Food Corporatin Scam: వాషింగ్ మిషన్‌లో రూ.15 లక్షలు, సీబీఐ స్వాధీనం
ABN , First Publish Date - 2023-01-11T19:49:04+05:30 IST
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కుంభకోణంపై కేంద్ర దర్యాప్తు సంస్థ కొరడా ఝళిపించింది. ఆరు నెలలుగా అండర్‌కవర్ ఆపరేషన్ నిర్వహిస్తున్న దర్యాప్తు సంస్థ..
న్యూఢిల్లీ: ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) కుంభకోణంపై కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) కొరడా ఝళిపించింది. ఆరు నెలలుగా అండర్‌కవర్ ఆపరేషన్ నిర్వహిస్తున్న దర్యాప్తు సంస్థ బుధవారంనాడు పంజాబ్, హర్యానా, ఢిల్లీలోని సుమారు 50 ప్రాంతాల్లో ఆకస్మిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో ఒక వాషింగ్ మిషన్‌లో దాచిన రూ.15 లక్షలతో సహా మొత్తం రూ.60 లక్షలు స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం దాడులు కొనసాగుతున్నందున మరింత సొమ్ము కూడా సీజ్ చేసే అవకాశం ఉంది.
కాగా, ఎఫ్‌సీఐ కుంభకోణంలో ఉన్నతాధికారుల ప్రమేయం ఉందని సీబీఐ అనుమానిస్తోంది. ఇందుకు సంబంధించిన పలువురుని అరెస్టు చేసినట్టు కూడా తెలుస్తోంది. ఎఫ్‌సీఐలో అపవిత్ర అవినీతి సంబంధాలపై సీబీఐ దాడులు సాగిస్తోందని ఏజెన్సీ వర్గాలు చెబుతున్నాయి. ఎఫ్‌సీఐలోని పలువురు అధికారులు, రైస్ మిల్ యజమానులు, గ్రైన్ మర్చంట్లు మధ్య ఆహార ధాన్యాల సేకరణ, నిల్వ, పంపిణీకి సంబంధించి ఆ అపవిత్ర సంబంధాలు ఉన్నాయని సీబీఐ అనుమానిస్తోంది. ఆ ప్రకారం ఆహార ధాన్యాలు తీసుకు వెళ్లే ఒక్కో ట్రక్కు నుంచి రూ.1,050 వరకూ ఎఫ్‌సీఐ అధికారుల మధ్య పంపిణీ అవుతుంది. ఒక్కో ట్రక్కుకు జనరల్ మేనేజర్ ర్యాంకు అధికారికి రూ.200, డీజీఎం స్థాయి అధికారికి రూ.50, క్వాలిటీ కంట్రోల్ అధికారులకు రూ.450, ఎగ్జిక్యూటివ్ డెరెక్టర్, హెడ్‌క్వార్టర్స్ స్థాయి అధికారులకు రూ.100 చొప్పున అందుతాయని చెబుతున్నారు. ఇందుకు ప్రతిగా ఆహార ధాన్యాల సేకరణకు సంబంధించి హెచ్చు చేసిన బిల్లులను ఎఫ్ఐసీ అధికారులు ఇస్తుంటారు.