Karnataka Assembly elections: ఇప్పటివరకూ వెయ్యికిపైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు... రూ. 126 కోట్ల నగదు, వస్తువులు స్వాధీనం
ABN , First Publish Date - 2023-04-11T21:18:54+05:30 IST
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ ఇప్పటివరకూ వెయ్యికిపైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు.
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly elections) వేళ ఇప్పటివరకూ వెయ్యికిపైగా ఎఫ్‌ఐఆర్‌లు(FIR) నమోదు చేశామని పోలీసులు తెలిపారు. మొత్తం 126 కోట్ల రూపాయల నగదుతో పాటు మద్యం, డ్రగ్స్, విలువైన వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
224మంది సభ్యులున్న కర్ణాటక అసెంబ్లీలో బీజేపీకి 119మంది, కాంగ్రెస్‌కు 75 మంది, జేడీఎస్‌కు 28మంది సభ్యులుండగా 2సీట్లు ఖాళీగా ఉన్నాయి. కాంగ్రెస్ ఇప్పటివరకూ 165 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. జేడీఎస్ 97 మంది అభ్యర్థులతో జాబితా ప్రకటించింది. అయితే అధికార బీజేపీ మాత్రం ఇప్పటివరకూ ఎలాంటి జాబితా ప్రకటించలేదు. 75 సంవత్సరాలకు కాస్త అటుఇటుగా ఉన్న సీనియర్లను ఎన్నికల బరిలో నిలవొద్దని బీజేపీ అధిష్టానం సూచిస్తోంది. అయితే ఈ ఫార్ములాకు కొందరు నాయకులు ఒప్పుకుంటున్నారు. మరికొందరు ధిక్కరిస్తున్నారు.
బీజేపీ(BJP) సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్ (former Chief Minister Jagadish Shettar) ధిక్కార స్వరం వినిపించారు. తన పాపులారిటీ బాగుందని, సర్వేల్లో కూడా ఇది స్పష్టమైందన్నారు. తాను ఒక్క ఎన్నికల్లో కూడా ఓడిపోలేదన్నారు. తనకు టికెట్ ఇవ్వకపోవడానికి కారణమే లేదన్నారు. తాజా ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వాలని బీజేపీ హైకమాండ్‌ను కోరానని శెట్టర్ చెప్పారు. తనకు టికెట్ ఇవ్వడంలేదని పార్టీ చెప్పడంపై ఆయన నొచ్చుకున్నారు. హుబ్బళ్లి నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శెట్టర్ గత ఎన్నికల్లో 21 వేల ఓట్ల తేడాతో గెలిచారు. తనకు టికెట్ నిరాకరించడానికి ఒక్క కారణమైనా చెప్పాలని శెట్టర్ కోరుతున్నారు. వాస్తవానికి ఆయన ఇప్పటికే తన నియోజకవర్గంలో ప్రచారం ప్రారంభించారు కూడా. ఎన్నికలకు దూరమయ్యే ప్రశ్నే లేదని ఆయన హైకమాండ్‌కు స్పష్టం చేశారు. మరికాసేపట్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితా విడుదల కానుంది. ఇంతలోనే ఈ అసమ్మతి స్వరంతో బీజేపీ హైకమాండ్‌కు కొత్త తలనొప్పిగా మారింది.
అంతకు ముందు మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్పను (KS Eshwarappa) హై కమాండ్ దారిలోకి తెచ్చుకోగలిగింది. తాను ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించారు. దీనిపై కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై స్పందించారు. శివమొగ్గ(Shivamogga) నుంచి పోటీ చేయబోనంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు (BJP National President JP Nadda) ఈశ్వరప్ప లేఖ రాశారని ధృవీకరించారు. యువతరం కోసం సీనయర్లు రాజకీయాలనుంచి తప్పుకోవడం అనే గొప్ప సంస్కృతి బీజేపీలో ఉందని బొమ్మై చెప్పారు. నిజానికి ఆయన పోటీ చేయబోనని గతంలోనే ప్రకటించినా పోటీ చేయాలని తాము కోరామన్నారు. అయితే ఆయన తన క్యాడర్‌తో మాట్లాడాక రాజకీయాలనుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నారని బొమ్మై వెల్లడించారు.
కర్ణాటక (Karnataka)లో మే 10న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు మే 13న జరుగుతుందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది.