Nitish Kumar: కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం: నితీశ్ కుమార్
ABN , First Publish Date - 2023-11-17T08:01:16+05:30 IST
బిహార్(Bihar)కు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తామని సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar) కేంద్రాన్ని హెచ్చరించారు. ప్రత్యేక హోదా కోసం జేడీయూ(JDU) ఏళ్లుగా ఉద్యమం చేస్తోందన్నారు.
పట్నా: బిహార్(Bihar)కు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తామని సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar) కేంద్రాన్ని హెచ్చరించారు. ప్రత్యేక హోదా కోసం జేడీయూ(JDU) ఏళ్లుగా ఉద్యమం చేస్తోందన్నారు. ఓ సభలో ఆయన మాట్లాడుతూ.. 'కేంద్రం త్వరగా ప్రత్యేక హోదా ఇవ్వకపోతే, రాష్ట్రవ్యాప్త ఉద్యమం ప్రారంభిస్తాం.
రాష్ట్రంలోని ప్రతి మూలకు ఈ డిమాండ్ ని చేరవేస్తాం. డిమాండ్ కు మద్దతు ఇవ్వని వారు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేవారు. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో అణగారిన కులాల కోటాను 50 శాతం నుంచి 65 శాతానికి పెంచేందుకు శాసనసభ ఇటీవల బిల్లులను ఆమోదించింది.
కులాల సర్వే ఆధారంగా మొత్తం రిజర్వేషన్లను(Caste Reservations) 75 శాతానికి తీసుకువెళ్లాం. సమాజంలో ఆర్థికంగా బలహీనంగా ఉన్న వర్గాల కోసం మేం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇందుకోసం రూ.కోట్లు ఖర్చవుతున్నా మేం వెనకడట్లేదు. 5 ఏళ్లలో సంక్షేమానికి ఖర్చు చేయడానికి ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుంది. స్పెషల్ స్టేటస్ డిమాండ్ నెరవేరితే.. రెండేళ్లలోనే సంబంధిత ప్రయోజనాలన్నీ అందించగలం. అందుకే వెంటనే ప్రత్యేక హోదా అందించాలి. ఇటీవల అసెంబ్లీ ఆమోదించిన బిల్లుల్ని గవర్నర్ రాజేంద్ర అర్లేకర్(Rajendra Arlekar) ఆమోదిస్తారని ఆశిస్తున్నాం.
ఆమోదం పొందిన తరువాత ఆయా వర్గాలకు జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్ కోటా అమలు చేసి వారి అభ్యున్నతికి తోడ్పడతాం' అని అన్నారు. గవర్నర్ ఆమోదం కోసం వెళ్లిన రెండు బిల్లులు షెడ్యూల్డ్ కులాల(SC) కోటాను 16 నుండి 20 శాతానికి, షెడ్యూల్డ్ తెగలు(ST) 1 నుండి 2 శాతానికి, అత్యంత వెనుకబడిన కులాలు (EBC) 18 నుండి 25 శాతానికి, ఇతర వెనుకబడిన తరగతుల (OBC) 15 నుండి 18 శాతానికి రిజర్వేషన్ కోటాను పెంచాయి. కుల గణన ఆధారంగా రిజర్వేషన్ల పెంపు చేపట్టింది అక్కడి ప్రభుత్వం.