నుంచి వివిధ హోటళ్లకు, అక్కడి నుంచి సభా ప్రాంగణం ప్రగతి మైదానం వరకు, ఇతర చోట్లకు వాహనాలను నడిపారు. విదేశీ నేతలను తీసుకెళ్లి, తీసుకురావడానికి ఎంత సమయం పడుతుందో అంచనా వేశారు. అదేవిధంగా ట్రాఫిక్ ఆంక్షల పట్ల వాహన చోదకులు, సామాన్యులు ఏ విధంగా స్పందిస్తారో తెలుసుకున్నారు.

వర్చువల్ హెల్ప్ డెస్క్

సమీపంలోని ఆసుపత్రులు, మార్కెట్లు, ఆకర్షణీయ ప్రదేశాలు, ట్రాఫిక్ పోలీసులు జారీ చేసే సూచనలు, వాహనాల కదలికలు వంటివాటిని అన్ని భాషల్లోనూ తెలియజేసేందుకు ఓ వర్చువల్ హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేస్తామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. విదేశీ నేతలు, అతిథులు, సామాన్య ప్రజానీకం వర్చువల్ హెల్ప్ డెస్క్‌ ద్వారా ఈ సమాచారాన్ని పొందవచ్చునని తెలిపారు.


ఇవి కూడా చదవండి :

Surgical Strike : భారత్ మళ్లీ పాకిస్థాన్‌పై సర్జికల్ స్ట్రేక్ చేసిందా?

Bharat NCAP : కార్లకు రేటింగ్ ఇచ్చే పథకాన్ని ప్రారంభించిన నితిన్ గడ్కరీ

Updated Date - 2023-08-22T12:25:28+05:30 IST