Gaganyaan Mission: గగన్‌యాన్ ప్రాజెక్ట్‌పై కీలక అప్డేట్.. వారికే అధిక ప్రాధాన్యం కల్పిస్తామన్న ఇస్రో ఛైర్మన్
ABN , First Publish Date - 2023-10-22T21:04:55+05:30 IST
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఇప్పుడు ఫుల్ జోష్‌లో ఉంది. అంతరిక్షంలో పరిశోధనలు చేసేందుకు గాను ప్రతిష్టాత్మక మిషన్‌లు చేపట్టేందుకు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఇస్రో చేపట్టిన ‘చంద్రయాన్-3’ ప్రాజెక్ట్ విజయవంతం...
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఇప్పుడు ఫుల్ జోష్‌లో ఉంది. అంతరిక్షంలో పరిశోధనలు చేసేందుకు గాను ప్రతిష్టాత్మక మిషన్‌లు చేపట్టేందుకు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఇస్రో చేపట్టిన ‘చంద్రయాన్-3’ ప్రాజెక్ట్ విజయవంతం అయ్యింది. దక్షిణ ధ్రువంలో కాలు మోపడంతో, ఈ ఫీట్ సాధించిన తొలి దేశంగా భారత్ చరిత్రపుటలకెక్కింది. ఈ ప్రాజెక్ట్ చంద్రుని ఉపరితలంపై ప్రయోగాలు జరిపి, భూమికి ఎంతో కీలకమైన సమాచారాన్ని అందజేసింది. ఈ మిషన్ చేపట్టిన కొన్ని రోజులకే సూర్యుడ్ని అధ్యయనం చేసేందుకు ఆదిత్య-ఎల్1ని లాంచ్ చేసింది.
ఈ ఉత్సాహంలోనే ఇస్రో ఇప్పుడు గగన్‌యాన్ మిషన్‌పై పూర్తి దృష్టి సారించింది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా తలపెట్టిన తొలి టెస్ట్ వెహికల్ (టీవీ-డీ1) ప్రయోగం విజయవంతం అయ్యింది కూడా! ఈ నేపథ్యంలోనే ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ కీలక సమాచారాన్ని పంచుకున్నారు. ఈ ప్రాజెక్టులో తాము మహిళలకు అధిక ప్రాధాన్యం కల్పించే యోచనలో ఉన్నామని అన్నారు. మహిళా ఫైటర్ టెస్టు పైలట్లు, మహిళా శాస్త్రవేత్తలను ఈ కీలక ప్రాజెక్టులో భాగం చేస్తామని తెలిపారు. వచ్చే ఏడాది మానవ రహిత గగన్‌యాన్ స్పేస్ క్రాఫ్ట్‌లో ఫీమేల్ హ్యూమనాయిడ్ (మనిషిని పోలి ఉండే రోబో)ను పంపిస్తామని పేర్కొన్నారు. తమకు తగిన అభ్యర్థులు దొరికితే.. తప్పకుండా మహిళలకు అధిక ప్రాధాన్యమిస్తామన్నారు.
ప్రస్తుతానికి ఎయిర్‌ఫోర్స్‌కు చెందినవారిని ఫైటర్ టెస్టు పైలట్ అభ్యర్థులుగా ఎంపిక చేస్తున్నామని సోమనాథ్ తెలిపారు. ప్రస్తుతానికి మహిళా ఫైటర్ టెస్టు పైలట్లు అందుబాటులో లేరని.. వాళ్లు ముందుకొస్తే ఓ మార్గం సుగమం అవుతుందని చెప్పుకొచ్చారు. ఈ ప్రాజెక్టులో మహిళల భాగస్వామ్యం నెలకొల్పడానికి రెండో ఎంపిక అనేది శాస్త్రీయ కార్యకలాపాలతో కూడుకుని ఉంటుందన్నారు. ఈ ఎంపికలో శాస్త్రవేత్తలే వ్యోమగాములుగా వ్యవహరించాల్సి ఉంటుందని.. అప్పుడు మహిళలకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని తాను విశ్వసిస్తున్నానని చెప్పారు. 2035 కల్లా పూర్తిస్థాయిలో కార్యకలాపాలు నిర్వహించే భారతీయ స్పేస్ స్టేషన్‌ను అంతరిక్షంలో నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు.
కాగా.. వ్యోమగాముల్ని అంతరిక్షంలోకి పంపించడమే గగన్‌యాన్ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. అంతరిక్షంలో మానవ అన్వేషణ కోసమే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ని చేపట్టనున్నారు. ఈ మిషన్‌లో భాగంగా.. నలురుగు వ్యోమగాముల్ని (ముగ్గురు పురుషులు, ఒకరు మహిళ) 400 కిలోమీటర్ల తక్కువ భూ కక్ష్యలోకి పంపుతారు. మూడు రోజుల పాటు వారిని అక్కడే అక్కడే ఉంచి.. తిరిగి భూమికి సురక్షితంగా తీసుకొస్తారు.