Share News

Tiger Claw Row: మసీదులు, దర్గాల్లోనూ నెమలి ఈకలు ఉంటాయి.. వాటిపై కూడా దాడులు చేయండి

ABN , First Publish Date - 2023-10-26T20:58:19+05:30 IST

ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో పులిగోరు వివాదం నడుస్తోంది. బిగ్‌బాస్ కంటెస్టంట్ నర్తుర్ సంతోష్ ‘పులిగోరు’ ధరించి కనిపించినప్పటి నుంచి ఆ రాష్ట్రంలో ఈ వివాదం మొదలైంది. వన్యప్రాణుల రక్షణ చట్టం 1972 ప్రకారం..

Tiger Claw Row: మసీదులు, దర్గాల్లోనూ నెమలి ఈకలు ఉంటాయి.. వాటిపై కూడా దాడులు చేయండి

ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో పులిగోరు వివాదం నడుస్తోంది. బిగ్‌బాస్ కంటెస్టంట్ నర్తుర్ సంతోష్ ‘పులిగోరు’ ధరించి కనిపించినప్పటి నుంచి ఆ రాష్ట్రంలో ఈ వివాదం మొదలైంది. వన్యప్రాణుల రక్షణ చట్టం 1972 ప్రకారం.. పులులు, సింహాలు, జింకలు, వంటి వన్యప్రాణుల్ని చంపడం.. వాటి గోళ్లు, చర్మాలు, కొమ్ములు వంటివి కలిగి ఉండటం చట్టరీత్యా నేరం. అందుకే.. పులిగోరు ధరించిన ప్రముఖులను అటవీ శాఖ అధికారులు టార్గెట్ చేస్తున్నారు. ఈ జాబితాలో నటుడు, రాజ్యసభ ఎంపీ జగ్గేష్ కూడా ఉన్నాడు. గతంలో ఒక ప్రముఖ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పులిగోరు ధరించి కనిపించడం, ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవ్వడంతో.. ఆయన ఇంట్లోనూ అటవీ శాఖ సోదాలు నిర్వహించింది.


ఇలా తమ పార్టీకి చెందిన నేత ‘పులిగోరు’ వివాదంలో చిక్కుకున్న నేపథ్యంలో.. బీజేపీ నేత అరవింద్ బెల్లాడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మతపరమైన ప్రయోజనాల కోసం మసీదులు, దర్గాల్లో నెమలి ఈకల్ని ఉపయోగిస్తున్నారని.. కాబట్టి వాటిపై కూడా దాడులు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాదు.. జగ్గేష్ పులిగోరు ధరించడాన్ని ఆయన సమర్థించారు. పులిగోరు కొన్ని వందల సంవత్సరాల నుంచి ధరిస్తున్నారని.. గుడ్ వైబ్రేషన్స్ కోసం దీనిని ఉపయోగించడం జరుగుతుందని బెల్లాడ్ పేర్కొన్నారు. పులిగోరు ధరించడం నేరమైనప్పుడు.. మసీదులు, దర్గాల్లో నెమలి ఈకలు వినియోగించడం కూడా తప్పే అవుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. జగ్గేష్‌పై ఫిర్యాదు చేయగలిగినప్పుడు.. మసీదులు, దర్గాల్లో నెమలి ఈకల వినియోగంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎందుకు మౌనంగా ఉన్నారని బెల్లాడ్ ప్రశ్నించారు. సిద్ధరామయ్య దర్గాకు వెళ్లి నెమలి ఈకల నుంచి ఆశీర్వాదం తీసుకుంటారని.. నెమలి మన జాతీయ పక్షి అని.. వాటి ఈకల్ని వినియోగించడం నేరం, చట్టవిరుద్ధమని బెల్లాడ్ పేర్కొన్నారు. ప్రతి మసీదు, దర్గాపై సీఎం ఫిర్యాదు చేయాలని.. వాటిపై దాడులు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

ఇదిలావుండగా.. బిగ్‌బాస్ షోలో వర్తుర్ సంతోష్ పులిగోరు ధరించిన విషయం వెలుగులోకి రావడంతో, అటవీ శాఖ అధికారులు వెంటనే సెట్స్‌కి చేరుకున్నారు. అతడ్ని అదుపులోకి తీసుకొని, ఆ పులిగోరు నిజమైందా? కాదా? అని పరిశీలించారు. టెస్టుల్లో అది పులిగోరేనని నిర్ధారణ కావడంతో.. వర్తుర్ సంతోష్‌ని అరెస్ట్ చేశారు. ఈ వివాదంలో కన్నడ స్టార్ నటుడు దర్శన్ కూడా ఇరుక్కున్నాడు. ఓ ఆలయాన్ని సందర్శించడానికి వెళ్లినప్పుడు.. అతడు పులిగోరు ధరించి కనిపించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవ్వడంతో.. అధికారులు అతని ఇంట్లోనూ తనిఖీలు నిర్వహించారు. అయితే.. ఈ వ్యవహారం ఎక్కడిదాకా వచ్చిందన్న విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు. మరో నటుడు నిఖిల్ కుమారస్వామి కూడా పులిగోరు ధరించి కనిపించగా.. అది ఫేక్ అని, ఎవరో తనకు గిఫ్ట్‌గా ఇచ్చారని, కావాలంటే తనిఖీలు చేసుకోవచ్చని చెప్పాడు.

Updated Date - 2023-10-26T20:58:19+05:30 IST