Share News

Kota: కోట విద్యార్థుల కోసం హెల్ప్‌డెస్క్.. 2 నెలల్లో 350 ఫిర్యాదులు

ABN , First Publish Date - 2023-12-11T10:32:52+05:30 IST

రాజస్థాన్ రాష్ట్రం కోటా(Kota)లోని విద్యార్థుల వరుస సూసైడ్‌లు కలకలం రేపిన విషయం విదితమే. అయితే ఆత్మహత్యలను అరికట్టడానికి విద్యార్థుల కోసం అధికారులు హెల్ప్ డెస్క్ ను సెప్టెంబర్ లో ప్రారంభించారు.

Kota: కోట విద్యార్థుల కోసం హెల్ప్‌డెస్క్.. 2 నెలల్లో 350 ఫిర్యాదులు

కోటా: రాజస్థాన్ రాష్ట్రం కోటా(Kota)లోని విద్యార్థుల వరుస సూసైడ్‌లు కలకలం రేపిన విషయం విదితమే. అయితే ఆత్మహత్యలను అరికట్టడానికి విద్యార్థుల కోసం అధికారులు హెల్ప్ డెస్క్ ను సెప్టెంబర్ లో ప్రారంభించారు. రెండు నెలల్లోనే 373 ఫిర్యాదులు అందాయని అధికారులు తెలిపారు. ఫిర్యాదుల్లో ఎక్కువగా చదువుకోలేక డిప్రెషన్ తో బాధపడుతున్నవారు ఉన్నారని చెప్పారు. వారికి ప్రొఫెషనల్ కౌన్సిలింగ్, వైద్య సహాయం అందించామన్నారు.

నీట్, జేఈఈ(NEET, JEE)ల్లో అత్యున్నత ప్రమాణాలతో ట్రైనింగ్ ఇచ్చేందుకు కోటా ప్రసిద్ధి చెందింది. ఇక్కడికి దేశ నలుమూలల నుంచి వందల సంఖ్యలో విద్యార్థులు ట్రైనింగ్ కోసం వస్తుంటారు. వారంతా అక్కడే ఉన్న హాస్టళ్లలో నివసిస్తుంటారు. అయితే చదువుల్లో ఒత్తిడి తదితర కారణాల వల్ల కొన్నేళ్లుగా కోటాలో వరుసగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు.

దీంతో అధికారులు విద్యార్థుల మానసిక స్థైర్యం పెంచేందుకు హెల్ప్ డెస్క్ ప్రారంభించారు. 373 ఫిర్యాదుల్లో 35 ఒత్తిడి, డిప్రెషన్ కు సంబంధించినవని.. వాటిని ప్రొఫెషనల్ కౌన్సెలర్లు పరిష్కరించారని ఏఎస్పీ చంద్రశీల్ ఠాకూర్ తెలిపారు. మిగతా ఫిర్యాదులు శిక్షణ కేంద్రాల ఫీజులు, హాస్టల్ మెస్ లలో నాణ్యత లేని భోజనం, సోషల్ మీడియా పోస్ట్ లు, గుర్తు తెలియని వ్యక్తుల నుంచి కాల్స్ కి సంబంధించినవి వెల్లడించారు. దాదాపు రెండు నెలలుగా విద్యార్థుల ఆత్మహత్యలు జరగలేదన్నారు.


సెప్టెంబరు 18న, ఉత్తరప్రదేశ్‌కు చెందిన 16 ఏళ్ల యువకుడు విషం సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. 3 రోజుల వ్యవధిలో నీట్ కోచింగ్ తీసుకుంటున్న ఇద్దరు విద్యార్థులు తమ గదుల్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యలు అరికట్టడానికి సెప్టెంబర్ 10న సైకలాజికల్ కౌన్సెలింగ్ సెంటర్ ప్రారంభించారు. వైద్య బృందాలు వారానికి రెండుసార్లు కోచింగ్ సెంటర్లు, హాస్టళ్లను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకుంటున్నాయని చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ జగదీష్ సోని తెలిపారు.

"ఈ ఏడాది జూన్ నుండి వైద్య బృందాలు 278 హాస్టళ్లను సందర్శించాయి. 8,617 మంది కోచింగ్ విద్యార్థులను పరీక్షించాయి. వీరిలో 98 మంది తీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్యలతో ఉన్నట్లు గుర్తించాం" అని సోని తెలిపారు. వారిలో చాలా మంది కౌన్సెలింగ్ తర్వాత సాధారణ జీవితాన్ని తిరిగి ప్రారంభించారని చెప్పారు.

Updated Date - 2023-12-11T10:34:25+05:30 IST