Chandrayan-3: చంద్రుడికి మరింత చేరువైన చంద్రయాన్-3.. వచ్చే వారంలోనే ల్యాండింగ్

ABN , First Publish Date - 2023-08-14T19:07:28+05:30 IST

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘చంద్రయాన్-3’ ప్రయోగంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. చంద్రుడికి ఇది మరింత చేరువ అయ్యిందని..

Chandrayan-3: చంద్రుడికి మరింత చేరువైన చంద్రయాన్-3.. వచ్చే వారంలోనే ల్యాండింగ్

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘చంద్రయాన్-3’ ప్రయోగంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. చంద్రుడికి ఇది మరింత చేరువ అయ్యిందని, కక్ష్య తగ్గింపు విన్యాసాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగిందని సోమవారం ఇస్రో వెల్లడించింది. ఇప్పుడు ఈ వ్యోమనౌక చంద్రుని చుట్టూ 150 కి.మీ x 177 కి.మీ వృత్తాకార కక్ష్యలో ఉందని ఇస్రో తెలిపింది. చంద్రుడి చుట్టు చక్కర్లు కొట్టే విషయంలో రెండో చివరి కక్ష్యలో ఉన్న చంద్రయాన్-3.. ఆగస్టు 16వ తేదీన ఉదయం 8:30 గంటలకు తదుపరి కక్ష్య తగ్గింపు విన్యాసాన్ని చేపట్టనున్నట్టు ఇస్రో పేర్కొంది. దీంతో.. చంద్రుడిపై 100 కి.మీ. ఎత్తున ఉన్న కక్ష్యలోకి ఈ వ్యోమనౌక చేరనుంది.


ఇక అప్పటి నుంచి అసలు కథ మొదలవుతోంది. చంద్రుడిపై 100 కిలోమీటర్ల ఎత్తున చంద్రయాన్-3 చేరాక.. ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి ల్యాండింగ్‌ మాడ్యూల్‌ విడిపోతుంది. ఆ తర్వాతి వ్యవహారాలన్నీ సజావుగా సాగితే.. వచ్చే వారంలో అంటే ఆగస్టు 23వ తేదీన సాయంత్రం సమయంలో చంద్రుడిపై ల్యాండర్ అడుగుపెట్టే అవకాశం ఉంది. అదే జరిగితే.. ఇస్రో సరికొత్త చరిత్ర సృష్టించినట్టే అవుతుంది. అయితే.. చంద్రుని ఉపరితలం సమీపిస్తున్నప్పుడు.. ల్యాండర్ వేగాన్ని సమాంతరం నుంచి వర్టికల్ దిశకు మార్చడమనేది పెద్ద ఛాలెంజింగ్ విషయమని ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ పేర్కొన్నారు. ఈ ల్యాండింగ్ విజయవంతం అవ్వడం కోసం, అలాగే ఇంధన వినియోగాన్ని తగ్గించడం కోసం.. అనుకరణలు, అల్గోరిథంను సర్దుబాటు చేశామని పేర్కొన్నారు.

కాగా.. ఇస్రో ఇప్పటికే రెండు మూన్ మిషన్లను చేపట్టింది. 2008 అక్టోబరు 11న పీఎస్‌ఎల్వీ-సీ11 రాకెట్‌ ద్వారా తొలి మూన్‌ మిషన్‌ను విజయవంతంగా నిర్వహించింది. అనంతరం చంద్రునిపై ల్యాండర్‌, రోవర్‌ను దింపి.. ఉపరితలంపై అధ్యయనం చేపట్టే లక్ష్యంతో చంద్రయాన్‌-2 ప్రయోగాన్ని 2019 జూలై 22న చేపట్టింది. ఆగస్టు 22న ఇది విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశించింది కానీ.. మరికొద్దిసేపట్లో ల్యాండర్ చంద్రునిపై దిగుతుందనగా, అది ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ వైఫల్యం నుంచి పాఠాలు నేర్చుకున్న ఇస్రో.. దానికి కొనసాగింపుగా చంద్రయాన్-3 ప్రయోగాన్ని చేపట్టింది. జులై 14న ఎల్‌వీఎం3-ఎం4 రాకెట్‌ ద్వారా పంపిన ఈ వ్వోమనౌకను.. క్రమంగా కక్ష్యలను తగ్గిస్తూ చందమామకు చేరువ చేస్తున్నారు.

Updated Date - 2023-08-14T19:07:28+05:30 IST