Deve Gowda advice: కాంగ్రెస్ పార్టీకి దేవెగౌడ సలహా...

ABN , First Publish Date - 2023-04-02T15:20:52+05:30 IST

లోక్‌సభ ఎన్నికలకు ముందు విపక్షాల కూటమి ఏర్పాటుకు జరుగుతున్న ప్రయత్నాలపై జనతాదళ్ (సెక్యులర్) అధినేత, మాజీ ప్రధాన మంత్రి ..

Deve Gowda advice: కాంగ్రెస్ పార్టీకి దేవెగౌడ సలహా...

బెంగళూరు: లోక్‌సభ ఎన్నికలకు ముందు విపక్షాల కూటమి ఏర్పాటుకు జరుగుతున్న ప్రయత్నాలపై జనతాదళ్ (సెక్యులర్) అధినేత, మాజీ ప్రధాన మంత్రి హెచ్‌డీ దేవెగౌడ తొలిసారిగా 'పీటీఐ' వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు. కాంగ్రెస్ పార్టీ తొలుత సొంత ఇంటిని చక్కదిద్దుకోవాలని సలహా ఇచ్చారు. విపక్ష పార్టీల ముందు చాలా ఆప్షన్లు ఉన్నాయని, ఈ దేశానికి బలమైన నాయకత్వ సంపద ఉందని చెప్పారు. విపక్షం అంటే కాంగ్రెస్ పార్టీ ఒక్కటే కాదని అన్నారు. రాహుల్‌పై అనర్హత వేటు, కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్ (JDS) విజయావకాశాలు, తదితర అంశాలను సైతం ఆయన ప్రస్తావించారు.

లోక్‌సభ ఎన్నికలకు ముందు విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చే విషయంలో కాంగ్రెస్ ఎలాంటి పాత్ర పోషించాల్సి ఉంటుందని అడిగిన ప్రశ్నకు, మొదట ఆ పార్టీ సొంత ఇంటిని చక్కెబెట్టుకోవాల్సి ఉంటుందని అన్నారు. విపక్షాల ముందు చాలా ఆప్షన్లు ఉంటాయని, నాయకత్వ సంపదకు దేశంలో ఎలాంటి కొరతా లేదని ఆయన సమాధానమిచ్చారు. పరువునష్టం కేసులో దోషిగా నిర్దారణ అయిన వెంటనే రాహుల్‌ గాంధీ పార్లమెంటు సభ్యత్వంపై అనర్హత వేటు పడటంపై తాను ప్రత్యేకంగా వ్యాఖ్యానించనని, దీనిపై తమ పార్టీ (జేడీఎస్) నేతలు ఇప్పటికే మాట్లాడారని అన్నారు. అయితే, ఇది దురదృష్టకరమని మాత్రం తాను చెప్పదలచుకున్నానని తెలిపారు. జనతా పరివార్‌, థర్ట్ ఫ్రంట్ పునరుద్ధరణ సాధ్యమనుకుంటున్నారా? అది ముగిసిన అధ్యాయంగా భావిస్తున్నారా అని ప్రశ్నించగా, ప్రతీదీ సాధ్యమేనని అన్నారు. థర్డ్ ఫ్రంట్ లేదా ఫోర్త్ ఫ్రంట్ అనే వాటిని తాను నమ్మనని, ఏది చేసినా దేశం, ప్రజాస్వామ్యాన్ని కాపడటంలో మనం ఫస్ట్ ఫ్రంట్‌గా ఉండాలని దేవెగౌడ సమాధానమిచ్చారు.

కర్ణాటకలో జేడీఎస్ విజయావకాశాలపై...

