Manipur Violence: సీఎం సభా వేదికకు నిప్పు, సెక్షన్ 144 అమలు, ఇంటర్నెట్ సర్వీసులు నిలిపివేత
ABN , First Publish Date - 2023-04-28T14:21:14+05:30 IST
మణిపూర్ లో హింసాకాండ చెలరేగింది. అల్లరి మూక రెచ్చిపోయి విధ్వంసం సృష్టించారు. ముఖ్యమంత్రి ..
ఇంఫాల్: మణిపూర్ (Manipur)లో హింసాకాండ చెలరేగింది. అల్లరి మూక రెచ్చిపోయి విధ్వంసం సృష్టించారు. ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ (N Biren Singh) శుక్రవారంనాడు పర్యటించాల్సి ఉన్న చురాచాంద్‌పూర్ (Churachandpur) జిల్లాలోని సభా వేదికను ధ్వంసం చేసి, నిప్పుపెట్టారు. దీంతో స్థానిక యంత్రాంగం చురాచాంద్‌పూర్‌లో ఇంటర్నెట్ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసింది. జిల్లాలో 144 సెక్షన్‌ను పోలీసులు అమల్లోకి తెచ్చారు.
షెడ్యూల్ ప్రకారం న్యూ లంకలోని పీటీ స్పోర్ట్స్ క్లాంప్లెక్స్‌లో కొత్తగా నిర్మించిన జిమ్‌ను ముఖ్యమంత్రి శుక్రవారంనాడు ప్రారంభించాల్సి ఉంది. అయితే ఆందోళనకు దిగిన అల్లరిమూక సభాస్థలిలోని చైర్లు విరగ్గొట్టి, ఇతర ఆస్తులను ధ్వంసం చేసింది. క్రీడాసామగ్రికి నిప్పుపెట్టింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అల్లరిమూకను చెదరగొట్టినప్పటికీ, జిమ్‌లోని కొంతభాగం అప్పటికే ధ్వంసమైంది. వందకు పైగా కుర్చీలు అగ్నికి ఆహుతయ్యాయి. పరిస్థితి అదుపు తప్పడంతో జిల్లా యంత్రాంగం అదనపు భద్రతా బలగాలను రప్పించింది. పరిస్థితి ఇప్పటికీ ఉద్రిక్తంగానే ఉంది. రిజర్వెడ్ ఫారెస్ట్ ల్యాండ్‌ను బీజేపీ ప్రభుత్వం సర్వే చేయించడాన్ని విభేదిస్తున్న స్థానిక గిరిజన నేతల ఫోరం సారథ్యంలో కొందరు ఈ హింసాకాండకు పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని చర్చిలను కూడా కూల్చివేసినట్టు గిరిజన ఫోరం ఆరోపిస్తోంది.