Share News

Bharat Brand Rice: భారత్ బియ్యం వచ్చేస్తుందోచ్.. కిలో రూ.25 మాత్రమే!

ABN , Publish Date - Dec 27 , 2023 | 08:10 PM

బియ్యం ధరలు క్రమంగా పెరుగుతున్న తరుణంలో.. కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ బ్రాండ్‌తో కిలో బియ్యాన్ని రూ.25లకే విక్రయించేందుకు సిద్ధమవుతోందని తెలుస్తోంది. ఇప్పటికే గోధుమ పిండి, ప‌ప్పుధాన్యాల‌ను...

Bharat Brand Rice: భారత్ బియ్యం వచ్చేస్తుందోచ్.. కిలో రూ.25 మాత్రమే!

Bharat Brand Rice: బియ్యం ధరలు క్రమంగా పెరుగుతున్న తరుణంలో.. కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ బ్రాండ్‌తో కిలో బియ్యాన్ని రూ.25లకే విక్రయించేందుకు సిద్ధమవుతోందని తెలుస్తోంది. ఇప్పటికే గోధుమ పిండి, ప‌ప్పుధాన్యాల‌ను భార‌త్ ఆటా, భార‌త్ దాల్ పేరిట డిస్కౌంట్ ధ‌ర‌ల‌కు కేంద్రం అందిస్తోంది. ఇప్పుడు భారత్ రైస్‌ని రూ.25కే అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (నాఫెడ్), నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్సీసీఎఫ్), కేంద్రీయ భండార్ ఔట్‌లెట్లు, మొబైల్ వ్యాన్లు వంటి ప్రభుత్వ సంస్థల ద్వారా రాయితీ ధరకు బియ్యం విక్రయించనుందని తెలిసింది.


ప్రస్తుతం బియ్యం ధరలు సగటున కిలోకు రూ.44కి చేరుకుంది. గతేడాదిలోనే బియ్యం ధర 14.1% పెరిగింది. కేవలం నవంబర్ నెలలోనే 10.27% తృణధాన్యాల ధరలు పెరగడంతో.. ద్రవ్యోల్బణం 8.70%కి చేరుకుంది. దీంతో.. ద్ర‌వ్యోల్బ‌ణం క‌ట్ట‌డి దిశ‌గా కేంద్రం భార‌త్ రైస్ పంపిణీకి చ‌ర్య‌లు చేప‌డుతోంది. పెరుగుతున్న ధరల్ని నియంత్రించి, ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయాలన్న ఆలోచనతోనే కేంద్రం తక్కువ ధరకు భారత్ బ్రాండ్ పేరుతో బియ్యాన్ని సరఫరా చేయాలని యోచిస్తోంది. ప్రస్తుతం కేంద్రం భారత్ బ్రాండ్ కింద కిలో చొప్పున గోధుమ పిండిని రూ.27.50, శనగపప్పులను రూ.60 రాయితీ ధరలకు విక్రయిస్తోంది. వీటిని దేశవ్యాప్తంగా 2 వేలకు పైగా ఔట్ లెట్స్‌లో విక్రయిస్తున్నారు. భార‌త్ ఆటా, భార‌త్ దాల్ మాదిరిగానే భారత్ బియ్యాన్ని విక్రయించే ప్రక్రియ ఉంటుందని తెలుస్తోంది.

నిత్యావసర ఆహారధాన్యాల ధరలను నియంత్రించడంతో పాటు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం గత కొన్ని నెలల నుంచి అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే.. ఈ ఏడాది జులైలో బాస్మతియేతర బియ్యం ఎగుమతులను నిషేధించింది. దేశీయ మార్కెట్‌లో బియ్యం లభ్యతను పెంచేందుకు బహిరంగ మార్కెట్ సేల్స్ స్కీమ్ (ఒఎంఎస్ఎస్) ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) 4,00,000 టన్నుల బియ్యాన్ని కిలోకు రూ.29లకు విక్రయిస్తోంది. అటు.. మదర్ డెయిరీ కిరాణా చైన్ సఫల్‌తో పాటు వివిధ మార్గాల ద్వారా కిలో ఉల్లిని రూ.25 చొప్పున సబ్సిడీ రిటైల్ అమ్మకాలను కూడా ప్రభుత్వం ప్రారంభించింది.

Updated Date - Dec 27 , 2023 | 08:10 PM