Chandrayaan-3 : ఇక ఆట మొదలైంది.. చంద్రునిపై ఉష్ణోగ్రత వివరాలు వచ్చేశాయ్..!
ABN , First Publish Date - 2023-08-27T16:04:09+05:30 IST
చంద్రయాన్-3 ఫలితాలు ప్రపంచం ముందుకు వస్తున్నాయి. చంద్రుని దక్షిణ ధ్రువంపై ఉష్ణోగ్రతల తీరు మొదటిసారి తెలిసింది.
న్యూఢిల్లీ : చంద్రయాన్-3 ఫలితాలు ప్రపంచం ముందుకు వస్తున్నాయి. చంద్రుని దక్షిణ ధ్రువంపై ఉష్ణోగ్రతల తీరు మొదటిసారి తెలిసింది. చంద్రునిపైగల నేల ఉష్ణోగ్రతలు, చంద్రుని ఉపరితలంలో 10 సెంటీమీటర్ల లోతులో ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉంటాయో వెల్లడైంది. ఈ నెల 23న విజయవంతంగా చంద్రునిపై దిగిన విక్రమ్ ల్యాండర్‌లోని ఛేస్ట్ పేలోడ్ (ChaSTE payload) పంపించిన ఈ తొలి ఫలితాలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ఆదివారం వెల్లడించింది.
చంద్రుని దక్షిణ ధ్రువం వెంబడి ఉపరితలంలోని నేల ఉష్ణోగ్రతల తీరును ఛేస్ట్ (చంద్రాస్ సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్పెరిమెంట్) కొలిచిందని ఇస్రో తెలిపింది. దీని ఆధారంగా చంద్రుని ఉపరితలంపై ఉష్ణోగ్రతలు మారే తీరును అర్థం చేసుకోవచ్చునని తెలిపింది. అంటే, వేడి తగిలినపుడు ఏదైనా వస్తువు ఏ విధంగా స్పందిస్తుందో తెలుసుకోవచ్చు. పరిసరాల నుంచి వచ్చే వేడిని ఏదైనా వస్తువు స్వీకరించినపుడు దాని ఉష్ణోగ్రత పెరుగుతోందా? లేదా? వంటి విషయాలను తెలుసుకోవచ్చు.
చంద్రుని ఉపరితలంలో 10 సెంటీమీటర్ల లోతు వరకు చొచ్చుకెళ్లి ఉష్ణోగ్రతలను కొలిచేందుకు తగిన పరికరాలను ఛేస్ట్లో అమర్చినట్లు ఇస్రో తెలిపింది. ఉపరితలం నుంచి క్రిందికి చొచ్చుకెళ్లే ప్రక్రియ నియంత్రణతో జరుగుతుందని తెలిపింది. దీనికి విడివిడిగా 10 టెంపరేచర్ సెన్సర్లను అమర్చినట్లు తెలిపింది.
ఛేస్ట్ చంద్రుని ఉపరితలంలో వేర్వేరు లోతుల్లో ఉన్నపుడు ఉష్ణోగ్రతల తేడాలను చూపిస్తున్న ఓ గ్రాఫ్‌ను కూడా ఇస్రో ట్వీట్ చేసింది. చంద్రుని దక్షిణ ధ్రువానికి సంబంధించిన ఉష్ణోగ్రతలు మారే తీరును వివరించే మొదటి సమాచారం ఇది. ఈ గ్రాఫ్‌ను పరిశీలించినపుడు చంద్రునిపై ఉష్ణోగ్రతలు మైనస్ 10 డిగ్రీల సెల్సియస్ నుంచి దాదాపు 55 డిగ్రీల సెల్సియస్ వరకు ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ఛేస్ట్ పేలోడ్‌ను స్పేస్ ఫిజిక్స్ ల్యాబొరేటరీ, వీఎస్ఎస్సీ, అహ్మదాబాద్‌లోని పీఆర్ఎల్ సహకారంతో అభివృద్ధి చేసి, తయారు చేసినట్లు తెలిపింది. మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపింది. చంద్రయాన్-3లో ఏడు పేలోడ్స్ ఉన్నాయి. విక్రమ్ ల్యాండర్పైన 4, ప్రజ్ఞాన్ రోవర్పైన రెండు ఉన్నాయి. మరొకటి ప్రొపల్షన్ మాడ్యూల్ పేలోడ్. వీటిని వేర్వేరు శాస్త్రీయ పరిశోధనల కోసం రూపొందించారు.
ఇవి కూడా చదవండి :
2024 Lok Sabha elections : మా ప్రధాన మంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీ : అశోక్ గెహ్లాట్
Britain : భారత్ ఎదుగుదలపై బ్రిటన్ దౌత్యవేత్త వ్యాఖ్యలు