GaliJanardhanReddy: గాలి జనార్ధన్‌రెడ్డికి సుప్రీంలో ఎదురుదెబ్బ..
ABN , First Publish Date - 2023-04-19T12:12:01+05:30 IST
మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి సుప్రీంలో ఎదురుదెబ్బ తగిలింది.
ఢిల్లీ : మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి (Gali Janardhan Reddy) సుప్రీంలో (Supreme Court) ఎదురుదెబ్బ తగిలింది. అక్రమ మైనింగ్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ షరతులను సడలించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తనకు బళ్లారి వెళ్లేందుకు అవకాశం కల్పించాలని అందుకు అనుగుణంగా తన బెయిల్ నిబంధనలను సడలించాలని సుప్రీంకోర్టును గాలి జనార్దన్ రెడ్డి ఆశ్రయించారు. ఆయన విజ్ఞప్తిని జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సుందరేష్ ల ధర్మాసనం తోసిపుచ్చింది. బెయిల్ నిబంధనలు సడలించడం కుదరదని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఎన్నికలు ముగిసిన తర్వాత మరోసారి కోర్టుకు వచ్చేందుకు అవకాశం ఇస్తూ పిటిషన్ వెనక్కి తీసుకునే వెసులుబాటు కల్పించాలని గాలి తరపు న్యాయవాది విజ్ఞాపన కూడా సుప్రీంకోర్టు తిరస్కరించింది. గాలి దాఖలు చేసిన పిటిషన్ ను డిస్మిస్ చేసింది.
గాలి జనార్ధన రెడ్డి.. బీజేపీ (BJP)తో విభేదించి కల్యాణ రాజ్య ప్రగతి పక్ష (KRPP) పేరిట కొత్త పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. తాజాగా తన కొత్త పార్టీ కోసం నామినేషన్ దాఖలు చేశారు, ఇందులో తనపై అక్రమ మైనింగ్‌కు సంబంధించి 19 కేసులు నమోదయ్యాయని.. అవి కోర్టులో వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్నాయని ప్రకటించారు. ఆదాయపు పన్ను ఎగవేత, ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించిన కేసులను కూడా వెల్లగించారు. వీటిలో ఇటీవలి కొన్ని కేసులు - ఎన్నికల దుష్ప్రవర్తనపై కనకగిరి పోలీస్ స్టేషన్‌లో నమోదయ్యాయి. అక్రమ మైనింగ్‌కు సంబంధించిన 19 కేసుల్లో 16 కేసులు 2011 నుంచి 2015 మధ్య నమోదయ్యాయని తెలిపారు.
కాగా.. ఎలక్షన్ కమిషన్‌కు దాఖలు చేసిన అఫిడవిట్‌లో గాలి జనార్ధన్ రెడ్డి తన భార్య పేరిట కేవలం ఒక్క కారు కూడా లేదని పేర్కొనడం ఆసక్తికరం. తన చేతిలో క్యాష్ మాత్రం రూ.3,47,491 ఉన్నట్టు పేర్కొన్నారు. బంగారం - డైమండ్/ సిల్వర్ 1.5 /9.5 కేజీ ఉన్నట్టు వెల్లడించారు. వెహికిల్ వచ్చేసి టయోటా ఇన్నోవా క్రిస్టా ఉన్నట్టు తెలిపారు. స్థిర ఆస్తులు వచ్చేసి రూ.74.5 కోట్లు, చరాస్థులు రూ.36 కోట్లు ఉన్నాయనన్నారు. మొత్తంగా తన వద్ద రూ.110.5 కోట్లు ఉన్నట్టు వెల్లడించారు.