Karnataka Elections: ఎన్నికల బరిలో 3,000 మందికి పైగా అభ్యర్థులు

ABN , First Publish Date - 2023-04-22T16:50:33+05:30 IST

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల బరిలో 3,044 మంది అభ్యర్థుల నామినేషన్లను అర్హమైనవిగా ఎన్నికల కమిషన్..

Karnataka Elections: ఎన్నికల బరిలో 3,000 మందికి పైగా అభ్యర్థులు

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల బరిలో 3,044 మంది అభ్యర్థుల నామినేషన్లను అర్హమైనవిగా ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అయితే, ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇంకా నామినేషన్ల పరిశీలన పూర్తి కావాల్సి ఉందని కర్ణాటక ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు.

అధికార వర్గాల సమాచారం ప్రకారం, తన నామినేషన్ పత్రాలను తిరస్కరించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసిన కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ నామినేషన్‌కు ఎన్నికల కమిషన్ ఆమోదం తెలిపింది. మొత్తం 3,044 అభ్యర్థుల నామినేషన్లు అర్హమైనవిగా ఈసీ గుర్తించగా, వారిలో బీజేపీకి చెందిన 219 మంది అభ్యర్థులు, కాంగ్రెస్‌ నుంచి 218 మంది అభ్యర్థులు, జేడీఎస్ నుంచి 207 మంది అభ్యర్థులు ఉన్నారు. తక్కినవారిలో చిన్న పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. మొత్తం 4,989 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఈనెల 24వ తేదీతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది.

చివరి నిమిషంలో...

నామినేషన్లకు చివరి రోజైన ఏప్రిల్ 20న ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. చివరి నిమిషంలో కనకపుర నియోజకవర్గానికి బెంగళూరు రూరల్ కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ నామినేషన్ వేశారు. అక్కడ ఆయన పెద్ద సోదరుడు డీకే శివకుమార్ నామినేషన్ వేశారు. ఒకవేళ డీకే శివకుమార్ నామినేషన్‌ను తోసిపుచ్చితే బ్యాకప్ అభ్యర్థిగా డీకే సురేష్‌ చేత నామినేషన్ వేయించారు. దీనికి ముందు, శివకుమార్ నామినేషన్‌ను తోసిపుచ్చేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందంటూ కాంగ్రెస్ వర్గాలు ఆరోపించాయి. తన ఆస్తుల జాబితాను సుమారు 5,000 మంది డౌన్‌లోడ్ చేసినట్టు డీకే గత గురువారంనాడు ఆరోపించారు. ఎట్టకేలకు ఆయన నామినేషన్‌కు ఎన్నికల కమిషన్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో డీకే పోటీకి అడ్డంకులు తొలగిపోయాయి. మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగనుండగా, మే 13న ఫలితాలు వెలువడతాయి.

Updated Date - 2023-04-22T16:50:33+05:30 IST