High Court: హైకోర్టుకు అదనపు న్యాయమూర్తులు

ABN , First Publish Date - 2023-02-07T08:17:35+05:30 IST

మద్రాస్‌ హైకోర్టు(Madras High Court)కు ఐదుగురు అదనపు న్యాయమూర్తులు నియమితులయ్యారు. ముగ్గురు న్యాయవాదులు, మరో ఇద్దరు న్యాయాధికారుల

High Court: హైకోర్టుకు అదనపు న్యాయమూర్తులు

- కొలీజియం సిఫార్సుకు రాష్ట్రపతి ఆమోదం

చెన్నై, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): మద్రాస్‌ హైకోర్టు(Madras High Court)కు ఐదుగురు అదనపు న్యాయమూర్తులు నియమితులయ్యారు. ముగ్గురు న్యాయవాదులు, మరో ఇద్దరు న్యాయాధికారులను అదనపు న్యాయమూర్తులుగా సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసును రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఆమోదించినట్లు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ జిజు సోమవారం ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. హైకోర్టులో న్యాయవాదులుగా వున్న లక్ష్మణ చంద్ర విక్టోరియా గౌరి, పిళ్లైపాక్కం బహుకుటుంబి బాలాజీ, కందస్వామి కుళందైవేల్‌ రామకృష్ణన్‌, న్యాయాధికారులుగా వున్న రామచంద్ర కళైమది, కె.గోవిందరాజన్‌ తిలకవదిలను హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా నియమించాలంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని కొలీజియం గతనెలలో సిఫారసు చేసిన విషయం తెలిసిందే. దీనిని పరిశీలించిన కేంద్రం.. ఆమోదం కోసం రాష్ట్రపతికి పంపగా, అందుకామె అనుమతి ఇచ్చారు. అనంతరం దానికి సంబంధించిన గెజిట్‌ను కేంద్రం ప్రకటించింది. దీంతో హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 53కు చేరినట్లయింది. నిజానికి హైకోర్టులో 75 మంది న్యాయమూర్తులు ఉండాల్సివుంది. ప్రస్తుతం 53 మందే ఉండడంతో ఇంకా 22 న్యాయమూర్తుల పదవులు ఖాళీగా వున్నట్లు తేలింది.

విక్టోరియా నియామకంపై విచారణకు సుప్రీం అంగీకారం

హైకోర్టు న్యాయమూర్తి పదవికి సుప్రీంకోర్టు సిఫారసు చేసిన న్యాయవాదుల్లో ఒకరైన విక్టోరియా గౌరీ నియామకంపై విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ వ్యవహారంపై వచ్చే శుక్రవారం విచారణ చేపడతామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ప్రకటించారు. సోమవారం ఉదయం జస్టిస్‌ చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట హాజరైన సీనియర్‌ న్యాయవాది రాజు రామచంద్రన్‌ ఈ వ్యవహారాన్ని ప్రస్తావించారు. విక్టోరియా గౌరీ బీజేపీకి అనుబంధంగా పని చేస్తున్నారని, గతంలో ఆమె క్రైస్తవులు, ముస్లింలకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యలు చేశారని వివరించారు. న్యాయమూర్తుల నియామకంపై కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశమున్నందున ఈ వ్యవహారంపై తక్షణం విచారణ చేపట్టాలని అభ్యర్థించారు. అందుకు ప్రధాన న్యాయమూర్తి స్పందిస్తూ.. సోమవారం విచారణ చేపడతామని సూచించారు. ఇది అత్యవసర కేసు అయినందున సాధ్యమైనంత త్వరగా విచారణ చేపట్టాలని న్యాయవాది అభ్యర్థించగా, శుక్రవారం విచారిస్తామని సీజే స్పష్టం చేశారు. అయితే ఇది జరగడానికి కొన్ని నిమిషాలకు ముందే ఐదుగురు అదనపు న్యాయమూర్తుల నియామకంపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు సామాజిక మాధ్యమాల్లో ప్రకటించడం గమనార్హం. ఇదిలా వుండగా విక్టోరియా గౌరిని న్యాయమూర్తిగా నియమించరాదంటూ ఇటీవల 20మంది న్యాయవాదులు సుప్రీంకోర్టు కొలీజియంకు, రాష్ట్రపతికి లేఖలు పంపిన విషయం తెలిసిందే.

Updated Date - 2023-02-07T08:17:37+05:30 IST