EPS: ఈపీఎస్‌ అభ్యర్థికే రెండాకులు

ABN , First Publish Date - 2023-02-07T08:25:58+05:30 IST

అన్నాడీఎంకేలో నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ ఎన్నికల కమిషన్‌ ఈపీఎస్‌(EPS) అభ్యర్థికే రెండాకుల గుర్తు కేటాయించాలని ఆదేశించింది.

EPS: ఈపీఎస్‌ అభ్యర్థికే రెండాకులు

- రిటర్నింగ్‌ అధికారికి ఈసీ ఆదేశం

- నేడు తెన్నరసు నామినేషన్‌

చెన్నై, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): అన్నాడీఎంకేలో నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ ఎన్నికల కమిషన్‌ ఈపీఎస్‌(EPS) అభ్యర్థికే రెండాకుల గుర్తు కేటాయించాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు మేరకు ఈరోడ్‌ ఈస్ట్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేయనున్న అన్నాడీఎంకే అభ్యర్థి తెన్నరసు ఎంపికపై సర్వసభ్యమండలి సభ్యుల నుంచి ప్రతిపాదనలు స్వీకరిం చారు. వాటిని ఆ పార్టీ ప్రిసీడియం చైర్మన్‌ తమిళ్‌మగన్‌ హుసేన్‌, ఎంపీ సీవీ షణ్ముగం కేంద్ర ఎన్నికల సంఘానికి సోమవారం మధ్యాహ్నం సమర్పించిన నేపథ్యంలో రాత్రికి ఎన్నికల కమిషన్‌ ఈ మేరకు ఆదేశించింది. ఎడప్పాడి పపళని స్వామి అభ్యర్థికే రెండాకుల గుర్తు కేటాయించాలని రిటర్నింగ్‌ అధికారి కె.శివకుమార్‌ ను ఆదేశించింది. అదే విధంగా అభ్యర్థి ఏ.బి. ఫారాలపై సంతకాలు చేసే అధికారం అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్‌ తమిళ్‌ మగన్‌ హుస్సేన్‌కు ఇచ్చింది. రెండాకుల గుర్తు కోసం సుప్రీం కోర్టులో ఈపీఎస్‌, ఓపీఎస్‌ ఇద్దరూ పిటిషన్లు వేయగా ఎడప్పాడి, పన్నీరుసెల్వం ఇద్దరూ కలిసి నిర్ణయించుకోవాలని సూచించించిది. అయితే ఎన్నికల కమిషన్‌ ఎడప్పాడి అభ్యర్థికే రెండాకుల గర్తు కేటాయించాలని రిటర్నింగ్‌ అధికారికి ఆదేశాలిచ్చింది.

ఇదిలా ఉండగా.. అన్నాడీఎంకే సర్వసభ్య మండలిలో 2501 మంది సభ్యులు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎ్‌స)కి మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈ నేపథ్యంలో ఈరోడ్‌ ఈస్ట్‌ అన్నాడీఎంకే అభ్యర్థిగా తెన్నరసు పేరు ప్రతిపాదిస్తూ మూడు రోజులుగా సర్వసభ్య మండలి సభ్యుల నుంచి లేఖలు సమీకరించారు. అంతేగాక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఏ, బీ ఫారంలో సంతకం చేసే అధికారాన్ని ప్రిసీడియం చైర్మన్‌ తమిళ్‌మగన్‌ హుసేన్‌కు అప్పగిస్తూ ఆ సభ్యులంతా మద్దతు లేఖలు పంపారు. ఈ లేఖలన్నింటినీ తీసుకుని తమిళ్‌మగన్‌హుసేన్‌ సోమవారం ఉదయం విమానంలో ఢిల్లీకి బయలుదేరారు. ఢిల్లీ చేరగానే అన్నాడీఎంకే ఎంపీ సీవీ షణ్ముగం, పార్టీకి చెందిన న్యాయవాది ఇన్బదురైతో కలిసి కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్ళి సర్వసభ్యమండలి సభ్యుల లేఖలను సమర్పించారు. ఈ నేపథ్యంలో సర్వసభ్య మండలి సభ్యుల రెండు రకాల ప్రతిపాదనలను ఆమోదిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్‌ సోమవారం రాత్రి ఈపీఎస్‌ వర్గానికే రెండాకుల గుర్తు కేటాయించాలని ఆదేశించింది.

Updated Date - 2023-02-07T08:26:00+05:30 IST