High Court of Karnataka : దాతల వీర్యంతోనూ సరగసీ
ABN , First Publish Date - 2023-11-23T05:08:45+05:30 IST
దాతల వీర్యంతో సరగసీ (అద్దెగర్భం) విధానం ద్వారా బిడ్డలను పొందేందుకు 12 జంటలకు ప్రత్యేక అనుమతి ఇస్తూ కర్ణాటక హైకోర్టు తీర్పును ..
భర్తతో సంతానం పొందేందుకు వీల్లేని వారికి వెసులుబాటు
కర్ణాటక హైకోర్టు ప్రత్యేక అనుమతి.. 12 జంటలకు ఊరట
బెంగళూరు, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): దాతల వీర్యంతో సరగసీ (అద్దెగర్భం) విధానం ద్వారా బిడ్డలను పొందేందుకు 12 జంటలకు ప్రత్యేక అనుమతి ఇస్తూ కర్ణాటక హైకోర్టు తీర్పును వెలువరించింది. 2023 మార్చి 14 నుంచి అమల్లోకి వచ్చిన అద్దెగర్భం చట్టంలోని సవరించిన నిబంధనల ప్రకారం.. సంతానం లేని దంపతులు దాతల బీజకణాల ద్వారా సరగసీ విధానంలో పిల్లలను కనే అవకాశం లేదు. సరగసీకి ఆ జంట తమ బీజకణాలను (భార్య అండం, భర్త వీర్యకణాలను) మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ నిబంధన కారణంగా సరగసీ విధానాన్ని ఉపయోగించుకోలేని 13 జంటలు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాయి. ఈ కేసును విచారించిన హైకోర్టు.. అన్ని కేసులనూ ఒకే కోణంలో చూడడం మంచిది కాదని అభిప్రాయపడింది. పిటిషన్ దాఖలు చేసిన మహిళల ఆరోగ్య పరిస్థితి గర్భధారణకు అనుకూలంగా ఉండకపోవడం, భర్త ద్వారా సంతానం పొందేందుకు వారికి ఏ మాత్రం అవకాశాలు లేకపోవడం.. దాత వీర్యంతో సంతానం పొందేందుకు వారు తమ భర్త అంగీకారం పొందడం.. పిల్లల కోసం ఆ దంపతులు పడుతున్న తపన వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని వారికి ప్రత్యేక అనుమతి ఇస్తున్నట్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.నాగప్రసన్న మంగళవారం తీర్పునిచ్చారు. పిటిషన్ దాఖలు చేసిన మహిళలు గర్భం దాల్చేందుకు వీలుగా ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యేక వెసులుబాటు కల్పించాలని ఽసూచించారు. కాగా.. ఈ కేసు విచారణ సమయంలో వారిలో ఒక పిటిషనర్ మరణించారు. ఈ తీర్పుతో మిగతా 12 జంటలకూ ఊరట లభించినట్టయింది.