Parliament: పార్లమెంటులో ఆగని నిరసనలు

ABN , First Publish Date - 2023-08-01T03:28:25+05:30 IST

మణిపూర్‌(Manipur) హింసాకాండపై ప్రధాని మోదీ(PM MODI) ప్రకటన చేయాలంటూ ప్రతిపక్షాలు(Opposition parties) పట్టువీడకుండా నిరసనలు కొనసాగించడంతో సోమవారం మధ్యాహ్నం 3.30 గంటల్లోపే ఉభయ సభలు వాయిదా పడ్డాయి.

 Parliament: పార్లమెంటులో ఆగని నిరసనలు

మణిపూర్‌పై ప్రధాని ప్రకటన చేయాల్సిందేనని విపక్షాల పట్టు

న్యూఢిల్లీ, జూలై 31 (ఆంధ్రజ్యోతి): మణిపూర్‌(Manipur) హింసాకాండపై ప్రధాని మోదీ(PM MODI) ప్రకటన చేయాలంటూ ప్రతిపక్షాలు(Opposition parties) పట్టువీడకుండా నిరసనలు కొనసాగించడంతో సోమవారం మధ్యాహ్నం 3.30 గంటల్లోపే ఉభయ సభలు వాయిదా పడ్డాయి. లోక్‌సభ(Lok Sabha)లో ప్రశ్నోత్తరాల సమయం ఉదయం కేవలం 13 నిమిషాలే జరిగింది. తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు సభ సమావేశమైంది. గందరగోళం మధ్యే సినిమాటోగ్రాఫ్‌ చట్ట సవరణ బిల్లు(Cinematograph Act Amendment Bill)ను ఆమోదించిన తర్వాత మంగళవారానికి వాయిదాపడింది. తొలుత మధ్యాహ్నం ఢిల్లీ సర్వీసుల బిల్లు(Delhi Services Bill)ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావించినప్పటికీ మంగళవారానికి వాయిదా వేసుకున్నట్లు సమచారం. అవిశ్వాసంపై ఎప్పుడు చర్చించాలన్న విషయంపై లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా(Speaker Om Birla) సోమవారం కూడా నిర్ణయం ప్రకటించలేదు.


నేతలతో ఎంపీల బృందం భేటీ

మణిపూర్‌లో క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించి వచ్చిన ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’కు చెందిన 21 మంది ఎంపీల బృందం సోమవారం తమ నాయకులతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ, ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తదితర నేతలు పాల్గొన్నారు. మణిపూర్‌లో పరిస్థితి భయంకరంగా ఉందని ఎంపీల బృందంలో ఒకరైన అధిర్‌ రంజన్‌ చౌధురి తెలిపారు. అధికార పక్ష ఎంపీలు ఎవరైనా స్వయంగా మణిపూర్‌ వెళ్లి అక్కడి పరిస్థితులు చూసి వస్తే పట్టింపు లేని ప్రకటనలు చేయరని అన్నారు. మణిపూర్‌ ప్రజల వ్యథలపై మోదీ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఖర్గే ట్విటర్‌లో విమర్శించారు. మణిపూర్‌ ప్రజలు తమ హృదయవిదారక గాథలెన్నో ఎంపీల బృందానికి తెలిపారని పేర్కొన్నారు. ప్రధానికి ఎన్నికల సభలు, బీజేపీ సమావేశాలు, రైళ్ల ప్రారంభోత్సవాలు, ప్రచార ఆర్భాటాలకు సమయం ఉంటుంది కానీ మణిపూర్‌ సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నించడానికి మాత్రం సమయం లేదని ఖర్గే విమర్శించారు. ప్రధాని అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని, ఆయనది గుండె కాదు బండరాయి అని టీఎంసీ నేత డెరెక్‌ ఒబ్రెయిన్‌ విమర్శించారు. కాగా, మణిపూర్‌ హింసాకాండను ఖండిస్తూ పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ సోమవారం ఓ తీర్మానాన్ని ఆమోదించింది. ప్రధాని మోదీ విదేశీ పర్యటనలకు వెళతారు కానీ మణిపూర్‌ మాత్రం వెళ్లరని సీఎం మమతా బెనర్జీ విమర్శించారు. ఈ తీర్మానాన్ని ప్రతిపక్ష బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున చర్చ చట్టవిరుద్ధమని ప్రతిపక్ష నేత సువేందు పేర్కొన్నారు.

Updated Date - 2023-08-01T03:28:25+05:30 IST