Earthquake: మేఘాలయలో భూకంపం.. అస్సాం, ఈశాన్య ప్రాంతాల్లో ప్రకంపనలు.. రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రత నమోదు
ABN , First Publish Date - 2023-10-02T20:37:45+05:30 IST
సోమవారం సాయంత్రం మేఘాలయలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రత నమోదైనట్టు తేలింది. దీంతో.. అస్సాం, ఈశాన్య ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి. అయితే.. ప్రాణనష్టం, ఆస్తినష్టాలపై...
సోమవారం సాయంత్రం మేఘాలయలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రత నమోదైనట్టు తేలింది. దీంతో.. అస్సాం, ఈశాన్య ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి. అయితే.. ప్రాణనష్టం, ఆస్తినష్టాలపై ఇంకా పూర్తిగా అధికారిక సమాచారం అందలేదు. సాయంత్రం 6:15 గంటల సమయంలో మేఘాలయను భూకంపం కుదిపేసినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. జిల్లా కేంద్రమైన రెసుబెల్‌పరా నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న నార్త్ గారో హిల్స్‌లో 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్టు తేలింది. దీని ధాటికి అస్సాం, ఉత్తర బెంగాల్, సిక్కింలో ప్రకంపనలు వచ్చాయి. ప్రాణ, ఆస్తి నష్టాలకు సంబంధించి తమకు ఇంకా నివేదిక అందాల్సి ఉందని ఓ అధికారి తెలిపారు.
ఇదిలావుండగా.. ఈశాన్య ప్రాంతాల్లో తరచూ భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. ఈ ఏడాది ఆగస్టు నెలలోనూ మేఘాలయలో 5.4 తీవ్రతతో భూకంపం వచ్చింది. సాయంత్రం 8:19 గంటల సమయంలో ఈ భూకంపం సంభవించినట్టు రిపోర్ట్స్ తెలిపాయి. మేఘాలయలోని చిరపుంజీకి ఆగ్నేయంగా 49 కిలోమీటర్ల దూరంలో బంగ్లాదేశ్ సరిహద్దులోని సిల్హెట్ సమీపంలో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించారు. 16 కిలోమీటర్ల లోతులో ఈ భూంకంపం సంభవించగా, ఎలాంటి ప్రాణ-ఆస్తి నష్టం జరగలేదు. అటు.. అక్టోబర్ 1వ తేదీన రాత్రి 11:26 గంటల సమయంలో హర్యానాలోనూ భూంకంపం వచ్చింది. రోహ్‌తక్‌లో 2.6 తీవ్రతతో ఐదు కిలోమీటర్ల దిగువన భూకంపం సంభవించిందని.. రోహ్‌తక్‌కు తూర్పు ఆగ్నేయంగా 7 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని (NFS) పేర్కొంది.