ED Raids: ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ నేతల ఇళ్లలో ఈడీ సోదాలు
ABN , First Publish Date - 2023-02-21T02:43:45+05:30 IST
ఛత్తీస్‌గఢ్ బొగ్గు గనుల కుంభకోణం కేసులో ఈడీ మరోసారి దాడులు నిర్వహించింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఛత్తీస్‌గఢ్ లోని అధికార కాంగ్రెస్ నేతల ఇళ్లు, ఇతర ప్రాంతాల్లో సోమవారం ఈడీ అధికారులు సోదాలు చేశారు.
బొగ్గు కుంభకోణం కేసులో మళ్లీ దాడులు
4 రోజుల్లో రాయ్‌పూర్‌లో కాంగ్రెస్ ప్లీనరీ
నేపథ్యంలో దర్యాప్తు సంస్థ పంజా
ఇవి రాజకీయ ప్రతీకార దాడులే
ఇలాంటి వాటికి మేం భయపడం: కాంగ్రెస్
కాంగ్రెస్ ఆరోపణలు సిగ్గుచేటు: నిర్మల
న్యూఢిల్లీ/రాయ్‌పూర్, ఫిబ్రవరి 20: ఛత్తీస్‌గఢ్ బొగ్గు గనుల కుంభకోణం కేసులో ఈడీ మరోసారి దాడులు నిర్వహించింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఛత్తీస్‌గఢ్ లోని అధికార కాంగ్రెస్ నేతల ఇళ్లు, ఇతర ప్రాంతాల్లో సోమవారం ఈడీ అధికారులు సోదాలు చేశారు. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో ఈ నెల 24 నుంచి 26 వరకు కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ జరగనుంది. ఈ సమావేశాలకు ముందు ఈడీ దాడులు జరగడం గమనార్హం. ఎమ్మెల్యే దేవేంద్ర యాదవ్, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కోశాధికారి రామ్‌గోపాల్ అగర్వాల్, రాష్ట్ర భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ సుశీల్ సన్నీ అగర్వాల్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్పీ సింగ్ ఇళ్లతోపాటు 10కి పైగా ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. మరికొంతమంది అధికార పార్టీ నేతల నివాసాల్లోనూ దాడులు చేశారు. సహజ వనరులు అధికంగా ఉన్న ఛత్తీస్‌గఢ్ లో బొగ్గు లెవీ కుంభకోణం రూపంలో గడిచిన రెండేళ్లలో రూ.450 కోట్ల మేరకు భారీ దోపిడీ కుట్ర జరిగిందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ ఫిర్యాదు మేరకు ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపడుతోంది. ఈ కుంభకోణంలో బినామీలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ డిప్యూటీ కార్యదర్శి చౌరాసియా, ఐఏఎస్ అధికారి సమీర్ విష్ణోయ్, సూర్యకాంత్ తివారీ, బొగ్గు వ్యాపారవేత్త సునీల్ అగర్వాల్ సహా తొమ్మిది మందిని ఈడీ ఇప్పటికే అరెస్టు చేసింది. వారి ఆస్తులనూ అటాచ్ చేసింది.
రాజకీయ ప్రతీకార దాడులే: కాంగ్రెస్
ఈడీ సోదాలను కాంగ్రెస్ ఖండించింది. ఈ దాడులకు నిరసనగా సోమవారం ఉదయం రాయ్‌పూర్‌లోని ఈడీ ఆఫీసు వద్ద నిరసన ప్రదర్శన చేపట్టింది. 24 నుంచి 26 వరకు పార్టీ ప్లీనరీ నేపథ్యంలోనే ఈ దాడులు జరుగుతున్నాయని, ఇవేమీ తమను అడ్డుకోలేవని ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ స్పష్టంచేశారు. పూర్తిగా రాజకీయ ప్రతీకార దాడులేనన్నారు. ‘భారత్ జోడో యాత్ర’ విజయవంతం కావడం, అదానీ గ్రూపు లింకులు బయటకు రావడంతో బీజేపీ నిరాశ చెందుతోందని చెప్పారు. ఈ అంశాల నుంచి దృష్టిని మళ్లించేందుకే సోదాలు నిర్వహిస్తున్నట్లు ఆరోపించారు. ఇలాంటి చర్యలు కాంగ్రెస్ నేతలను భయపెట్టలేవన్నారు. ఈ దాడులు ప్రధాని మోదీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని జైరాం రమేశ్ అన్నారు. ఇది అమృతకాలం కాదని.. అప్రకటిత ఎమర్జెన్సీ కాలమని పేర్కొన్నారు. కాగా, కాంగ్రెస్ నేతల ఆరోపణలు సిగ్గుచేటని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అవినీతి గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కీలకమైన ఆధారాలు దొరికితేనే దర్యాప్తు సంస్థలు సోదాలు చేస్తాయన్నారు.
విపక్షాలు ఇచ్చిపుచ్చుకోవాలి: చిదంబరం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలన్నీ ఐకమత్యంగా బీజేపీని ఎదుర్కొనేందుకు పరస్పరం ఇచ్చి-పుచ్చుకునే ధోరణి, విశ్వాసంతో పనిచేయాల్సిన అవసరముందని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం వ్యాఖ్యానించారు. పార్టీలన్నీ రాష్ట్ర స్థాయిలో విభేదాలను పక్కనబెట్టి, జాతీయ స్థాయిలో ఒక్కటి కావాలని కోరారు. ఐక్య కూటమి కోసం కాంగ్రెస్ నేతలతో పాటు శరద్ పవార్, నితీశ్ కుమార్, సీతారాం ఏచూరి, స్టాలిన్ వంటి నేతలు కృషి చేస్తారని ఆశిస్తున్నానని చెప్పారు. కాగా ఏఐసీసీ రాజ్యాంగం ప్రకారం సీడబ్ల్యూసీలో సగం మందిని మళ్లీ ఎన్నుకోవాలని, అలాగే కమిటీలో యువతకు తప్పనిసరిగా చోటు కల్పించాలని చిదంబరం పేర్కొన్నారు.