Summer Electricity Problems: వేసవిలో చీకటే
ABN , First Publish Date - 2023-03-10T03:17:27+05:30 IST
ఈ వేసవి మాత్రమే కాదు... రానున్న కొన్నేళ్లపాటు వేసవిలో రాత్రిళ్లు కరెంటు కష్టాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సౌర విద్యుత్‌పైనే దృష్టి కేంద్రీకరించి... థర్మల్, జల విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోవడంలో జాప్యమే దీనికి కారణం.
విద్యుత్ సంక్షోభం ముంగిట దేశం
థర్మల్, జల విద్యుత్‌పై ఏళ్ల తరబడి నిర్లక్ష్యం ఫలితం
పగటి పూట కోతల నివారణకు సౌర విద్యుత్ దోహదం
ఏప్రిల్‌లో రాత్రి విద్యుత్ కోతలు తప్పదంటున్న నివేదికలు
న్యూఢిల్లీ, మార్చి 9: ఈ వేసవి మాత్రమే కాదు... రానున్న కొన్నేళ్లపాటు వేసవిలో రాత్రిళ్లు కరెంటు కష్టాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సౌర విద్యుత్‌పైనే దృష్టి కేంద్రీకరించి... థర్మల్, జల విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోవడంలో జాప్యమే దీనికి కారణం. సౌర విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా పెరగడంతో దేశంలో పగటిపూట విద్యుత్ కొరతను దాదాపుగా నివారించగలిగారు. అయితే... రాత్రిళ్లు సౌర విద్యుత్తు అందుబాటులో ఉండదు. ఆ సమయంలో థర్మల్, జల విద్యుదుత్పత్తిపైనే ఆధారపడాలి. ఈ ఉత్పత్తి తక్కువగా ఉండటం వల్ల వేసవిలో రాత్రి వేళల్లో విద్యుత్ కోతలతో ఇబ్బందులు తప్పవని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ, గ్రిడ్ ఇండియా అంతర్గత నివేదికలను విశ్లేషించి ఓ వార్త సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో విద్యుత్ డిమాండ్ 1,42,097 మిలియన్ యూనిట్లకు చేరుతుందని భావిస్తున్నట్టు సెంట్రల్ ఎలక్ర్టిసిటీ అథారిటీ తెలిపింది. ఫెడరల్ గ్రిడ్ రెగ్యులేటరీ అంతర్గత నివేదికల ప్రకారం ఈ ఏప్రిల్‌లో సౌరశక్తి అందుబాటులోలేని సమయాల్లో దేశంలో గరిష్ఠ డిమాండ్ కంటే 1.7 శాతం తక్కువగానే విద్యుత్ అందుబాటులో ఉండనుంది. ఈ ఏప్రిల్‌లో రాత్రి వేళ పీక్ సమయాల్లో విద్యుత్ డిమాండ్ 217 గిగావాట్లకు చేరుతుందని అంచనా వేశారు. ఇది గతే డాది ఏప్రిల్ కంటే 6.4 శాతం ఎక్కువ. పరిస్థితి కొంత ఆందోళనకరంగానే ఉందని గతనెల 3వ తేదీన జారీ చేసిన నోట్‌లో గ్రిడ్ ఇండియా(గ్రిడ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా) పేర్కొంది. ఏప్రిల్‌లో 189.2 గిగావాట్ల థర్మల్ విద్యుత్ అందుబాటులో ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది.
ఇది గతేడాది కంటే 11 శాతం ఎక్కువ. థర్మల్, అణు, గ్యాస్ ఆధారిత విద్యుత్‌లు కలిపితే ఏప్రిల్‌లో రాత్రి వేళ పీక్ సమయాల్లోని డిమాండ్‌కు 83 శాతం వరకు అందుబాటులో ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. మిగిలిన డిమాండ్‌ను భర్తీ చేసేందుకు జల విద్యుత్ కీలకం కానుంది. అయితే, ఈ ఏడాది ఏప్రిల్ పీక్ సమయాల్లో జలవిద్యుత్ అందుబాటు గతేడాది కంటే 18 శాతం తక్కువగా ఉంటుందని గ్రిడ్ ఇండియా అంచనా వేసింది. ‘దేశీయ బొగ్గుతో నడిచే థర్మల్ విద్యుత్ ప్లాంట్లు సామర్థ్యంలో 69 శాతం మాత్రమే ఫిబ్రవరిలో ఉత్పత్తి చేయగా, ఏప్రిల్‌లో దానిని 75 శాతానికి పెంచాల్సి ఉంది. అలాగే విదేశీ బొగ్గు దిగుమతుల ఆధారంగా నడిచే థర్మల్ విద్యుత్ ప్లాంట్లు సామర్థ్యంలో 21 శాతాన్ని మాత్రమే ఫిబ్రవరిలో ఉత్పత్తి చేయగా, దానిని వచ్చే నెలలో 55 శాతానికి పెంచాల్సి ఉంది’ అని క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ ఎనలిటిక్స్ పరిశోధన సంస్థ డైరెక్టర్ హెటల్ గాంధీ పేర్కొన్నారు.
