యూసీసీ నుంచి గిరిజనులకు మినహాయింపు!
ABN , First Publish Date - 2023-07-04T05:30:06+05:30 IST
ఉమ్మడి పౌర స్మృతి(యూసీసీ) పరిధి నుంచి ఈశాన్య రాష్ర్టాలు, ఇతర ప్రాంతాల్లోని గిరిజనులకు మినహాయింపు ఇవ్వాలని న్యాయ వ్యవహారాలకు సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్, బీజేపీ ఎంపీ సుశీల్ మోదీ ప్రతిపాదించినట్టు అధికార వర్గాలు తెలిపాయి.....
స్టాండింగ్ కమిటీ చైర్మన్ సుశీల్ మోదీ ప్రతిపాదన
న్యూఢిల్లీ, రాంపూర్, జూలై 3: ఉమ్మడి పౌర స్మృతి(యూసీసీ) పరిధి నుంచి ఈశాన్య రాష్ర్టాలు, ఇతర ప్రాంతాల్లోని గిరిజనులకు మినహాయింపు ఇవ్వాలని న్యాయ వ్యవహారాలకు సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్, బీజేపీ ఎంపీ సుశీల్ మోదీ ప్రతిపాదించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఆయన అధ్యక్షతన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సోమవారం యూసీసీపై లా కమిషన్, న్యాయమంత్రిత్వశాఖ ప్రతినిధులతో కీలక సమావేశాన్ని నిర్వహించింది. కమిటీలో మొత్తం 31 మంది సభ్యులుండగా సమావేశానికి 17 మంది సభ్యులు హాజరయ్యారని అధికార వర్గాలు తెలిపాయి. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరుగనున్న తరుణంలో వివాదాస్పద అంశంపై లా కమిషన్ సంప్రదింపుల ప్రక్రియ ప్రారంభించడాన్ని కొందరు ప్రతిపక్ష పార్టీల సభ్యులు ప్రశ్నించారని ఆ వర్గాలు వెల్లడించాయి. ఎన్నికల నేపథ్యంలోనే హడావుడి చేస్తున్నారని కాంగ్రెస్, డీఎంకే, శివసేన, బీఆర్‌ఎస్ తదితర పార్టీల సభ్యులు ఆరోపించారు. వివిధ మతాలు, ప్రాంతాల ఆందోళనలను పరిశీలనలోకి తీసుకోవాలని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సూచించారు. లోక్‌సభ ఎన్నికల ముందు యూసీసీని తీసుకురావడం వెనుక ఉద్దేశ్యం ఏమిటని కాంగ్రెస్ సభ్యుడు మాణిక్యం ఠాకూర్ ప్రశ్నించారు. కాగా, గతనెల 14న అభిప్రాయ సేకరణ ప్రక్రియ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 19 లక్షల సూచనలు వచ్చాయని లా కమిషన్ అధికారులు తెలిపారు. ఈనెల 13వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు.
యూసీసీ మతాచారాల్లోకి చొరబడదు
యూసీసీ ఒక సంస్కరణ అని, అది ఏదేని మత విశ్వాసాలు, ఆచారాలలోకి చొరబడబోదని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ చెప్పారు. అయితే, మానవ విలువలను పెంపొందించడం ద్వారా అందరికీ సమానత్వం, న్యాయం కల్పించేందుకు అది దోహదపడుతుందన్నారు. యూపీలోని రాంపూర్‌లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కొన్ని రాజకీయ పార్టీలు యూసీసీపై సమాజంలో ఘర్షణలు సృష్టించేందుకు మతపరమైన కుట్రలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. మతపరమైన చెర నుంచి ఈ ప్రగతిశీల చట్టానికి స్వేచ్ఛ కల్పించి, అమలు చేయడానికి ఇదే సరైన సమయమన్నారు.