Share News

Israel-Hamas War: భారత్‌కు పెద్ద ఫిట్టింగ్ పెట్టిన ఇజ్రాయెల్.. ఆ పని చేయాలంటూ డిమాండ్

ABN , First Publish Date - 2023-10-26T15:45:30+05:30 IST

ఇజ్రాయెల్, హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు) మధ్య జరుగుతున్న యుద్ధంలో.. భారత్ ఇప్పటికే హమాస్ దాడుల్ని ఖండించి, ఇజ్రాయెల్‌కు పూర్తి మద్దతు తెలిపింది. ఇందుకు ఇజ్రాయెల్ భారత్‌కు కృతజ్ఞతలు తెలపడంతో పాటు..

Israel-Hamas War: భారత్‌కు పెద్ద ఫిట్టింగ్ పెట్టిన ఇజ్రాయెల్.. ఆ పని చేయాలంటూ డిమాండ్

ఇజ్రాయెల్, హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు) మధ్య జరుగుతున్న యుద్ధంలో.. భారత్ ఇప్పటికే హమాస్ దాడుల్ని ఖండించి, ఇజ్రాయెల్‌కు పూర్తి మద్దతు తెలిపింది. ఇందుకు ఇజ్రాయెల్ భారత్‌కు కృతజ్ఞతలు తెలపడంతో పాటు.. హమాస్‌కు వ్యతిరేకంగా గళమెత్తినందుకు ప్రశంసించింది. ఇప్పుడు లేటెస్ట్‌గా మరో ఫిట్టింగ్ పెట్టింది. అమెరికా, కెనడాలతో పాటు ఇతర దేశాలు చేసినట్లుగా.. హమాస్‌ను ఉగ్రవాద సంస్థగా గుర్తించాలని, ఆ సమయం ఇప్పుడు ఆసన్నమైందని భారత్‌ను కోరింది. ఈ మేరకు మన దేశంలో ఉన్న ఇజ్రాయెల్‌ రాయబారి నవోర్‌ గిలాన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.


‘‘ముఖ్యమైన దేశాలు మాకు మద్దతు తెలుపుతున్నాయి. అవన్నీ ప్రజాస్వామ్య దేశాలు. ఇప్పుడు భారత్ కూడా హమాస్‌ను అధికారికంగా ఉగ్రవాద సంస్థగా ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైందని నేను భావిస్తున్నాను’’ అని ఓ మీడియా సమావేశంలో గిలోన్ చెప్పారు. ఇప్పటికే అమెరికా, కెనడా, యూరోపియన్ యూనియన్‌తో పాటు అనేక దేశాలు హమాస్‌ను ఉగ్రవాద సంస్థగా గుర్తించాయని తెలిపారు. తాము ఇప్పటికే ఈ అంశంపై భారత్‌లో సంబంధిత అధికారులతో మాట్లాడామని, హమాస్ గురించి ఇక్కడి అధికారులతో మాట్లాడటం ఇదే మొదటిసారి కాదని అన్నారు. ఇప్పటికీ చర్చలు స్నేహపూర్వకంగానే జరుగుతున్నాయని పేర్కొన్నారు. రెండు దేశాలు ఈ ఉగ్రవాద ముప్పును అర్థం చేసుకున్నాయని తాను భావిస్తున్నానని, ఉగ్రవాద కార్యకలాపాలతో పాటు ఇతర వ్యూహాత్మక విషయాల్లోనూ తాము ఒకే రకమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నామని ఆయన చెప్పుకొచ్చారు.

ఇదిలావుండగా.. అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపుదాడులు చేయడంతో 1400 మందికి పైగా ఆ దేశస్తులు మరణించారు. అంతేకాదు.. భూమి, వాయు, జల మార్గాల ద్వారా హమాస్ యోధులు ఇజ్రాయెల్‌లోకి చొరబడి.. వందలాది మందిని బందీలుగా గాజాకు తీసుకెళ్లారు. దీంతో.. ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు దిగింది. మొత్తం హమాస్‌ని సర్వనాశనం చేయాలన్న ఉద్దేశంతో గాజాలో బాంబుల వర్షం కురిపిస్తోంది. గ్రౌండ్ ఆపరేషన్స్ కూడా మొదలుపెట్టారు. అటు.. హమాస్ దాడులు చేసిన వెంటనే భారత్ వాటిని ఖండించడం, ఇజ్రాయెల్‌కు మద్దతు తెలపడంతో గిలోన్ భారతదేశాన్ని ప్రశంసించారు. ప్రపంచంలో చాలా స్పష్టమైన ప్రకటనతో వచ్చిన మొదటి నాయకుల్లో ప్రధాని మోదీ ఉన్నారన్నారు. భారత్ తమకు మిత్రదేశమని పేర్కొన్నారు. మరోవైపు.. ఇజ్రాయెల్‌-పాలస్తీనా విషయంలో తమ వైఖరి స్థిరంగా ఉందని భారత్‌ ఇటీవల స్పష్టం చేసింది.

Updated Date - 2023-10-26T15:45:30+05:30 IST