EPS: డీఎంకే పాలనలో అభివృద్ధి శూన్యం: ఈపీఎస్
ABN , First Publish Date - 2023-01-17T07:36:25+05:30 IST
డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ద్రావిడ తరహా పాలన పేరుతో కోట్లాదిరూపాయలు ఖర్చు చేసి ప్రకటనలు చేస్తున్నారని,
చెన్నై, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ద్రావిడ తరహా పాలన పేరుతో కోట్లాదిరూపాయలు ఖర్చు చేసి ప్రకటనలు చేస్తున్నారని, సామాన్యులకు ఎలాంటి పథకాలు అమలు చేయడం లేదని అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి(Edappadi Palaniswami) విమర్శించారు. సేలం జిల్లా సిరువాచ్చూరు గ్రామంలో సోమవారం ఉదయం సంక్రాంతి, పశువుల పండుగల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ అన్నాడీఎంకే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నిరుపేద బియ్యం కార్డుదారులకు సంక్రాంతి సందర్భంగా రూ.2500ల నగదు, పొంగల్ కిరాణాసరకులను అందజేశామని, డీఎంకే ప్రభుత్వం నాసిరకం పొంగల్ సరకులను పంపిణీ చేస్తోందని ఆరోపించారు. ఇక డీఎంకే ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని కూడా పట్టించుకోవడం మానేసిందని, కార్మికులంతా ఉపాధి లేక ఇతర రాష్ట్రాలకు వలసపోతున్నారన్నారు. మంగళవారం ఉదయం అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ జయంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నామని, ఆ వేడుకల సందర్భంగా పార్టీ శ్రేణులు రాష్ట్రమంతటా పేదలకు సహాయాలు పంపిణీ, అన్నదానం జరపాలని ఎడప్పాడి పిలుపునిచ్చారు.
ఈసీ సమావేశానికి ఈపీఎస్, ఓపీఎస్ వర్గాల హాజరు
ప్యారీస్: దేశ రాజధాని ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల కమిషన్ ఏర్పాటుచేసిన రిమోట్ ఓటింగ్ మెషీన్ పరిచయ సభకు మాజీ ముఖ్యమంత్రులు ఎడప్పాడి పళనిస్వామి, ఒ.పన్నీర్‌సెల్వం మద్దతుదారులు హాజరయ్యారు. ఆధునిక టెక్నాలజీతో వలస కార్మికులు నివసిస్తున్న ప్రాంతాల నుంచే ఓటు హక్కు వినియోగించుకొనే సౌలభ్యాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆచరణకు తీసుకురానుంది. ఎం3 రిమోట్ ఓటింగ్ మెషీన్‌లను పోలింగ్‌లో వినియోగించడంపై కేంద్ర ఎన్నికల కమిషన్ ఏర్పాటుచేసిన ఈ ప్రత్యేక సమావేశంలో గుర్తింపు పొందిన 8 జాతీయ పార్టీలు, 57 ప్రాంతీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. వారిలో అన్నాడీఎంకే తరఫున ఈపీఎస్, ఓపీఎస్ వర్గీయులు డా.తంబిదురై, చంద్రశేఖర్, సుబ్బురత్నం, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.