Joshimath: కుంగిపోతున్న జోషిమఠ్, ఎన్‌డిఆర్ఎఫ్ బృందం మోహరింపు

ABN , First Publish Date - 2023-01-06T20:14:57+05:30 IST

ఉత్తరాఖండ్‌లోని హిమాలయన్ టౌన్ జోషిమఠ్‌లోని ఇండ్లకు పగుళ్లు వస్తూ, భూమి కుంగిపోతుండటంతో ఛమోలీ జిల్లా యంత్రాంగం ..

Joshimath: కుంగిపోతున్న జోషిమఠ్, ఎన్‌డిఆర్ఎఫ్ బృందం మోహరింపు

గోపేశ్వర్: ఉత్తరాఖండ్‌లోని హిమాలయన్ టౌన్ జోషిమఠ్‌ (Joshimath)లోని ఇండ్లకు పగుళ్లు వస్తూ, భూమి కుంగిపోతుండటంతో ఛమోలీ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జాతీయ వైపరీత్యాల నిరోధక బృందాన్ని (NDRF) తక్షణం రంగంలోకి దిగాలని శుక్రవారంనాడు ఆదేశించింది. దీంతో జిల్లా యంత్రాగం, ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందితో కూడిన నిపుణుల బృందం ఆయా ప్రాంతాల్లో పర్యటించి ఇంటింటి సర్వే చేపడుతోంది. గార్వాల్ కమిషనర్ సుశీల్ కుమార్, డిజాస్టర్ మేనేజిమెంట్ సెక్రటరీ రంజిత్ కుమార్ స్వయంగా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు.

కాగా, ఇంతరవకూ 561 ఇళ్లు బీటలు వారినట్టు ఛమోలీ జిల్లా యంత్రాంగం గుర్తించింది. వాటిలో రవిగ్రామ్ వార్డులో 153 ఇళ్లు, గాంధీనగర్ వార్డులో 127, మార్వాడీ వార్డులో 28, లోయర్ బజార్ వార్డులో 24, సింగ్దర్ వార్డులో 52, మనోహర్ బాగ్ వార్డులో 71, అప్పర్ బజార్ వార్డులో 29, సునీల్ వార్డులో 27, పార్సరిలో 50 ఇళ్లు బీటలు వారినట్టు గుర్తించామని జిల్లా యంత్రాంగం ఒక ప్రకటనలో తెలిపింది. డిజాస్టర్ మేనేజిమెంట్ చట్టం-2005 కింద హోటల్ వ్యూ, మలరి ఇన్‌లో పర్యాటకులను రాకపోకలను నియంత్రించారు. మంగళవారంనాడు తొమ్మిది కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించగా, వీటిలో జోషిమఠ్ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన నాలుగు కుటుంబాలు, గురుద్వారా జోషిమఠ్‌కు చెందిన ఒక కుంటుంబం, టూరిస్ట్ హోటల్ నుంచి, మనోహర్ బాగ్, ఇతర ప్రాంతాలకు చెందిన కుటుంబాలు ఉన్నారు. ఇంతవరకూ 38 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

జోషిమఠ్ వెళ్తా: సీఎం

కాగా, జోషిమఠ్‌లో నెలకొన్ని పరిస్థితిపై అత్యున్నత స్థాయి సమావేశంలో చర్చిస్తున్నట్టు చెప్పారు. అధికారుల నుంచి నివేదిక అందగానే తగిన చర్యలు తీసుకుంటామని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ థామి శుక్రవారంనాడు భరోసా ఇచ్చారు.శనివారంనాడు స్వయంగా జోషిమఠ్ వెళ్లి పరిస్థితిని సమీక్షించనున్నట్టు చెప్పారు. బీజేపీకి చెందిన ఒక బృందాన్ని కూడా జోషిమఠ్‌కు పంపుతున్నట్టు తెలిపారు.

కాగా, మార్వాడి వార్డులో గ్రౌండ్ నుంచి వాటర్ లీకేజీ వల్ల ఇళ్లలో భారీ పగుళ్లు వచ్చినట్టు జోషిమఠ్ మున్సిపల్ చైర్మన్ శైలేంద్ర పవార్ తెలిపారు. కొండ చరియలు కారణంగా జోషిమఠంలో నిరాశ్రయులైన కుటుంబాలకు షెల్టర్లు ఏర్పాటు చేయాలని హిందుస్థాన్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ (హెచ్‌సీసీ), నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌టీపీసీ)లను ఛమోలీ జిల్లా యంత్రాగం కోరింది.

బదరీనాథ్‌కు ముఖద్వారం జోషిమఠ్‌...

బదరీనాథ్ పుణ్యక్షేత్రానికి జోషిమఠ్‌ను గేట్‌వేగా పిలుస్తారు. ఎన్‌టీపీసీ చేపడుతున్న అభివృద్ధి ప్రాజెక్టులో జోషిమఠ్ భూమి కుంగిపోవడానికి, రోడ్లు బీటలు వారడానికి కారణమని స్థానికులు చెతుతున్నారు. తాజా పరిణామాలతో వారంతా బెంబేలెత్తుతున్నారు. కొన్నిరోజులుగా ఆందోళనలు కూడా సాగిస్తున్నారు. పరిస్థితి ఇదే విధంగా ఉంటే జోషిమఠ్ కనుమరుగవుతుందని భయాందోళనలు వ్యక్తం చేస్తు్న్నారు. బద్రీనాథ్​ కోసం హెలాంగ్, మార్వాడి మధ్య ఎన్‌టీపీసీ నిర్మిస్తున్న టన్నెల్‌తో పాటు బైపాస్​ రోడ్డు నిర్మాణం ఆపేయాలని డిమాండ్​ చేస్తున్నారు. తపోవన్​– విష్ణుగడ్​ హైడల్​ ప్రాజెక్టు కూడా ఈ విపత్తుకు కారణమని చెబుతున్నారు. నిర్మాణ పనులు నిలిపివేసి, తక్షణం పునరావాసం కల్పించాలని కోరుతున్నారు.

Updated Date - 2023-01-06T20:14:58+05:30 IST