Terror Attack: భారత్‌లో ఆ నగరాలపై ఉగ్రదాడికి ప్లాన్.. భగ్నం చేసిన గుజరాత్ పోలీసులు
ABN , First Publish Date - 2023-11-23T19:49:45+05:30 IST
భారత్‌లోని రెండు ప్రధాన నగరాలపై ఉగ్రదాడి కుట్రను గుజరాత్ పోలీసులు భగ్నం చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్ లోని అహ్మదాబాద్, గాంధీనగర్ నగరాలపై ఇస్లామిక్ స్టేట్ టెర్రర్ స్ట్రైక్(ISIS) సంస్థ టెర్రరిస్ట్ ఉగ్రదాడులకు ప్లాన్ చేసింది.
గాంధీనగర్: భారత్‌లోని రెండు ప్రధాన నగరాలపై ఉగ్రదాడి కుట్రను గుజరాత్ పోలీసులు భగ్నం చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్ లోని అహ్మదాబాద్, గాంధీనగర్ నగరాలపై ఇస్లామిక్ స్టేట్ టెర్రర్ స్ట్రైక్(ISIS) సంస్థ టెర్రరిస్ట్ ఉగ్రదాడులకు ప్లాన్ చేసింది. అక్టోబర్ లో ఢిల్లీలోని ఓ రహస్య స్థావరం నుంచి అనుమానిత ఇస్లామిక్ స్టేట్ ఆపరేటివ్ షానవాజ్ అలియాస్ షఫీ ఉజ్జామాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారించగా సంచలన విషయాలు బయటపడ్డాయి. గుజరాత్ లోని రెండు ప్రధాన నగరాలతో పాటు.. గేట్ వే ఆఫ్ ఇండియాపై ఉగ్రదాడులు చేయాలని ఐసిస్ పతకం పన్నిందని అతను పోలీసుల విచారణలో వెల్లడించాడు.
ఇప్పటివరకు జరిగిన ఉగ్రదాడులతో పోల్చితే విధ్వంస స్థాయి ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేసినట్లు చెప్పాడు. ఇందులో అలీఘర్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థుల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరి కార్యకలాపాలకు పుణెను కేంద్రంగా ఎంచుకున్నట్లు చెప్పారు. షానవాజ్ భార్య ఇస్లాం మతంలోకి మారడానికి ముందు హిందువు అని, ఇద్దరూ అలీఘర్ విశ్వవిద్యాలయంలో కలుసుకున్నారని, అక్కడ వారు ఉగ్ర కుట్రలకు పాల్పడ్డారని అధికారులకు చెప్పారు.
షానవాజ్ తన స్వస్థలమైన జార్ఖండ్‌లో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడినప్పుడు ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకున్నాడని అధికారులు తెలిపారు. 2011లో యెమెన్‌లో US డ్రోన్ దాడిలో మరణించిన సీనియర్ అల్ ఖైదా కార్యకర్త అన్బర్ అల్-అవ్లాకీ దగ్గర అతను శిక్షణ పొందినట్లు తెలుస్తోంది.
హిజ్బ్ ఉత్-తహ్రిర్
షానవాజ్ తన విచారణలో Hizb ut-Tahir అనే ఇస్లామిస్ట్ సంస్థలో చేరినట్లు చెప్పాడు. ఆ సంస్థకు సంబంధాలున్న వ్యక్తులపై ఆగస్టులో ఎన్‌ఐఏ భోపాల్‌లో దాడులు నిర్వహించింది. అనంతరం తెలంగాణ, మధ్యప్రదేశ్‌లలో జరిగిన దాడులన్నింటిలో 16 మంది అరెస్టయ్యారు.
ఈ క్రమంలో భారీ ఉగ్ర కుట్రలు ఛేదించారు. బంగ్లాదేశ్, ఇండోనేషియా, చైనా, జర్మనీ తదితర దేశాల్లో HuTపై ఇప్పటికే నిషేధం ఉంది. ఇదిలా ఉండగా, బాంబుల తయారీకి, ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చేందుకు పుణేలోని మాడ్యూల్స్‌కు డబ్బు పంపే హవాలా మార్గాల గురించి కూడా షానవాజ్ అధికారులకు చెప్పినట్లు సమాచారం.