అయోధ్యకు ద్వారాలు హైదరాబాద్ నుంచి!
ABN , Publish Date - Dec 26 , 2023 | 01:41 AM
అయోధ్యలోని రామ మందిరంలో ఉపయోగించే తలుపులు హైదరాబాద్ న్యూ బోయినపల్లిలోని అనురాధ టింబర్ డిపోలో రూపుదిద్దుకున్నాయి. నిరుడు
రామ మందిరానికి బోయినపల్లి అనురాధ టింబర్ డిపో తలుపులు!
బోయినపల్లి, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): అయోధ్యలోని రామ మందిరంలో ఉపయోగించే తలుపులు హైదరాబాద్ న్యూ బోయినపల్లిలోని అనురాధ టింబర్ డిపోలో రూపుదిద్దుకున్నాయి. నిరుడు జూన్‌లో తలుపుల తయారీ పనులు మొదలయ్యాయి. అప్పటి నుంచి తమిళనాడుకు చెందిన కుమారస్వామి, రమేశ్‌తో పాటు 60 మంది నిపుణులైన కళాకారుల బృందం తయారీ కోసం రాత్రింబవళ్లు కష్టపడుతోంది. తయారీలో బలార్షా టేకు ఉపయోగించారు. బంగారు పూతతో కూడిన 18 ప్రధాన ద్వారాల తలుపులతో పాటు మరో 100 తలుపులను తయారుచేశారు. యాదాద్రి ఆలయంలోని కలప కళాకృతులు అనురాధా టింబర్ సంస్థ ఆధ్వర్యంలోనే సిద్ధమవడం విశేషం. అయోధ్యలోని రామ మందిర ప్రాంగణానికి అవసరమైన తలుపుల తయారీలో నాణ్యత గల కలపను ఉపయోగిస్తున్నామని అనురాధ టింబర్ ఇంటర్నేషనల్ అధిపతి చదలవాడ శరత్‌బాబు ‘ఆంధ్రజ్యోతి’కి వెల్లడించారు. పనులు దాదాపు పూర్తి కావొచ్చాయని ఆయన చెప్పారు. తమ శిల్పకళ చాలా బాగుందంటూ సీఎం యోగి ఆదిత్యనాథ్ తమను అభినందించారని పేర్కొన్నారు. అయోధ్య రామమందిరం కోసం తలుపులను బోయినపల్లికి చెందిన తాము చేయించడం గర్వంగా ఉందని చెప్పారు. కాగా అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కోసం గత ఏడాది ఏర్పాట్లు మొదలవ్వగానే రామ మందిరం ద్వారాలను తయారు చేయడం కోసం ఎల్ అండ్ టీ, టాటా ఇన్ర్ఫాస్ట్రక్చర్ ఆధ్వర్యంలో నిరుడు మే నెలలో దేశంలో ఉన్న టాప్ టింబర్ డిపో కంపెనీలను ఇంటర్వ్యూలకు పిలిచారు. గతంలో యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం, ఇతర దేవాలయాలకు అనురాధ టింబర్ డిపో చేసిన పనులను పరిగణలోకి తీసుకుని తమకు అవకాశం వచ్చిందని చదలవాడ శరత్ తెలిపారు.