EPFO : యజమాని వాటా నుంచే 1.16%
ABN , First Publish Date - 2023-05-05T01:57:36+05:30 IST
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌వో) అధిక పెన్షన్ పథకాన్ని ఎంచుకున్న ఉద్యోగులకు శుభవార్త..! మూలవేతనం రూ.15 వేలు
ఈపీఎఫ్‌వో అధిక పింఛన్
● ప్రకటించిన కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీ, మే 4: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌వో) అధిక పెన్షన్ పథకాన్ని ఎంచుకున్న ఉద్యోగులకు శుభవార్త..! మూలవేతనం రూ.15 వేలు దాటితే ఉద్యోగుల పింఛన్ పథకం (ఈపీఎస్)కాంట్రిబ్యూషన్‌కు ఉద్యోగులే 1.16% చెల్లించాలనే నిబంధనను ఈపీఎఫ్‌వో వెనక్కి తీసుకుంది. ఈ మొత్తాన్ని యజమాన్యం వాటా నుంచే సమీకరించుకోనున్నట్లు కేంద్ర కార్మిక శాఖ బుధవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. ఈపీఎఫ్‌వోకు యజమాన్యాలు 12%వాటా చెల్లిస్తాయి. అందులోంచే 1.16 శాతాన్ని సేకరిస్తామని కేంద్రం పేర్కొంది. ఈపీఎఫ్‌వో నిర్వహించే సామాజిక భద్రత పథకాలకు యా జమాన్యాలు చెల్లించే 12% వాటాలోంచి 8.33% ఈపీఎస్‌కు.. మిగతా 3.67% ఈపీఎఫ్‌లో జమవుతుంది. తాజా నిర్ణయంతో యాజమాన్యం వాటా 12శాతంలోంచే అధిక పింఛనుకు సంబంధించిన ఈపీఎస్‌లో 1.16 శాతాన్ని జమ చేస్తారు. అంటే..ఇప్పటి వరకు యాజమాన్య వాటా నుంచి ఈపీఎస్‌కు వెళ్తున్న 8.33% ఇకపై 9.49 శాతంగా మారుతుంది. ఈపీఎఫ్ వాటా తగ్గుతుంది. సుప్రీం కోర్టు గత నవంబరు 4న ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నిబంధనను సవరించారు. కాగా..రూ.15వేల వరకు మూలవేతనం ఉంటే ఈపీఎస్‌కు ప్రభుత్వమే 1.16 శాతాన్ని సబ్సిడీగా చెల్లిస్తోంది. గతేడాది సెప్టెంబరు 1న ఈపీఎస్‌కు ఈపీఎఫ్‌వో సవరణలు చేసింది. అధిక పింఛన్‌ను ఎంచుకునే ఉద్యోగుల మూలవేతనం రూ.15 వేలు దాటితే 2014 నుంచి ఇప్పటి వరకు వారు మూలధనంపై 1.16% చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆర్నెల్లలో ఆప్షన్లను ఇవ్వాలంది. దీనిపై పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు గత నవంబరు4న తీర్పునిస్తూ ఉద్యోగుల వేతనం నుంచి అదనంగా ఈపీఎస్‌కు జమ చేసుకోవడం సామాజిక భద్రత నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. ఈపీఎస్‌కు అదనపు చెల్లింపుల నిర్ణయాన్ని ఆర్నెల్లు నిలిపివేసింది. ఆలోగా ఇతర మార్గాల ద్వారా 1.16% నిధుల సమీకరణ ప్రయత్నాలను పరిశీలించాలని సూచించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు బుధవారంతో ముగిసింది. దీంతో కేంద్ర కార్మికశాఖ యాజమాన్యాలు చెల్లించే 12% నుంచే 1.16% అదనపు వాటాను సమీకరించాలని నిర్ణయించింది.