9 శాతమే పెరిగిన థర్మల్ ఉత్పత్తి
కర్బన ఉద్గారాలు తగ్గించాలనే పారిస్ ఒప్పందం మేరకు ప్రధానమంత్రి మోదీ చేపట్టిన చర్యల్లో భాగంగా గత ఐదేళ్లలో దేశంలో సౌరవిద్యుత్ సామర్థ్యం నాలుగు రెట్లు పెరిగింది. కాగా, దేశంలోని థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గత ఐదేళ్లలో 9 శాతం మాత్రమే పెరిగింది. వచ్చే కొన్నేళ్లలో విద్యుత్ కొరతను నివారించేందుకు థర్మల్ ఉత్పత్తిని పెంచాల్సిన ఆవశ్యకతను ఇది స్పష్టం చేస్తోంది.
ప్లాంట్ల నిర్మాణంపై పదేళ్లుగా జాప్యం..
సెంట్రల్ ఎలక్ర్టిసిటీ అథారిటీ గణాంకాల ప్రకారం 16.8 గిగావాట్ల సామర్థ్యంతో దాదాపు 26 థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణ ప్రక్రియ ఏడాదికిపైగా జాప్యం జరుగుతోంది. కొన్ని ప్లాంట్ల విషయంలో పదేళ్లకుపైగా జాప్యం జరుగుతోంది. విద్యుత్ ప్లాంట్ల వద్ద ఉన్న అధికారులు చెబుతున్నదాని ప్రకారం పర్యావరణ రక్షణ చర్యల కోసం స్థానికుల ఆందోళనలు, సేకరించిన భూమికి తగిన నష్టపరిహారం కోసం కోర్టుల్లో కేసులు, కార్మికులు, పరికరాలు అందుబాటులో లేకపోవడం తదితరాలు ఈ జాప్యానికి కారణం. ఈ వేసవిలో విద్యుత్ లోటు అంచనా వేసినదాని కంటే ఎక్కువగానే ఉంటుందనే ఆందోళనలు నెలకొన్నాయి. మార్చి నుంచి మే వరకు వీయనున్న వేడి గాలుల తీవ్రతను వాతావరణశాఖ అంచనా వేయడానికి కొన్ని వారాల ముందే గ్రిడ్ ఇండియా విద్యుత్ కొరతను అంచనా వేయడమే దీనికి కారణం.
విద్యుత్ కొరత నివారణకు చర్యలు..
ఈ ఆందోళనలను కేంద్ర విద్యుత్‌శాఖ కార్యదర్శి అలోక్ కుమార్ తోసిపుచ్చారు. విద్యుత్ కోతల నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలూ చేపట్టిందన్నారు. ‘అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకూ పోటీ ధరలకు విద్యుత్ అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం’ అన్నారు. కాగా, గ్రిడ్ ఇండియా నివేదిక వెలువడిన అనంతరం విద్యుత్ కోతల నివారణకు కొన్ని థర్మల్ విద్యుత్ ప్లాంట్లు, కొన్ని గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలలో అదనపు సామర్థ్యం పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
డిమాండ్‌కు తగ్గ ఉత్పత్తికి చర్యలు
కేంద్ర మంత్రి ఆర్‌కే సింగ్
వేసవిలో విద్యుత్ డిమాండ్ మేరకు సరఫరా చేసేందుకు అన్ని విభాగాలూ చర్యలు చేపట్టాలని కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి ఆర్‌కే సింగ్ ఆదేశించారు.వేసవి నేపథ్యంలో విద్యుత్ పరిస్థితిపై ఈనెల 7న విద్యుత్, బొగ్గు, రైల్వే మంత్రిత్వశాఖల సీనియర్ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా పెంచే ప్రక్రియ అసమతుల్యంగా మారి లోడ్ షెడ్డింగ్ (వ్యవస్థ వైఫల్యం)కు దారితీయకుండా చూడాలని ఆ సమావేశంలో విద్యుత్ కంపెనీలను మంత్రి ఆదేశించినట్టు విద్యుత్‌శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. రానున్న నెలల్లో విద్యుత్ డిమాండ్‌కు తగ్గ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. అన్ని థర్మల్ ప్లాంట్లకూ సరిపడా బొగ్గు నిల్వలు అందుబాటులో ఉంచనున్నట్టు తెలిపారు. ఈనెల 16 నుంచి పూర్తి సామర్థ్యంతో పనిచేయాలని అన్ని విదేశీబొగ్గు ఆధారిత థర్మల్ ప్లాంట్లను ఆదేశించారు.