Twitter: మోదీ సర్కారు బెదిరించింది

ABN , First Publish Date - 2023-06-14T02:51:12+05:30 IST

ట్విటర్‌ సహవ్యవస్థాపకుడు, ఆ సంస్థ మాజీ బాస్‌.. నరేంద్రమోదీ సర్కారుపై సంచలన ఆరోపణ చేశారు. నూతన సాగు చట్టాలపై రైతులు నిరసన తెలుపుతున్న సమయంలో.. ప్రభుత్వాన్ని విమర్శించే సంస్థలు, వ్యక్తుల ట్విటర్‌ ఖాతాలను నియంత్రించాల్సిందిగా భారత ప్రభుత్వం ఆదేశించిందని.. అలా చేయనిపక్షంలో ట్విటర్‌ను ఇండియాలో మూసేస్తామని బెదిరించిందని ఆయన ఆరోపించారు.

Twitter: మోదీ సర్కారు   బెదిరించింది

సాగు చట్టాలపై నిరసనల వేళ సర్కారును

విమర్శించే ఖాతాల్ని తొలగించాలంది

లేకుంటే ఇక్కడ ట్విటర్‌ను మూసేస్తామంది

మా సిబ్బంది ఇళ్లల్లో సోదాలు చేస్తామని

కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది

ట్విటర్‌ సహవ్యవస్థాపకుడు జాక్‌ డోర్సే

టర్కీ, నైజీరియాల్లోనూ ఇంతేనని వెల్లడి

డోర్సే ఆరోపణలను కొట్టిపారేసిన భారత్‌

అవి పచ్చి అబద్ధాలు: కేంద్ర మంత్రి రాజీవ్‌

న్యూఢిల్లీ, జూన్‌ 13: ట్విటర్‌ సహవ్యవస్థాపకుడు, ఆ సంస్థ మాజీ బాస్‌.. నరేంద్రమోదీ సర్కారుపై సంచలన ఆరోపణ చేశారు. నూతన సాగు చట్టాలపై రైతులు నిరసన తెలుపుతున్న సమయంలో.. ప్రభుత్వాన్ని విమర్శించే సంస్థలు, వ్యక్తుల ట్విటర్‌ ఖాతాలను నియంత్రించాల్సిందిగా భారత ప్రభుత్వం ఆదేశించిందని.. అలా చేయనిపక్షంలో ట్విటర్‌ను ఇండియాలో మూసేస్తామని బెదిరించిందని ఆయన ఆరోపించారు. దేశంలోని ట్విటర్‌ ఉద్యోగుల ఇళ్లల్లో తనిఖీలు కూడా చేస్తామని హెచ్చరించినట్లు చెప్పారు. ‘‘భారతదేశం మాకు చాలా పెద్ద మార్కెట్‌. అలాంటి భారత్‌లో ట్విటర్‌ను మూసేస్తామని మాకు స్పష్టంగా తెలియజేశారు. ‘మీ ఉద్యోగుల ఇళ్లల్లో తనిఖీలు చేస్తాం’ అన్నారు. చేశారు కూడా. ఇదీ ఇండియా.. ఒక ప్రజాస్వామ్య దేశం’’ అని ఆయన అమెరికన్‌ యూట్యూబ్‌ చానల్‌ ‘బ్రేకింగ్‌ పాయింట్స్‌’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్వేదం వెలిబుచ్చారు. ట్విటర్‌ నుంచి తొలగించాలంటూ ప్రభుత్వం నిర్దేశించిన కంటెంట్‌ అంతా.. ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో విమర్శిస్తున్న పలువురు జర్నలిస్టుల ఖాతాల్లోనిదేనని డోర్సే వెల్లడించారు. టర్కీ, నైజీరియా దేశాల్లోనూ తాము ఇలాంటి ఒత్తిళ్లనే ఎదుర్కొన్నామనితెలిపారు. అయితే.. మోదీ సర్కారు డోర్సే ఆరోపణను పచ్చి అబద్ధంగా అభివర్ణించింది.

డోర్సే ఆరోపణలపై కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ స్పందించారు. ‘‘డోర్సే హయాంలో ట్విటర్‌కు భారత చట్టాల సార్వభౌమాధికారాన్ని అంగీకరించడంలో సమస్యలు ఉండేవి. అప్పట్లో ఎవరూ జైలుకు వెళ్లనూ లేదు. ట్విటర్‌ ఇక్కడ మూతపడనూ లేదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. రైతుల నిరసనల సమయంలో ట్విటర్‌లో విపరీతంగా దుష్ప్రచారం జరిగిందని.. నరమేధం లాంటి అసత్య ప్రచారాలు కూడా జరిగాయని.. దాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రయత్నించిందని, లేదంటే పరిస్థితులు మరింత దిగజారి ఉండేవని ఆయన తెలిపారు. డోర్సే ట్విటర్‌ బాస్‌గా ఉన్న సమయంలో ఆ సమయంలో ట్విటర్‌, ఆ సంస్థ సిబ్బంది భారత చట్టాలను పదేపదే ఉల్లంఘించినట్లు చెప్పారు. 2020 నుంచి 2022 నడుమ.. భారతదేశ చట్టాలు తనకు వర్తించవన్నట్టుగా ట్విటర్‌ సంస్థ వ్యవహరించిందని ఆయన ఆరోపించారు. ఇలాంటివే అమెరికాలో జరిగినప్పుడు ట్విటర్‌ అలాంటి ఖాతాలను తనంతట తానే తొలగించిందని గుర్తుచేశారు. అయితే, 2022 జూన్‌ నుంచి ట్విటర్‌ భారత చట్టాలకు లోబడి పనిచేస్తోందంటూ.. ఈలన్‌ మస్క్‌కు పరోక్షంగా కితాబునిచ్చారు. 2021లో ఐటీ మంత్రిగా ఉన్న రవిశంకర్‌ ప్రసాద్‌ కూడా డోర్సే ఆరోపణలపై స్పందించారు.

