26/11 Mumbai attacks: లష్కరేను ఉగ్రసంస్థగా ప్రకటించిన ఇజ్రాయెల్
ABN , First Publish Date - 2023-11-21T17:33:49+05:30 IST
ముంబైలో 2008లో 160 మంది అమాయక ప్రజల ప్రాణాలు బలిగొన్న 26/11 దాడులు జరిగి 15 ఏళ్ల కావొస్తున్న తరుణంలో ఇజ్రాయెల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముంబై మారణహోమానికి కారణమైన లష్కరే తొయిబాను ఉగ్ర సంస్థగా అధికారికంగా ప్రకటించింది.
న్యూఢిల్లీ: ముంబైలో 2008లో 160 మంది అమాయక ప్రజల ప్రాణాలు బలిగొన్న 26/11 దాడులు (Mumbai 26/11 Attacks) జరిగి 15 ఏళ్ల కావొస్తున్న తరుణంలో ఇజ్రాయెల్ (Israel) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముంబై మారణహోమానికి కారణమైన లష్కరే తొయిబా (Lashkar-e-Taiba)ను ఉగ్ర సంస్థ (Terror organisation)గా అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు న్యూఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
లష్కరే తొయిబాను ఉగ్ర సంస్థల జాబితాలో చేర్చామని, ఇందుకోసం భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి అభ్యర్థన రాకపోయినప్పటికీ తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇజ్రాయెల్ ఎంబసీ ఆ ప్రకటనలో తెలిపింది. ఉగ్రసంస్థగా లష్కరేను ప్రకటించేందుకు అవసరమైన అధికార ప్రక్రియను పూర్తి చేశామని తెలిపింది. భారత పౌరులతో పాటు వందలాది మందని లష్కరే పొట్టునపెట్టుకుందని, 2008 నవంబర్ 26 నాటి ఘాతుకం శాంతిని కోరుకునే దేశాలు, సమాజాల గుండెల్లో ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉందని పేర్కొంది. ముంబై మారణహోమంలో ప్రాణాలు కోల్పోయిన, బాధిత కుటుంబాలకు ఇజ్రాయెల్ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసింది. 2008 నవంబర్ 26న పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే లష్కరేకు చెందిన 10 మంది ఉగ్రవాదులు సముద్ర తీరం గుండా ముంబైలో చొరబడి ముంబైలోని 12 కీలక ప్రాంతాల్లో బాంబుల దాడి సాగించారు. ఈ మారణహోమంలో 18 మంది భద్రతా సిబ్బంది, ఒక ఇజ్రాయెల్ పౌరుడి సహా 166 మంది ప్రాణాలు కోల్పోయారు. తొమ్మిది మంది టెర్రరిస్టులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. టెర్రరిస్ట్ అజ్మల్ కసబ్ ఒక్కడే ప్రాణాలతో పట్టుబడ్డాడు. నాలుగేళ్ల తర్వాత 2012 నవంబర్ 21న కసబ్‌ను ఉరితీశారు.