ISRO: శుక్రుడు & అంగారకుడ్ని భారత్ చేరుకునేది అప్పుడే.. ఇస్రో శాస్త్రవేత్త ఇచ్చిన కీలక సమాచారం
ABN , First Publish Date - 2023-11-13T16:54:23+05:30 IST
ISRO: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘చంద్రయాన్-3’ మిషన్ పూర్తిగా విజయవంతం అయ్యింది. చంద్రునిపై అది సాఫ్ట్ ల్యాండింగ్ చేసి, అక్కడ పరిశోధనలు జరిపి, ఎంతో కీలకమైన సమాచారాల్ని భూమికి పంపింది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘చంద్రయాన్-3’ మిషన్ పూర్తిగా విజయవంతం అయ్యింది. చంద్రునిపై అది సాఫ్ట్ ల్యాండింగ్ చేసి, అక్కడ పరిశోధనలు జరిపి, ఎంతో కీలకమైన సమాచారాల్ని భూమికి పంపింది. దీని తర్వాత సూర్యునిపై అధ్యయనం కోసం చేపట్టిన సోలార్ మిషన్ ‘ఆదిత్య ఎల్-1’ సక్సెస్‌ఫుల్‌గా నింగిలోకి దూసుకుళ్లింది. లాగ్రాంజ్ పాయింట్ దిశగా దూసుకుపోతున్న ఈ మిషన్.. మార్గమధ్యంలో నుంచి తన పనిని మొదలుపెట్టేసింది. అనంతరం గగన్‌యాన్ ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్వహించిన ‘టెస్ట్ ఫ్లైట్’ కూడా సక్సెస్ అయ్యింది.
ఇప్పుడు శుక్రుడు, అంగారకుడిపై ఇస్రో దృష్టి సారించింది. ఇందుకు సంబంధించిన పనులు కూడా మొదలైనట్టు ఇదివరకే ఇస్రో వెల్లడించింది కానీ.. ఆ ప్రయోగాలు ఎప్పుడు చేపట్టనున్నారన్న విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. లేటెస్ట్‌గా ఆ కీలక అప్డేట్‌ని బెంగళూరులోని యుఆర్ రావు శాటిలైట్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ ఎం శంకరన్ ఇచ్చారు. ఐదేళ్లలో అంగారకుడు, శుక్రడు గ్రహాలపై భారత్ ఉనికిని గుర్తించాలని ఇస్రో భావిస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ మిషన్ కాన్సెప్ట్‌లపై అంతర్గత చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. అయితే.. ప్రతీ మిషన్‌లోనూ కొన్ని సవాళ్లు ఉంటాయని అన్నారు. అంగారకుడి వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు వ్యోమనౌక వేడెక్కడం, ల్యాండ్ అయ్యేందుకు సరైన ప్రదేశాన్ని కనుగొనడం వంటి సవాళ్లు ఉంటాయన్నారు.
అంతేకాదు.. అంగారకుడు, శుక్రుడు లేదా ఇతర మిషన్‌లకు అవసరమైన భారీ పేలోడ్‌లను మోసుకెళ్లగల ప్రయోగ వాహనాలను అభివృద్ధి చేయాలన్నా అంత సులువు కాదని శంకరన్ తెలిపారు. గత రెండు సంవత్సరాలుగా తాము మేము అంగారక గ్రహంపై ల్యాండింగ్ కోసం మిషన్ కాన్ఫిగరేషన్‌లను అధ్యయనం చేస్తున్నామన్నారు. అయితే.. రెండు అంశాలు తమని వెనక్కు నెట్టేస్తున్నాయన్నారు. అందులో ఒకటి.. విజయవంతం కాని చంద్రయాన్-2 ల్యాండింగ్. ఈ మిషన్ ఫెయిల్ అవ్వడం.. ల్యాండింగ్‌కు అవసరమైన సెన్సార్లపై తమ విశ్వాసాన్ని మందగించేలా చేసిందన్నారు. సెన్సార్లు బాగా పని చేయలేదని కాదని, చివరి లక్ష్యాన్ని సాధించలేకపోయాం కాబట్టి ఇవి సరిపోతాయో లేదో తమకు తెలియదన్నారు. ఇప్పుడు ఏం చేయాలో తెలుసు కాబట్టి, ముందుకు సాగొచ్చన్నారు.
ఇక రెండో సమస్య.. అధిక ద్రవ్యరాశిని కక్ష్యలోకి ప్రవేశపెట్టగల మన సామర్థ్యం గురించి! ప్రస్తుతమున్న LVM3 (లాంచ్ వెహికల్ మార్క్-3, ఇస్రో అభివృద్ధి చేసిన ప్రయోగ వాహనం) కెపాసిటీకి, ల్యాండింగ్ రిక్వైర్‌మెంట్స్‌కి కొంత గ్యాప్ ఉందని.. దీనిపై తాము అధ్యయనం చేస్తున్నామని శంకరన్ చెప్పారు. దీనికితోడు మరో సవాల్ కూడా ఉందన్నారు. అంగారకుడి గ్రహంలోని వేడిని తట్టుకోవడం కోసం ఒక రక్షణ కవచం అవసరం ఉంటుందని, దీంతో ద్రవ్యరాశి పెరుగుతుందని అన్నారు. ఈ విషయంపై తాము పరిశీలనలు జరుపుతున్నామని పేర్కొన్నారు. LVM3 మెరుగు పరిచే పనులు సాగుతున్నాయని.. వచ్చే రెండేళ్లలో 20-30 శాతం ఎక్కువ పేలోడ్ సామర్థ్యాన్ని ఇస్రో అంచనా వేస్తోందని ఆయన వివరించారు.
మార్స్ మిషన్‌కు తమకు ఇప్పుడు అవకాశం ఉందని, ఇందుకు ఒక ప్రణాళిక రూపొందించగలగాలని శంకరన్ పేర్కొన్నారు. ఔట్‌లైట్ ఉంది కాబట్టి.. ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రయాన్-3 సక్సెస్.. తమలో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని, శుక్రయాన్ ప్రాజెక్ట్ కూడా అలాగే విజయవంతం అవుతుందని తాము భావిస్తున్నామని.. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పనుల్ని ముందుకు తీసుకెళ్తామని శుభవార్త కూడా చెప్పారు. భూమి, సూర్యుని సాపేక్ష స్థితిని బట్టి.. అంగారకుడు, శుక్రుడు ప్రయోగాలను ఏ రోజైనా ప్రారంభించవచ్చని తెలిపారు. నాలుగైదు సంవత్సరాలలోపే ఇది సాధ్యం కావొచ్చని ఆయన చెప్పుకొచ్చారు.