కర్ణాటక వ్యా్ప్తంగా తమ పార్టీ మంచి ఫలితాలు సాధిస్తుందని, అయితే ఒక వర్గం వారు ప్రధానంగా రెండు జాతీయ పార్టీలపైనే దృష్టిసారిస్తూ మాట్లాడటం ఆశ్చర్చం కలిగిస్తోందని దేవెగౌడ అన్నారు. విభజన ఎజెండాపై తాము ఓట్లు అడగేది లేదన్నారు. అందర్నీ కలుపుకొని వెళ్లే సామాజిక, అభివృద్ధి విజన్‌..పంచరత్న ప్రోగ్రాం పైనే తాము ఓట్లు అడుగుతామని చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే ఈ ప్రోగ్రాంను అమలు చేస్తామని చెప్పారు. ఈ ప్రోగ్రాంపై ప్రచారానికి తమ పార్టీ నేత హెచ్‌డీ కుమారస్వామి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారని చెప్పారు. చాలా అద్భుతమైన స్పందన వచ్చిందన్నారు. చాలా సరళమైన వ్యూహాన్ని తాము అనుసరిస్తున్నామని, కష్టపడి పనిచేయడం, ప్రజల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించడం తాము చేస్తామని, ఆచరణకు సాధ్యం కాని, ప్రజలను మోసగించే వాగ్దానాలు చేయమని చెప్పారు. పాత మైసూరు దాటి పార్టీ విస్తరణను జేడీఎస్ చేపట్టడం లేదంటూ జరుగుతున్న ప్రచారంపై మాట్లాడుతూ, ఇది జాతీయ పార్టీల తెలివైన ప్రచారమని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తమకు ఎమ్మెల్యేలు ఉన్నారని, అందులో అన్ని సామాజిక వర్గాలకు చెందిన వారు ఉన్నారని తెలిపారు. 1999 నుంచి ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల జాబితాను చూస్తే తాను చెబుతున్న విషయం బాగా అర్ధమవుతుందని అన్నారు. మైసూరు ప్రాంతం నుంచి తమ పార్టీకి గరిష్ట మద్దతు లభించిన విషయం నిజమేనని, ఈసారి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ మరింత సక్సెస్ సాధిస్తామని చెప్పారు. ఒక మంత్రిగా, సీఎంగా, ప్రధానిగా తాను అందిరి కోసం పనిచేశానని, ప్రాంతాల పట్ల ఎన్నడూ వివక్ష చూపించలేదని తెలిపారు. తానేమిటో 60 ఏళ్లుగా ప్రజలకు, దేవుడికి బాగా తెలుసునని అన్నారు.

123 సీట్లు లక్ష్యంగా...

కర్ణాటక ఎన్నికల్లో 123 సీట్లు గెలుచుకోవడమే జేడీఎస్ లక్ష్యంగా పెట్టుకుందని, కష్టపడి పనిచేయడం, అభివృద్ధి విజన్‌ తమకు గణనీయంగా సీట్లు తెచ్చిపెడతాయనే నమ్మకం ఉందని దేవెగౌడ చెప్పారు. జేడీఎస్ విమర్శకులు, రాజకీయ ప్రత్యర్థుల అంచనాలను తాము లెక్కచేయమని తెలిపారు. కర్ణాటక అభివృద్ధికి జాతీయ పార్టీలు చేసిన అభివృద్ధి గురించి మాట్లాడుతూ, దీనిపై తమ నాయకులే హెచ్‌డీ కుమారస్వామి, రాష్ట్ర అధ్యక్షుడు సీఎం ఇబ్రహీం సమాధానమిస్తారని చెప్పారు. ఒకటి మాత్రం తాను చాలా స్పష్టంగా చెప్పగలనని, జాతీయ పార్టీలు ఆచరణకు సాధ్యంకాని చాలా పెద్దపెద్ద హామీలు ఇస్తుంటాయని, వారు చేసే సర్కర్ ఫీట్లు, మోసపూరిత మాటలను ప్రజలు గమనిస్తూనే ఉంటారని అన్నారు.

నరేంద్ర మోదీ త్వరలో ప్రధానిగా 9 ఏళ్ల పాలన పూర్తి చేసుకోనుండటం, ఆయన పనితీరు, ఆయన పాలనపై ప్రజాస్వామ్యంపై ప్రస్తుతం జరుగుతున్న చర్చపై దేవెగౌడ్ ఆచితూచి స్పందించారు. రాజ్యసభలో తాను వ్యవసాయ అంశాల నుంచి, సాగుచట్టాలు, కోవిడ్, కేంద్ర బడ్జెట్, ఆర్ధిక వ్యవస్థు, ఈశాన్య రాష్ట్రాలు, కశ్మీర్ అంశంతో సహా అన్ని అంశాలపై చర్చలో పాల్గొన్నానని, సవివరంగా మాట్లాడానని అన్నారు. పార్లమెంటు రికార్డుల్లో, తన సోషల్ మీడియా అకౌంట్‌లో ఇవన్నీ చూడవచ్చని తెలిపారు. తనకు ఏ బాధ్యత అప్పగించినా అది చిత్తశుద్ధితో చేస్తూ వచ్చానని, 91 ఏళ్ల వయస్సులోనూ ఆ పని చేస్తున్నానని అన్నారు.

Updated Date - 2023-04-02T15:41:39+05:30 IST