నలుగురు సైనికుల వీర మరణం
ABN , Publish Date - Dec 22 , 2023 | 04:19 AM
కశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. సైనిక వాహనాలపై కాల్పులకు తెగబడ్డారు. పూంచ్ జిల్లా డెరా కి గలి ప్రాంతంలో గురువారం జరిగిన ఈ ఘటనలో నలుగు రు సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
కశ్మీర్‌లో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదుల దాడి
పూంచ్‌లో ఘటన.. ముగ్గురికి తీవ్ర
గాయాలు.. కొనసాగుతున్న కాల్పులు
శ్రీనగర్, డిసెంబరు 21: కశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. సైనిక వాహనాలపై కాల్పులకు తెగబడ్డారు. పూంచ్ జిల్లా డెరా కి గలి ప్రాంతంలో గురువారం జరిగిన ఈ ఘటనలో నలుగు రు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఉగ్రవాదుల కదలికలపై స మాచారం రావడంతో బుధవారం రాత్రి బుఫ్లియాజ్‌లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో అక్కడికి సైనికులను తరలిస్తుండగా రాజౌరి-థనామండి-సురాన్‌కోట్ రోడ్‌పై సావ్నికి చేరగానే మలుపు వద్ద ట్రక్, జిప్సీ మీద భారీగా ఆయుధాలు ధరించిన ఉగ్రవాదులు దాడికి దిగారు. వెంటనే తేరుకున్న సైనికులు ఎదురుకాల్పులు ప్రారంభించారు. సైనికులు ఉగ్రవాదులతో నేరుగానే తలపడినట్లు తెలుస్తోంది. ఇక దాడి జరిగిన ప్రదేశం రక్తంతో నిండిపోయింది. దాడి సంగతి తెలిసిన వెంటనే సైన్యం అదనపు బలగాలను తరలించింది. కాగా, ఆపరేషన్ కొనసాగుతోందని సైనిక ప్రతినిధి వివరించారు. ఉగ్రవాదులు గాయపడిన సైనికుల నుంచి ఆయుధాలను లాక్కున్నట్లు భావిస్తున్నారు. నెల వ్యవధిలో ఇదే ప్రాంతంలో ఆర్మీ వాహనాలపై రెండోసారి దాడి జరిగింది. ఏప్రిల్ 20న సైన్యం, ప్రత్యే క బలగాలు రాజౌరీ కలాకోట్‌లో ఉగ్రవాదుల ఏరివేత చేపట్టగా జరిగిన దాడిలో ఇద్దరు కెప్టెన్లు సహా ఐదుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మే నెలలోనూ ఐదుగురు సైనికులు చనిపోయారు. రెండేళ్లుగా ఈ రీజియన్ ఉగ్రవాద చర్యలకు కేంద్రంగా మారింది. ఏప్రిల్, మేలో రెండు ఘటనల్లో 10మంది సైనికులు చనిపోయారు.