Chandrayaan-3 : చంద్రునిపై అడుగు పెట్టి, నూతన చరిత్రను లిఖించిన భారత్
ABN , First Publish Date - 2023-08-23T18:19:21+05:30 IST
జాబిల్లిపై భారత దేశ సింహాలు జూలు విదిల్చి గర్జించాయి. చంద్రుని దక్షిణ ధ్రువంలో మొట్టమొదటిసారి దిగిన ఘనత భారత దేశానికి దక్కింది. చంద్రయాన్-3 విజయవంతం కావడంతో భారతీయులంతా సంబరాల్లో మునిగిపోయారు.
న్యూఢిల్లీ : జాబిల్లిపై భారత దేశ సింహాలు జూలు విదిల్చి గర్జించాయి. చంద్రుని దక్షిణ ధ్రువంలో మొట్టమొదటిసారి దిగిన ఘనత భారత దేశానికి దక్కింది. చంద్రయాన్-3 విజయవంతం కావడంతో భారతీయులంతా సంబరాల్లో మునిగిపోయారు. భరత మాత ముద్దు బిడ్డలైన శాస్త్రవేత్తలను అందరూ ప్రశంసిస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇస్రో (అంతరిక్ష పరిశోధన సంస్థ) శాస్త్రవేత్తలను అభినందించారు.
ప్రధాని మోదీ బ్రిక్స్ సమావేశంలో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన జొహెన్నస్‌బర్గ్ నుంచి వర్చువల్ విధానంలో చంద్రయాన్-3 కార్యక్రమాన్ని వీక్షించారు.
విక్రమ్ ల్యాండర్ చంద్రుని ఉపరితలంపై అడుగిడిన వెంటనే మోదీ కరతాళ ధ్వనులు చేస్తూ, జాతీయ జెండాను ఊపుతూ హర్షం ప్రకటించారు. ఇది మునుపెన్నడూ లేనంత గొప్ప అద్భుత క్షణాలని పేర్కొన్నారు. అమృత్‌కాలం ప్రారంభంలో గొప్ప విజయం సాధించామన్నారు. ఇది నవ భారతానికి నాంది అని తెలిపారు. అంతరిక్ష రంగంలో నవ భారతం నవోదయం సాధించిందన్నారు. మన కళ్ల ముందే గొప్ప చరిత్ర ఆవిష్కృతమైందన్నారు. భారత దేశ నూతన అదృష్టం ప్రారంభమైందన్నారు. టీమ్ చంద్రయాన్, ఇస్రోలకు, శాస్త్రవేత్తలందరికీ శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. తాను బ్రిక్స్ సమావేశం కోసం దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్నప్పటికీ తన మనసంతా చంద్రయాన్-3పైనే ఉందన్నారు. భూమిని భూమాత అంటామని, చంద్రుడిని చందమామ అంటామని గుర్తు చేశారు. చందమామ చాలా దూరమని అంటారన్నారు. ఇకపై చందమామపై సరదాగా పర్యటనలు చేయడానికి సాధ్యమవుతుందన్నారు. భూమిపై సంకల్పం చేసి, చందమామపై విజయం సాధించామని చెప్పారు. భారతీయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. భారత దేశం జీ20 ప్రెసిడెన్సీని నిర్వహిస్తున్న సంవత్సరంలో ఈ విజయం లభించిందన్నారు. వసుధైక కుటుంబకం అనే నినాదంతో ఈ సంవత్సరం జీ20 సమావేశాలు జరుగుతున్నాయన్నారు. మానవుడి కేంద్రంగా చంద్రయాన్-3 జరిగిందన్నారు.
చంద్రుని దక్షిణ ధ్రువానికి చేరిన తొలి దేశం భారత దేశమని చెప్పారు. మనందరికీ ఉజ్వల భవిష్యత్తు ఉండాలన్నారు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని విజయాలను సొంతం చేసుకోవడం గురించి తెలుసుకోవచ్చునన్నారు. చంద్రయాన్-3 విజయం యావత్తు మానవాళి సాధించిన విజయమని తెలిపారు.