Karnataka Elections: ఆటో నడిపిన డీకే శివకుమార్
ABN , First Publish Date - 2023-05-10T14:20:25+05:30 IST
బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ కనకపుర నియోజకవర్గంలో ఉదయమే తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఆయన ఒక ఆటో నడుపుతూ అందరి దృష్టిని ఆకర్షించారు. ఒక మహిళ ఆయన ఎడమ వైపు కూర్చోగా, కొందరు పార్టీ కార్యకర్తలు వెనుక సీట్లలో కూర్చుని సందడి చేశారు.
బెంగళూరు: కర్ణాటక ఎన్నికల (Karnataka Elections) పోలింగ్ చరుకుగా జరుగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతానికి 37.25 శాతం ఓటింగ్ నమోదైంది. సాధారణ ప్రజానీకంతో పాటు వివిధ రంగాల ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఆయా పార్టీల అగ్రనేతలు ఓటు హక్కు వినియోగించుకుని గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ (DK Shivakumar) కనకపుర నియోజకవర్గంలో ఉదయమే తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఆయన ఒక ఆటో నడుపుతూ అందరి దృష్టిని ఆకర్షించారు. ఒక మహిళ ఆయన ఎడమ వైపు కూర్చోగా, కొందరు పార్టీ కార్యకర్తలు వెనుక సీట్లలో కూర్చుని సందడి చేశారు.
కాంగ్రెస్ పార్టీ 140 సీట్లు గెలుచుకుంటుందని, అన్ని సర్వేలు ఇదే మాట చెబుతున్నాయని గత వారం డీకే ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు. కలిసికట్టుగా బీజేపీని ఓడించడమే తమ మొదటి ప్రాధాన్యతాక్రమమని, ముఖ్యమంత్రి విషయంలో పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా తాను కట్టుబడి ఉంటానని చెప్పారు. 2023లో కర్ణాటకలోనూ, 2024లో దేశంలోనూ (కేంద్రంలో) తాము (కాంగ్రెస్) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. కాగా, ఎన్నికల అనంతరం మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని బీజేపీ ధీమాగా ఉండగా, ఈసారి 'టర్మ్' తమదని కాంగ్రెస్ చెబుతోంది. జేడీఎస్ పలు స్థానాల్లో బలంగా ఉండటంతో కింగ్ మేకర్ పాత్ర పోషించే అవకాశాలు సైతం ఉన్నాయి.