లాంగ్ రేంజ్ స్వదేశీ క్షిపణి వ్యవస్థపై భారత్ కన్ను
ABN , First Publish Date - 2023-07-27T01:33:09+05:30 IST
క్షణ రంగం(Defense sector)లో స్వయం సమృద్ధి సాధించే దిశగా భారత్(INDIA) గణనీయమైన పురోగతి సాధిస్తోంది. అత్యాధునిక లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ (ఎల్‌ఆర్‌ఎస్‌ఏఎం)ను స్వదేశీయంగా అభివృద్ధి చేయడంపై దృష్టిపెట్టింది.
న్యూఢిల్లీ, జూలై 26: రక్షణ రంగం(Defense sector)లో స్వయం సమృద్ధి సాధించే దిశగా భారత్(INDIA) గణనీయమైన పురోగతి సాధిస్తోంది. అత్యాధునిక లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ (ఎల్‌ఆర్‌ఎస్‌ఏఎం)ను స్వదేశీయంగా అభివృద్ధి చేయడంపై దృష్టిపెట్టింది. భూ ఉపరితలం నుంచి సుమారు 400 కిలోమీటర్ల పరిధిలోని గగనతలంలో శత్రు విమానాలు, క్షిపణులను సమర్థవంతంగా ధ్వంసం చేయగల శక్తిమంతమైన మూడంచెల రక్షణ వ్యవస్థను స్వదేశీయంగా ఏర్పాటు చేయడం ఈ ఎల్‌ఆర్‌ఎ్‌సఏఎం ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలు పురోగతిలో ఉన్నాయని, త్వరలోనే వాటిని ఆమోదం కోసం సమర్పించే అవకాశం ఉందని రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. ప్రాజెక్టు వ్యయం సుమారు రూ.20,515 కోట్లు ఉంటుందని అంచనా. ఈ మెగా ప్రాజెక్టు విజయవంతమై ఎల్‌ఆర్‌ఎ్‌సఏఎం వ్యవస్థ అందుబాటులోకి వస్తే ఇంతటి సుదూర లక్ష్యాలను ఛేదించగల స్వదేశీ క్షిపణి వ్యవస్థ కలిగిన చైనా సరసన భారత్ నిలవనుంది. భారత ఎల్‌ఆర్‌ఎ్‌సఏఎం వ్యవస్థ అత్యాధునికమైనదని, గతంలో రష్యా నుంచి కొనుగోలు చేసి చైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లో మోహరించిన అత్యంత శక్తిమంతమైన ఎస్-400 రక్షణ వ్యవస్థతో పోల్చదగినదని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు.