Election Commission: రెండాకుల చిహ్నంపై రిటర్నింగ్ అధికారిదే నిర్ణయం
ABN , First Publish Date - 2023-02-03T08:10:00+05:30 IST
ఈరోడ్ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో అన్నాడీఎంకే(AIADMK) అధికారిక గుర్తు కేటాయింపుపై రిటర్నింగ్ అధికారిదే నిర్ణయమని కేంద్ర ఎన్నికల
- ఈపీఎస్ వర్గ తీర్మానాలను మేం ఆమోదించలేదు
- పార్టీ పాలనా వ్యవహారం మాది కాదు
- సుప్రీంకు తేల్చి చెప్పిన ఈసీ
చెన్నై, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): ఈరోడ్ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో అన్నాడీఎంకే(AIADMK) అధికారిక గుర్తు కేటాయింపుపై రిటర్నింగ్ అధికారిదే నిర్ణయమని కేంద్ర ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. అన్నాడీఎంకే ‘బైలా’లోని నియమ, నిబంధనల్ని పరిశీలించిన రిటర్నింగ్ అధికారి తగిన నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేసింది. గత ఏడాది జూలై 11న అన్నాడీఎంకే నుంచి తమకు అందిన బైలా ఇంకా రికార్డులకెక్కలేదని వెల్లడించింది. పార్టీల పాలనాకార్యక్రమాలను సమీక్షించడం తమ పని కాదని, ఓటర్ల జాబితా, ఎన్నికల నిర్వహణ మాత్రమే తమ విధి అని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు గురువారం లిఖితపూర్వకంగా నివేదిక సమర్పించింది. గత ఏడాది మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (Former Chief Minister Edappadi Palaniswami) వర్గం ఆధ్వర్యంలో జరిగిన సర్వసభ్య సమావేశాన్ని మద్రాస్ హైకోర్టు సమర్థించడాన్ని సవాల్ చేస్తూ అన్నాడీఎంకే బహిష్కృత నేత, మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం (ఓపీఎస్) సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ మహేశ్వరి దినేష్ నేతృత్వంలోని ధర్మాసనం వద్ద విచారణ జరుగుతుండగానే ఇటీవల ఈపీఎస్ మరో అప్పీలు చేసుకున్నారు. ఈరోడ్ తూర్పు ఉప ఎన్నికల్లో తమ పార్టీ తరఫున పోటీ చేయనున్న అభ్యర్థికి రెండాకుల గుర్తు కేటాయించాలంటూ తన సంతకంతో చేసిన ప్రతిపాదనను కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చిందని, ఈ విషయంలో జోక్యం చేసుకుని తమ అభ్యర్థికి రెండాకుల గుర్తు కేటాయించేలా ఉత్తర్వులివ్వాలని ఆ పిటిషన్‌లో అభ్యర్థించారు. ఆ అప్పీలుపై గత సోమవారం విచారణ జరిపిన ధర్మాసనం కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి, ఓపీఎస్ వర్గానికి నోటీసులిచ్చింది. దీనిపై స్పందించిన ఓపీఎస్.. అన్నాడీఎంకే సమన్వయకర్తగా వున్న తన సంతకం లేకుండా ఏ అభ్యర్థికీ పార్టీ బిఫారం ఇవ్వలేరని, తాను ఇప్పటికీ అన్నాడీఎంకే సమన్వయకర్తగా వున్నానని స్పష్టం చేశారు. గత ఏడాది ఈపీఎస్ వర్గం నిర్వహించిన సాధారణ సభ్య సమావేశం గానీ, అందులో తీసుకున్న నిర్ణయాలు గానీ చెల్లవని, ఆ వ్యవహారం ఇంకా సుప్రీంకోర్టు ముందు విచారణలో వుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా గురువారం సుప్రీంకోర్టులో లిఖితపూర్వక అఫిడవిట్ దాఖలు చేసింది. నియోజకవర్గంలో జరిగే ఉప ఎన్నికల్లో ఎవరికి ఏ చిహ్నం కేటాయించాలన్నది పూర్తిగా రిటర్నింగ్ అధికారి నిర్ణయమని, ఆ మేరకు ఇప్పుడు జరుగనున్న ఉప ఎన్నికలోనూ ఆయన అన్నాడీఎంకే బైలా పరిశీలించి నిర్ణయం తీసుకుంటారని పేర్కొంది.
ఇప్పుడేం జరుగనుంది?
గత ఏడాది జరిగిన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం ఆమోదించిన బైలా ఇంకా రికార్డులకెక్కలేదని ఎన్నికల సంఘం చెప్పినందున అంతకు ముందున్న బైలానే చెలామణిలో వున్నట్లు లెక్క. ఆ ప్రకారం పార్టీ సమన్వయకర్త ఓపీఎస్, ఉపసమన్వయకర్తగా వున్న ఈపీఎస్ సంయుక్తంగా తీసుకునే నిర్ణయాలే చెల్లుబాటవుతాయి. అంటే ఈ ఇద్దరూ సంతకం చేసిన బీఫారమే అన్నాడీఎంకే అభ్యర్థికి చెల్లుబాటవుతుంది. కానీ ఈ ఇద్దరూ ఇప్పటికే వేర్వేరుగా అభ్యర్థులను ప్రకటించారు. అందువల్ల ఇరువురు రాజీపడి ఒక అభ్యర్థిని ఖరారు చేస్తేనే ఆ వ్యక్తికి అన్నాడీఎంకే చిహ్నం వస్తుంది. లేకుంటే ఇరువర్గాల అభ్యర్థులకు వేర్వేరు చిహ్నాలు వస్తాయి. అదే సమయంలో అన్నాడీఎంకే చిహ్నం ఎలాగూ లేనందున కూటమి తరఫున తమ అభ్యర్థిని రంగంలోకి దింపుతామని బీజేపీ నుంచి డిమాండ్ వచ్చే అవకాశముంది. బీజేపీ అభ్యర్థి రంగంలోకి దిగితే తమ అభ్యర్థిని ఉపసంహరించుకుంటామని ఇప్పటికే ఓపీఎస్ ప్రకటించారు. దాంతో ఈపీఎస్ నిర్ణయం కీలకమవుతుంది. ఈలోగా సుప్రీంకోర్టు ఏదైనా తీర్పు ప్రకటిస్తే అదే ప్రధానమవుతుంది.
మోదీతో తంబిదురై భేటీ...
అన్నాడీఎంకే ఎంపీ తంబిదురై గురువారం మధ్యాహ్నం ప్రధాని నరేంద్రమోదీని కలుసుకున్నారు. ప్రధాని కార్యాలయానికి వెళ్లిన తంబిదురై సుమారు పావుగంటపాటు మోదీతో భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం తంబిదురై విలేఖరులతో మాట్లాడుతూ... బడ్జెట్ ప్రతిపాదనలను ప్రశంశించేందుకే ప్రధానిని కలుసుకున్నట్లు వివరించారు. అయితే అన్నాడీఎంకే ఎన్నికల చిహ్నంపై రగడ నెలకొన్న తరుణంలో ఆయన భేటీకి ఎనలేని ప్రాధాన్యత నెలకొంది.