Chandrayaan-3: చంద్రయాన్-3 సేఫ్‌గా ల్యాండ్ అవ్వడం ఖాయం.. ఈ 5 మార్పులే అందుకు సాక్ష్యం
ABN , First Publish Date - 2023-08-22T21:05:46+05:30 IST
చంద్రునిపై అడుగు పెట్టేందుకు చంద్రయాన్-3కి మరికొన్ని గంటల సమయమే ఉంది. ల్యాండర్ విక్రమ్ సాఫ్ట్ ల్యాండింగ్ చేసి.. ప్రపంచవ్యాప్తంగా భారత్ సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. ఆగస్టు 23వ తేదీన...
చంద్రునిపై అడుగు పెట్టేందుకు చంద్రయాన్-3కి మరికొన్ని గంటల సమయమే ఉంది. ల్యాండర్ విక్రమ్ సాఫ్ట్ ల్యాండింగ్ చేసి.. ప్రపంచవ్యాప్తంగా భారత్ సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. ఆగస్టు 23వ తేదీన సాయంత్రం 6:04 గంటలకు చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 తొలి అడుగు వేయనుంది. అయితే.. ఇది సేఫ్‌గా ల్యాండ్ అవుతుందా? లేదా? అనే అనుమానాలు మాత్రం అందరిలోనూ ఉన్నాయి. గతంలో చంద్రయాన్-2 ప్రయోగం ల్యాండింగ్‌కి ఇంకొన్ని నిమిషాలే ఉన్నాయనగా విఫలమవ్వడంతో, అదే రిపీట్ అవుతుందేమోనని భయపడుతున్నారు. దీనికితోడు.. రష్యాకు చెందిన లూనా-25 కూడా ఇటీవల క్రాష్ అవ్వడంతో.. చంద్రయాన్-3 పరిస్థితి ఏంటా? అని ఆలోచనలో పడ్డారు.
అయితే.. ల్యాండింగ్ విషయంలో ఎలాంటి భయాందోళనలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని ఇస్రో శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈసారి కచ్ఛితంగా చంద్రయాన్-3 సేఫ్‌గా ల్యాండ్ అవుతుందని వాళ్లు పేర్కొంటున్నారు. ఒకవేళ చంద్రయాన్-3 విపలమైనా, సెన్సార్లు పనిచేయకపోయినా.. అల్గారిథమ్ సరిగ్గా పని చేస్తే ల్యాండర్ విక్రమ్ చంద్రుడిపై ల్యాండ్ అవుతుందని ఇదివరకే ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ చెప్పారు. అంతేకాదు.. ల్యాండింగ్ సమయంలో విక్రమ్ ల్యాండర్‌కు చెందిన రెండు ఇంజన్లు పనిచేయడం ఆగిపోయినా, అది ల్యాండ్ అయ్యే అవకాశం ఉందని ఇస్రో సంస్థ కూడా తెలిపింది. చంద్రయాన్-2తో పోలిస్తే చంద్రయాన్-3తో చాలా మార్పులు చేశామని.. ల్యాండింగ్ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇస్రో పేర్కొంది. ఇంతకీ ఆ మార్పలేంటంటే..
* ల్యాండర్‌కు అమర్చిన రోబోటిక్ కాళ్లను మరింత బలోపేతం చేశారు. ఆ కాళ్ల సహాయంతోనే విక్రమ్ ల్యాండర్ బయటకొస్తుంది. ల్యాండింగ్ సమయంలో సెకనుకు 3 మీటర్ల వేగంతో నడిచినా.. ఆ రోబోటిక్ కాళ్లు విరగవని సమాచారం.
* చంద్రయాన్-2 కన్నా ఇందులో ఇంధనం ఎక్కువగా ఉంది. ఒకవేళ ల్యాండింగ్ చేసే చోటు సరిగ్గా లేకపోతే, అక్కడి నుంచి వేరే ప్రదేశానికి తీసుకెళ్లి చదునైన ప్రదేశంలో ల్యాండ్ చేయడానికి ఈ ఇంధనం పనికొస్తుంది.
* చంద్రయాన్-3కి లేజర్ డాప్లర్ వెలాసిటీ మీటర్ సెన్సార్ జోడించబడింది. దీని సహాయంతో ల్యాండర్‌ను చంద్రునిపై సరిగ్గా దింపొచ్చు. ముందుగా ఇది చంద్రుని ఉపరితలాన్ని పరీక్షిస్తుంది. ల్యాండింగ్ చేయడానికి ఆ ప్రదేశం సరైనదా? కాదా? అని పరిశీలించి, ఓకే అని కమాండ్ పంపుతుంది. అప్పుడు ల్యాండర్‌ని చంద్రునిపై ల్యాండ్ అవుతుంది.
* ల్యాండింగ్‌కి 19 నిమిషాల ముందు విక్రమ్ ల్యాండర్ భూమి నుండి ఆదేశాలను తీసుకోవడం ఆపివేస్తుంది. ఇందులో ఇన్‌స్టాల్ చేసిన సాఫ్ట్‌వేర్స్ పూర్తిగా యాక్టివ్ అవుతాయి. అవి ల్యాండింగ్ కోసం సరైన స్థలం కోసం వెతుకుతాయి. సెన్సార్లు, కెమెరాలు, అధునాతన సాఫ్ట్‌వేర్ సహాయంతో.. విక్రమ్ ల్యాండర్ సరైన చోటు ల్యాండ్ అవుతుంది. కాబట్టి.. చంద్రయాన్-2 తరహాలో పొరపాటు జరగదు.
* విక్రమ్ ల్యాండర్‌లో మెరుగైన విద్యుత్ ఉత్పత్తి కోసం సోలార్ ప్యానెల్‌లను ఏర్పాటు చేశారు. దాని సహాయంతో ప్రజ్ఞాన్ రోవర్ మెరుగ్గా పని చేస్తుంది.
అయితే.. చివరి 19 నిమిషాలు మాత్రం ఎంతో కీలకమైనవి. విక్రమ్ ల్యాండర్ అప్పుడు ఇస్రో నుంచి ఆదేశాలు తీసుకోవడం ఆపేసి, చంద్రయాన్ ల్యాండ్ చేయాల్సిన ప్రదేశం కోసం స్వయంగా అన్వేషిస్తుంది. విక్రమ్ ల్యాండర్‌లో అమర్చిన సెన్సార్లు, కెమెరాల సహాయంతో.. సరైన చోటు కనుగొంటుంది. చంద్రుడిని చేరుకోవడానికి 10 మీటర్ల ముందు థ్రస్టర్‌లన్నీ ఆగిపోతాయి. ఆ తర్వాత విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ చేస్తాడు. అక్కడి వాతావరనం స్థిరపడిన తర్వాత.. అందులో నుంచి ప్రజ్ఞాన్ రోవర్ నెమ్మదిగా దిగుతుంది. ఈ మొత్తం ప్రక్రియకు 3 గంటల కంటే ఎక్కువ సమయం పడుతుంది. అనంతరం ప్రజ్ఞాన్ రోవన్ చంద్రునిపై తన పనిని ప్రారంభిస్తుంది.