HAL: యుద్ధ విమానాలకు ఇకపై డిజిటల్ మ్యాప్స్.. హెచ్ఏఎల్ కీలక నిర్ణయం
ABN , First Publish Date - 2023-12-09T12:50:05+05:30 IST
ఫైటర్ జెట్ల(Fighter Jets)ను ఇప్పుడు ప్రధానంగా వేధిస్తున్న సమస్య రూట్ మ్యాప్. గతంలో కెప్టెన్ అభినందన్ వర్తమాన్(Abinandan Varthaman) రూట్ మ్యాప్ సమస్యే వచ్చి దాయాదుల చేతిలో చిక్కుకున్నారు. పైలట్లు కొండ ప్రాంతాల్లో వెళ్తున్నప్పుడు ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటోంది.
ఢిల్లీ: ఫైటర్ జెట్ల(Fighter Jets)ను ఇప్పుడు ప్రధానంగా వేధిస్తున్న సమస్య రూట్ మ్యాప్. గతంలో కెప్టెన్ అభినందన్ వర్తమాన్(Abinandan Varthaman) రూట్ మ్యాప్ సమస్యే వచ్చి దాయాదుల చేతిలో చిక్కుకున్నారు. పైలట్లు కొండ ప్రాంతాల్లో వెళ్తున్నప్పుడు ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటోంది. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టనున్నట్లు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) డైరెక్టర్ DK సునీల్ తెలిపారు.
వీటికి పరిష్కారంగా డిజిటల్ మ్యాప్(Digital Maps)ను త్వరలో అన్ని యుద్ధ హెలికాప్టర్లలో అమర్చనున్నట్లు చెప్పారు. ఇవి కొండ ప్రాంతాల్లో నావిగేట్ చేయడానికి ఉపయోగపడతాయని అన్నారు. పైలట్లు ఎగురుతున్నప్పుడు వారి కాక్ పిట్ డిస్ ప్లేలో మ్యాప్ ను చెక్ చేసుకోగలరని తెలిపారు.
తద్వారా తాము ఉన్న ప్రాంతాన్ని, ఫైటర్ జెట్లు వెళ్తున్న దిశను ఈజీగా తెలుసుకోవచ్చన్నారు. 2019 బాలాకోట్ వైమానిక దాడుల సమయంలో శత్రు జెట్‌పై దాడి చేస్తున్న సమయంలో గ్రూప్ కెప్టెన్ అభినందన్ వర్థమాన్ కి చెందిన మిగ్ -21 కుప్ప కూలడంతో ఆయన పాకిస్థాన్ దళాలకు దొరికారు. 3 రోజుల తరువాత పాక్ ఆయన్ని వదిలిపెట్టింది. ఇటువంటి పరిస్థితులలో, డిజిటల్ మ్యాప్‌లు పైలట్‌లు దిశను కోల్పోకుండా, సరిహద్దుల్లో మరింత అప్రమత్తంగా ఉండేందుకు సహాయపడతాయని భావిస్తున్నారు.
భారత యుద్ధ విమానాల్లో డిజిటల్ మ్యాప్‌లను అమర్చే ప్రక్రియ కొనసాగుతోంది. "మ్యాప్ 2D, 3D టెక్నాలజీలో అందుబాటులో ఉంటుంది. పైలట్లు కొండ ప్రాంతంలో ఉంటే ముందుగానే అప్రమత్తం చేస్తుంది. దీంతో ఎత్తైన కొండ ప్రాంతాల్లో సంభవించే ప్రమాదాలు తగ్గుతాయి. డిజిటల్ మ్యాప్ శత్రు సైనిక స్థావరాలు, వాయు రక్షణ వ్యవస్థల గురించి కూడా తెలియజేస్తాయి. వీటిని ప్రతి విమానంలో అమర్చుతాం. దాని హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ అన్నీ భారత్ లోనే తయారు చేశారు" అని సునీల్ తెలిపారు.
డిజిటల్ మ్యాప్‌లు రక్షణ రంగంలో స్వయం ప్రతిపత్తిని పెంచడానికి భారత్ లో రూపొందించి, ఉత్పత్తి చేస్తున్నారు. అన్ని యుద్ధ విమానాల్లో వీటిని అమర్చనున్నట్లు అధికారులు వెల్లడించారు.