Share News

Himanta Biswa Sarma: టీమిండియా ఓటమికి ఇందిరా గాంధీనే కారణం.. రాహుల్‌కి కౌంటర్‌గా హిమంత కొత్త రాగం

ABN , First Publish Date - 2023-11-23T12:09:05+05:30 IST

ఓవైపు వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో పరాజయం చవిచూసినందుకు టీమిండియాతో పాటు క్రీడాభిమానులు బాధపడుతుంటే.. మరోవైపు రాజకీయ నాయకులు మాత్రం ఈ ఓటమిని తమ పొలిటికల్ మైలేజ్ కోసం వినియోగించుకుంటున్నారు.

Himanta Biswa Sarma: టీమిండియా ఓటమికి ఇందిరా గాంధీనే కారణం.. రాహుల్‌కి కౌంటర్‌గా హిమంత కొత్త రాగం

Himanta Biswa Sarma Counter To Rahul Gandhi: ఓవైపు వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో పరాజయం చవిచూసినందుకు టీమిండియాతో పాటు క్రీడాభిమానులు బాధపడుతుంటే.. మరోవైపు రాజకీయ నాయకులు మాత్రం ఈ ఓటమిని తమ పొలిటికల్ మైలేజ్ కోసం వినియోగించుకుంటున్నారు. భారత్ ఓడిపోవడానికి బీజేపీనే కారణమని కాంగ్రెస్ ఆరోపిస్తుంటే, కాదు కాంగ్రెస్ వల్లే టీమిండియా ఓటమిపాలైందంటూ బీజేపీ కౌంటర్ ఎటాక్ చేస్తోంది. తాజాగా రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై చేసిన ‘పనౌతీ’ వ్యాఖ్యలకు కౌంటర్‌గా అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ స్పందించారు. ఈ ఓటమికి ఇండియా గాంధీ పుట్టినరోజుతో లింక్ చేస్తూ.. ఆయన కొత్త రాగం అందుకున్నారు.

బుధవారం సాయంత్రం హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతూ.. ‘‘వరల్డ్ కప్‌లోని లీగ్ దశలో అన్ని ఆటలు గెలిచాం. కానీ ఫైనల్‌ మ్యాచ్‌లో ఓడిపోయాం. ఇందుకు కారణాలేంటని ఆరా తీస్తే.. మన భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఈ ఫైనల్ మ్యాచ్ జరిగినట్టు గుర్తించాను. ఇందిరా గాంధీ జయంతి రోజు వరల్డ్ కప్ ఫైనల్స్ ఆడటం వల్ల, మన దేశం ఓటమి చవిచూసింది’’ అంటూ చెప్పుకొచ్చారు. ఈ ఓటమి తర్వాత తర్వాత తాను బీసీసీఐని సంప్రదించానని, గాంధీ కుటుంబ సభ్యుల పుట్టినరోజు నాడు టీమిండియాకు సంబంధించి ఎలాంటి మ్యాచ్‌లు నిర్వహించొద్దని కోరానని చెప్పారు. వాళ్ల బర్త్‌డే నాడు టీమిండియా గెలవదని వరల్డ్ కప్ ఫైనల్‌తో తేలిందని దుయ్యబట్టారు.


ఇదిలావుండగా.. ఫిబ్రవరి 19వ తేదీన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కి ప్రధాని మోదీ, అమిత్ షాతో పాటు ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయినప్పటి నుంచి సోషల్ మీడియాలో ‘పనౌతీ’ (దురదృష్టవంతుడు) అనే పదం ట్రెండ్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే.. ప్రధాని మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పటివరకూ టీమిండియా మంచి ప్రదర్శన కనబర్చిందని, కానీ పనౌతీ మోదీ అడుగుపెట్టగానే భారత జట్టు పతనమైందని, ఫలితంగా ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైందని పేర్కొన్నారు. ఇందుకు కౌంటర్‌గానే హిమంత పైవిధంగా స్పందించారు.

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులకి ఆలౌట్ అయ్యింది. కెప్టెన్ రోహిత్ శర్మ (47), విరాట్ కోహ్లీ (54), కేఎల్ రాహుల్ (66) మాత్రమే పర్వాలేదనిపిస్తే.. మిగతా బ్యాటర్లు చేతులెత్తేశారు. ఇక 241 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. 43 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని ఛేధించి, ఆరోసారి ఛాంపియన్‌గా నిలిచింది. బౌలింగ్ విభాగంలోనూ భారత ఆటగాళ్లు మెరుగ్గా రాణించకపోవడం వల్ల.. ఆసీస్ జట్టు సునాయాసంగా గెలుపొందింది. ఈ ఓటమిని మన భారత క్రీడాభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.

Updated Date - 2023-11-23T12:09:07+05:30 IST