Manipur Violence: అక్కడి పరిస్థితి నా గుండెను కలిచివేసింది: రాహుల్

ABN , First Publish Date - 2023-06-30T14:37:08+05:30 IST

హింసాకాండతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో బాధిత ప్రజలను కలుసుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చలించిపోయారు. వారికి ఎదురైన కష్టం తన గుండెను కలిచివేసిందని అన్నారు. రాష్ట్రంలో శాంతి నెలకొనేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Manipur Violence: అక్కడి పరిస్థితి నా గుండెను కలిచివేసింది: రాహుల్

ఇంఫాల్: హింసాకాండతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో (Manipur) బాధిత ప్రజలను కలుసుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చలించిపోయారు. వారికి ఎదురైన కష్టం తన గుండెను కలిచివేసిందని అన్నారు. ''మణిపూర్‌లో హింసతో తమ కుటుంబ సభ్యులను, ఇళ్లను కోల్పోయిన వారి దుస్థితి వర్ణనాతీతం. నేను కలుసుకున్న ప్రతి ఒక్క సోదరుడు, సోదరి, పిల్లలు అందరూ కన్నీటితో సాయం కోసం వేడుకుంటున్నారు'' అని రాహుల్ తన ఇన్‌స్ట్రాగ్రామ్ పోస్ట్‌లో తెలిపారు.

మణిపూర్‌లో శాంతి నెలకొనడం అవసరమని రాహుల్ అన్నారు. ప్రజల ప్రాణాలు, జీవనోపాధికి భరోసా ఇచ్చేందుకు తక్షణం శాంతి నెలకొనాల్సిన అవసరం ఉందని, అందరూ కలిసికట్టుగా ఈ లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

మణిపూర్‌లో రెండు రోజుల పర్యటనకు వచ్చిన రాహుల్ గాంధీ భావసారూప్యత కలిగిన 10 పార్టీల నేతలు, యునైటెడ్ నాగా కౌన్సిల్ (యూఎన్‌సీ) నేతలు, ఇంఫాల్‌లోని పౌర సమాజ సంస్థల సభ్యులను కలుస్తారని మణిపూర్ కాంగ్రెస్ అధ్యక్షుడు కిషమ్ మేఘచంద్ర తెలిపారు. మొయిరాంగ్‌లోని సహాయ శిబిరాలను సందర్శించి, బాధిత కుటుంబాలను పరామర్శిస్తారని, ఆ తర్వాత తిరిగి ఇంఫాల్ వస్తారని చెప్పారు. శాంతి యత్నాల్లో భాగంగానే రాహుల్ మణిపూర్ వచ్చినట్టు చెప్పారు.

చురాచాంద్‌పూర్‌లో బాధితుల పరామర్శ

రాహుల్ గాంధీ తొలిరోజు పర్యటనలో భాగంగా చురాచాంద్‌పూర్‌లో పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. బాధితులను కలుసుకోకుండా రాహుల్‌ను అధికారులు అడ్డుకున్నారంటూ ఇంతకుముందు కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. మొయిరాంగ్ వచ్చేందుకు అధికారులు అనుమతి ఇవ్వలేదన్నారు. దీంతో చురాచాంద్‌పూర్‌లో బాధితులను రాహుల్ పరామర్శించారని, అనంతరం ఇంఫాల్ తిరిగివచ్చారని, రాత్రి ఇక్కడే ఉంటారని చెప్పారు. శనివారంనాడు రాహుల్ పర్యటన కొనసాగుతుందా లేదా అనే దానిపై కూడా ఇంకా ఎలాంటి స్పష్టత లేదన్నారు.

దురదృష్టకరం..

మణిపూర్‌ ప్రజలకు ఇప్పుడు తగినంత స్వస్థత, స్వాంతన కలగాలని, మణిపూర్ ప్రజల బాధలు వినేందుకే తాను వచ్చానని, అయితే ప్రభుత్వం తనను అనుమతించకపోవడం దురదృష్టకరమని రాహుల్ ట్వీట్ చేశారు. మణిపూర్ ప్రజలకు స్వాంతన చేకూర్చి, అక్కడ శాంతి నెలకొల్పడమే తమ ఉద్దేశమని చెప్పారు.

Updated Date - 2023-06-30T14:37:08+05:30 IST