Nitish Kumar: 'ఇండియా' కూటమి కన్వీనర్‌ పదవిపై నితీష్ ఏమన్నారంటే..?

ABN , First Publish Date - 2023-08-28T15:15:15+05:30 IST

ముంబైలో ఈనెల 31, సెప్టెంబర్ 1న జరగనున్న ప్రతిపక్షాల ''ఇండియా'' కూటమి సమావేశంలో లోగో ఎంపికతో పాటు సమన్వయ కమిటీ నియామకం, కన్వీనర్ ఎన్నిక కీలకం కాబోతున్నాయి. కూటమి కన్వీనర్‌గా బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ నేత నితీష్ కుమార్ నియమితులయ్యే అవకాశాలున్నాయంటూ వస్తున్న ఊహాగానాలను ఆయన తోసిపుచ్చారు. తాను ఏదీ కావాలని అనుకోవడం లేదన్నారు.

Nitish Kumar: 'ఇండియా' కూటమి కన్వీనర్‌ పదవిపై నితీష్ ఏమన్నారంటే..?

పాట్నా: ముంబైలో ఈనెల 31, సెప్టెంబర్ 1న జరగనున్న ప్రతిపక్షాల ''ఇండియా'' (I.N.D.I.A.) సమావేశంలో లోగో ఎంపికతో పాటు సమన్వయ కమిటీ నియామకం, కన్వీనర్ ఎన్నిక కీలకం కాబోతున్నాయి. కూటమి కన్వీనర్‌గా బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ నేత నితీష్ కుమార్ (Nitish Kumar) నియమితులయ్యే అవకాశాలున్నాయంటూ వస్తున్న ఊహాగానాలను ఆయన తోసిపుచ్చారు. తాను ఏదీ కావాలని అనుకోవడం లేదని, మళ్లీ మళ్లీ ఇదే చెబుతున్నాయని మీడియాతో ఆయన సోమవారంనాడు చెప్పారు. విపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకురావాలని మాత్రమే తాను కోరుకుంటున్నానని అన్నారు.


''మొదట్నించీ నేను మీకు ఒకే మాట చెబుతున్నాను. నేను వ్యక్తిగతంగా ఏ పదవి కోరుకోవడం లేదు. ఆ పదవి (కన్వీనర్) ఎవరికైనా ఇవ్వొచ్చు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందే సాధ్యమైనన్ని పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావాలన్నదే నా ఏకైక కోరిక. ఆ దిశగానే నేను పనిచేస్తున్నాను'' అని నితీష్ స్పష్టత ఇచ్చారు. 'ఇండియా' కూటమి భవిష్యత్ వ్యూహంపై చర్చించేందుకే తామంతా ముంబైలో సమావేశమవుతున్నట్టు చెప్పారు. ముంబై సమావేశంలో మరికొన్ని పార్టీలు కూడా చేరే అవకాశం ఉందని ఇప్పటికే నితీష్ వెల్లడించారు. ఆయితే ఆ పార్టీల పేర్లు చెప్పేందుకు ఆయన నిరాకరించారు.


ఇండియాకు స్వాతంత్ర్యం ఎప్పుడొచ్చిందో అందరికీ తెలుసు...

కాగా, లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ్ 1977లో తీసుకువచ్చిన రివల్యూషన్ తరువాతే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందని బీహార్ బీజేపీ చీఫ్ సమ్రాట్ చౌదరి చేసిన వ్యాఖ్యలపై నితీష్ స్పందిస్తూ, భారతదేశానికి స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చిందో ప్రతి ఒక్కరికీ తెలుసునని, స్వాతంత్ర్యం వచ్చిన రోజు తెలియకపోవడం చట్టవిరుద్ధమని అన్నారు. బీజేపీ నేతలు ఏమి మాట్లాడారనే విషయాన్న తాను పట్టించుకోనని అన్నారు.

Updated Date - 2023-08-28T15:15:15+05:30 IST