ట్విటర్‌ను ఎవరూ బెదిరించలేదని ఆయన స్పష్టం చేశారు. ట్విటర్‌ వేదికగా జరుగుతున్న భారత వ్యతిరేక కార్యకలాపాలకు మాత్రమే అడ్డుకట్ట వేశామని ఆయన స్పష్టం చేశారు. ‘‘ఎర్ర కోట వద్ద త్రివర్ణ పతాకాన్ని కిందకు దించేసిన ఫుటేజీపైన, పోలీసులను కొట్టే వీడియోలపైన అభ్యంతరం తెలిపామని ఆయన వివరించారు. అమెరికాలో కాపిటోల్‌ హిల్‌ మీద జరిగిన దాడికి అదేమీ తక్కువ కాదని.. అయితే, అక్కడ (అమెరికాలో) సున్నితంగా వ్యవహరించిన ట్విటర్‌ ఇక్కడ మాత్రం అలా వ్యవహరించలేదని ఆయన ధ్వజమెత్తారు. అలాగే.. భారత్‌లో నివసించకుండా, ధ్రువీకరించని ఖాతాలతో భారత వ్యతిరేక ప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని కోరామని వెల్లడించారు. కాగా.. డోర్సే ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ మోదీ సర్కారుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ప్రభుత్వం ఈ ఆరోపణలకు సమాధానం చెప్పాలని.. సోషల్‌ మీడియా అణచివేతను ఆపాలని ఆ పార్టీ అధికార ప్రతినిధి సుప్రియ శ్రీనతే డిమాండ్‌ చేశారు. మోదీ సర్కారు విపక్షాల గొంతులను నొక్కేస్తోందని ఆమె మండిపడ్డారు. ప్రభుత్వం నుంచి వచ్చిన ఒత్తిడితోనే అప్పట్లో ట్విటర్‌ సంస్థ రాహుల్‌ గాంధీ ఖాతాను బ్లాక్‌ చేసిందని ఆమె ఆరోపించారు.

అప్పట్లో ఏం జరిగింది..

మోదీ సర్కారు రూపొందించిన కొత్త సాగు చట్టాలను నిరసిస్తూ రైతులు ఢిల్లీ శివార్లలో తల పెట్టిన ఆందోళన 2021 జనవరి చివరివారంలో హింసాత్మకంగా మారింది. ఆ సమయంలో.. ‘‘మోదీప్లానింగ్‌ఫార్మర్‌జీనోసైడ్‌’’ అనే హ్యాష్‌ ట్యాగ్‌ ట్విటర్‌లో బాగా పాపులర్‌ అయింది. దీంతో అప్పట్లో భారత ప్రభుత్వం అలాంటి రెచ్చగొట్టే అకౌంట్లను, ట్వీట్లను తక్షణం అడ్డుకోవాలంటూ ట్విటర్‌ను ఆదేశించింది. తొలుత ఆ ఆదేశాలను ట్విటర్‌ అమలు చేసింది. దాదాపు 250 అకౌంట్లను బ్లాక్‌ చేసింది. అలా బ్లాక్‌ చేసినవాటిలో.. కారవాన్‌ మ్యాగజైన్‌ వంటి సంస్థల, పలువురు ప్రముఖ జర్నలిస్టుల ఖాతాలు కూడా ఉన్నాయి. అయితే, వాటిని బ్లాక్‌ చేయడంపై ప్రజల నుంచి తీవ్రనిరసనలు వెల్లువెత్తడంతో.. ఆరు గంటల వ్యవధిలోనే.. మూసివేయడానికి తగిన సమర్థన లేదంటూ ఆ అకౌంట్లను పునరుద్ధరించింది.

దీంతో.. తమ ఆదేశాలు అమలు చేయకుంటే ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ యాక్ట్‌ 2000లోని సెక్షన్‌ 69ఏ కింద చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. దీనికి ట్విటర్‌.. మీడియా సంస్థలు, పాత్రికేయులు, సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకుల ఖాతాలను తాము బ్లాక్‌ చేయబోమని, అది వారి ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. కొన్నాళ్ల తర్వాత.. మోదీ సర్కారుకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ కుట్రలు పన్నుతోందంటూ ‘కాంగ్రెస్‌ టూల్‌కిట్‌’ పేరుతో బీజేపీ నేతలు పెట్టిన ట్వీట్లకు ట్విటర్‌ ‘మ్యానిపులేటెడ్‌ మీడియా’ అని ట్యాగ్‌ చేసింది. ఆ ట్యాగ్‌ను తొలగించాలని ప్రభుత్వం కోరినా ట్విటర్‌ అందుకు అంగీకరించలేదు. దీనిపై నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు ట్విటర్‌ కార్యాలయానికి వెళ్లారు. ఆ సమయంలో ట్విటర్‌ తన సిబ్బంది భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది.

Updated Date - 2023-06-14T02:51:42+05:30 IST