జగన్ చర్యలతో కోర్టులపై ప్రతికూల ప్రభావం
ABN , First Publish Date - 2023-09-26T02:29:14+05:30 IST
సుప్రీంకోర్టులో అప్పటి సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణపై ఆరోపణలు చేస్తూ..
జస్టిస్ రమణపై లేఖ వ్యవహారంలో సుప్రీం వ్యాఖ్య
న్యూఢిల్లీ, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టులో అప్పటి సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణపై ఆరోపణలు చేస్తూ 2020లో అప్పటి ప్రధాన న్యాయమూర్తికి ముఖ్యమంత్రి జగన్ లేఖ రాయడం న్యాయవ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ఆ లేఖ రాసినందున జగన్‌పై చర్యలు తీసుకోవాలని, ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని, షోకాజ్ నోటీసులు జారీచేసి వివరణ కోరాలని న్యాయవాది సుశీల్ కుమార్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. లేఖ ఉద్దేశంపై సీబీఐతో విచారణ జరిపించాలని ఆ పిటిషన్‌లో సుశీల్‌కుమార్ సింగ్ కోరారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, బ్రహ్మప్రకాశ్ శర్మ కేసులో 1953లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉటంకించబోగా, బెంచ్ జోక్యం చేసుకుంది. ‘‘మీరు చెబుతున్నది నిజమేగానీ ఈ అంశం 2020 నాటిది. ఆ తర్వాత ఎటువంటి ప్రకటనా లేదు. మరి ఇంకా కేసు అవసరం ఏమిటి?’’ అని ప్రశ్నించింది. దానికి న్యాయవాది సమాధానమిస్తూ, ఈ అంశంలో ఏదో ఒకటి చేయాలన్నారు. ‘‘మీ వాదనను అంగీకరిస్తున్నాం. (న్యాయ) వ్యవస్థ ప్రయోజనాలకు ఇలాంటివి మంచిది కాకపోవచ్చు. కొన్నిసార్లు ఇలాంటి చర్యల వల్ల ప్రతికూల ప్రభావం కూడా పడవచ్చు. కానీ ప్రస్తుతం ఆ అంశం అకడెమిక్ (పాఠ్యపుస్తకాల చర్చగా మారింది). కాబట్టి ఈ పిటిషన్‌పై ముందుకు వెళ్లడం గురించి పిటిషనర్ నుంచి సూచనలు తీసుకోండి. ఇలా అంటున్నామంటే కేసును మూసివేస్తామని దానర్థం కాదు. మెరిట్స్ ఆధారంగా మీ వాదనలు వింటాం’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.